.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) . .. బాపు పేరు పెట్టకుండా సాంఘికాలు తీసినా అవి పౌరాణిక వాసనతోనే ఉంటాయి . ముత్యాలముగ్గు , గోరంత దీపం అలాంటివే . ఇంక డైరెక్టుగా కలియుగ రావణాసురుడు అని పేరు పెట్టాక రావణాసురం కాక మరింకేం ఉంటుంది !?
కాకపోతే ఈ సినిమాలో జరిగింది ఏమిటంటే ఆంజనేయస్వామి బొమ్మని చేయటానికి ఉపక్రమిస్తే చివరకు అది జాంబవంతుని బొమ్మ అయింది . ముళ్ళపూడి వెంకట రమణ కధ చివర్లో గందరగోళానికి గురయింది . చివర్లో దీప , నూతన్ ప్రసాద్ ప్రహసనాన్ని దూర్చి సినిమా రూటునే మార్చిపడేసారు . సినిమా ఆడలేదు .
Ads
పండితపామరుల ఎవరి మెప్పును పొందలేకపోయింది . కమర్షియల్ గానూ సక్సెస్ కాలేదు . బాలూ మహేంద్ర ఫొటోగ్రఫీని తప్పక అభినందించాలి . శారద కళ్ళను కూడా చాలా అందంగా చూపారు . అయితే ఆయన కూడా పూర్తి సినిమాకు పనిచేయలేదు . మధ్యలో అహమ్మద్ అజ్మీ పనిచేసారు .
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం/దక్షారామం వద్ద ఉన్న దొడ్డంపేట జమీందారు గారి కోట , మారేడుమల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేసారు . వాటి అందాలను చక్కగా చూపారు .
అనగనగా ఓ మారుమూల ప్రాంతంలో ఓ బుల్లి రాజ్యానికి ఓ రావణాసురుడు ఉంటాడు . అతనికో దుష్ట మంత్రి . 101 మందితో కన్నెరికం చేయటం ఆ రావణాసురుడి జీవిత లక్ష్యం . ముళ్ళపూడిని ఒకందుకు మెచ్చుకోవాలి . ఈ కధలో రావణాసురుడి modus operandi కొత్తగా చెప్పారు .
ఊళ్ళో అమాయక భర్తలకి ఇన్సూరెన్స్ చేయించి మొదటి ప్రీమియం కూడా అతనే చెల్లిస్తాడు . ఆ తర్వాత అడవిలో పులి పంజా పేరుతో చంపిస్తాడు . భార్యల్ని చెరుస్తాడు . వాళ్ళకు రావలసిన ఇన్సూరెన్స్ డబ్బుని కాజేస్తుంటాడు . వినూత్న ఆలోచన . ఏ సినిమా లోనూ ఇప్పటికీ ఎవరూ చూపలేదు .
కధలో ఓ రాముడు ఉంటాడు . ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్ . ఒకే ప్రాంతంలో జరుగుతున్న ఈ ఇన్సూరెన్స్ మరణాల మీద అనుమానం వచ్చి పరిశోధన మొదలుపెడతాడు . అందుకు ఆయన మిత్రుడు , పోలీసు ఆఫీసర్ శ్రీధర్ , ఓ డిటెక్టివ్ ఆఫీసర్ నూతన్ ప్రసాద్ తోడవుతారు .
ఇంతలో రావణాసురుడు సీతమ్మను అంటే శారదను మాయమాటలు చెప్పి ఎత్తుకుపోయి కోటలో చెరబడతాడు . దారిలో జటాయువు లాంటి ఓ భైరాగిని గాయపరుస్తాడు . అతని మరణ వాంగ్మూలం ఆధారంగా సీతమ్మను చెర నుండి విడిపిస్తానికి రాముడు , ఆంజనేయస్వాములు , వానర సైన్యం అడవికి బయలుదేరి , రకరకాల నాటకాలతో రావణాసురుడి కధను పరిసమాప్తం చేస్తారు .
