.
. ( నాగరాజు మున్నూరు ) .. … ఈవీ రీసేల్ లాస్ మార్జిన్ మీద 18% జీఎస్టీ చెల్లించాలా?
శనివారం జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో… వినియోగించిన విద్యుత్ కార్ల అమ్మకం మీద 18 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కారు అమ్మకం ద్వారా కలిగే లాస్ మార్జిన్ మీద అమ్మకందారుడు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది.
Ads
ఉదాహరణకు ఒక కారును ₹20 లక్షలకు కొన్న వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఆ కారును ₹4 లక్షలకు అమ్మితే వచ్చే నష్టం/లాస్ ₹16 లక్షలు. ఈ ₹16 లక్షల మీద 18% జీఎస్టీ అంటే ₹2.88 లక్షలు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని, దీనికంటే కారును ఎవరికైనా ఉచితంగా ఇవ్వడమో లేదా అలాగే ఇంట్లోనే పెట్టుకోవడం ఉత్తమం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అలాంటి వారిలో ఉన్నత చదువులు చదివినవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఇది అవగాహన రాహిత్యంతో చేస్తున్న తప్పుడు ప్రచారం.
అసలు వాస్తవం ఏమిటో చూద్దాం…
1. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రత్యక్షంగా జరిగే కారు క్రయవిక్రయాలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.
2. సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్లు మాత్రమే 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం రీసేల్ అమౌంట్‌పై కాదు, మార్జిన్ విలువపై మాత్రమే. అంటే డీలర్ కారును కొనుగోలు చేసిన ధర మరియు రీసేల్ చేసిన ధర మధ్య మార్జిన్ విలువ మీద మాత్రమే ఈ 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్ ₹8 లక్షలకు ఒక విద్యుత్ కారును కొనుగోలు చేసి, అదే కారును ₹9 లక్షలకు ఇతరులకు విక్రయిస్తే, లాభం మార్జిన్ ఆయిన ₹ లక్ష మీద 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
9 లక్షలకు EVని కొనుగోలు చేసి రూ. 10 లక్షలకు విక్రయిస్తే, పన్ను కేవలం రూ. 1 లక్ష లాభం మార్జిన్లపై మాత్రమే చెల్లించబడుతుంది.
సెకండ్ హ్యాండ్ పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని మోటారు వాహనాల మీద విధించే పన్ను విధానం ఏకరీతిగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ అధికారిక ప్రకటనతో ఈ వివరణ ఇచ్చింది కాని ఈ నిర్ణయం సెకండ్-హ్యాండ్ కార్ల మార్కెట్‌ను భయాందోళనకు గురిచేసింది అన్నది వాస్తవం. పెరిగిన పన్ను భారం అంతిమంగా వినియోగదారులు భరించాల్సి రావడం వలన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళన మొదలైంది.
నా వ్యక్తిగత అభిప్రాయం
మన దేశంలో ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ పన్ను విధానం మరియు స్లాబ్స్ అత్యంత చెత్తగా ఉంది. నూతన జీఎస్టీ నమోదు నుండి లంచాలు చెల్లించాల్సి రావడం, జీఎస్టీ నమోదు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి రావడం కొత్తగా వ్యాపారాలను ప్రారంభించే వారికి శాపంగా మారింది. ఈజ్ ఆఫ్ డూఇంగ్ బిజినెస్ లో 2014 లో 142 ర్యాంకు నుండి 2021 నాటికి 63 ర్యాంకుకి వచ్చినట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇంకా దారుణమైన స్థితిలో ఉంది అన్నది నా వ్యక్తిగత అనుభవం.
ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకువచ్చిన జీఎస్టీ పన్ను పరిధిలోకి ఇప్పటివరకు మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు తీసుకు రాకపోవడం, దానికి రాష్ట్రాలు అడ్డుగా ఉన్నాయి అని సాకులు చూపడం ప్రజల నుండి పన్నుల రూపంలో డబ్బులు దండుకోవడం కోసమే అన్నది స్పష్టం.
మోదీ ప్రభుత్వం నాలుగవసారి అధికారంలోకి రావాలంటే ముందు ప్రజల్లో అత్యంత నెగటివ్ మార్కులు తెచ్చుకున్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ను మార్చడం, జీఎస్టీ మరియు ఆదాయపు పన్నులను సరళతరం చేసి మధ్యతరగతికి ఊరట నివ్వడం అత్యంత ముఖమైన విషయం….
Share this Article