కాకపోతే వధ ఉండదు . తనను తానే చంపుకుంటాడు రావణుడు . ఇదీ కధ . వంపులు , మలుపులు తిరిగీ తిరిగి సినిమా పూర్తి అవుతుంది .
జనం చూడకపోయినా సినిమా ఓ క్లాసిక్ . ఆడని సినిమా కాబట్టి క్లాసిక్ అనటం లేదు . బాపు , బాలూ మహేంద్ర మార్కు ప్రకృతి అందాలను చూడొచ్చు . రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య కాంబినేషన్లో ముళ్ళపూడి వ్రాసిన డైలాగులు పేలుతూ ఉంటాయి . ముత్యాలముగ్గు సినిమాలో డైలాగుల్లాగానే ఉంటాయి .
నటీనటుల విషయానికి వస్తే రావు గోపాలరావు , రామలింగయ్యల తర్వాత మొదటి పీట హలానిదే . తర్వాత లంకిణి లాంటి పాత్ర జయవిజయది . ఆ తర్వాత తులసిది .చిన్న ఆంజనేయస్వామి పాత్ర . తులసి శంకరాభరణంలో లాగా అబ్బాయి పాత్ర . ఈ చిన్న ఆంజనేయస్వామికి రక్షణ , తోడు పెద్ద ఆంజనేయ స్వామిగా పోలీసు ఆఫీసర్ శ్రీధర్ .
రాముడి పాత్రలో మురళీమోహన్ సీతమ్మ పాత్రలో శారద , వానర సైన్యంలో నూతన్ ప్రసాద్ , హలం , దీప , ప్రభృతులు ఉంటారు . దీపది కూడా చాలా ప్రాధాన్యత కల పాత్రే . బాగా నటించింది . బాపు అందరి చేత మంచి నటనను రాబడతారు కదా !
కె వి మహదేవన్ నేపధ్య సంగీతాన్ని అభినందించాలి . కోనసీమ కాలువల్లాగా అందంగా , శబ్దం లేకుండా పారుతుంది . నేపధ్య సంగీతం ఎలా ఉండాలో బోయపాటి శీను , కొరటాల శివ సినిమాలకు పనిచేసే సంగీత దర్శకులు ఈ సినిమా నేపధ్య సంగీతాన్ని అధ్యయనం చేయాలి . ఆయన సంగీత దర్శకత్వంలో అన్ని పాటలూ చాలా బాగుంటాయి . బాపు మోడల్లో తోటల్లో , అడవుల్లో , ఔట్ డోర్లో అందంగా చిత్రీకరించబడ్డాయి .
నల్ల నల్లని కళ్ళు నవ్వీ నవ్వని కళ్ళు డ్యూయెట్ చాలా అందంగా ఉంటుంది . ముసలి భార్యాభర్తలకు తాము పడుచోళ్ళుగా ఉన్నప్పటి తీపి రోజులను గుర్తుకు తెస్తుంది . సింగరాల కొండకాడ సింగాన్ని కొట్టబోయి , సెరువులో సేప ఉంది చేతిలో గాలముంది , ఇన్నాళ్ళు నేనెరగనమ్మా , టకీలా ధగడ్ మియా పాటలు బాగుంటాయి .
తులసి , శ్రీధర్ల నమో నమో హనుమంత మహిత గుణవంత చాలా బాగుంటుంది . పుట్టేటి భానుడా పుష్యరాగపు ఛాయ పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . సి నారాయణరెడ్డి , వేటూరిలు బాపు సినిమాకు ఎలా వ్రాయాలో అలాగే వ్రాసారు . యస్ జానకి , సుశీలమ్మ , బాల సుబ్రమణ్యం , ఆనందులు పూర్తి న్యాయం చేసారు .
సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . బాగా తీరిగ్గా ఉన్నప్పుడో , మనసు కళాత్మకంగా ఉన్నప్పుడో చూడండి . లేకపోతే నన్ను తిట్టుకుంటారు . అందమైన సినిమా . చూడతగ్గ సినిమా . ఓపిగ్గా చూడాల్సిన బాపు మార్క్ క్లాసిక్ . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article