అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? మగాళ్ల మర్మాంగాలు మరో పాతికేళ్లలో జీరో సైజుకు కుంచించుకుపోతయ్… మనిషి వీర్యంలోని పోతుకణాలు కూడా అంతరించిపోతయ్… మగాళ్లకు అంగస్తంభనలుండవ్, లైంగిక కోర్కెలుండవ్… అసలు మగాడి మగతనమే కాలగర్భంలో కలిసిపోయి, ఉత్త విగ్రహపుష్టి ఆకారాలు మాత్రమే మిగులుతయ్… అంతేకాదండోయ్, ఆడాళ్లకూ అండగ్రహణాలు… పిండదరిద్రాలు… ఆళ్లకూ కోర్కెలుండవ్… మరిక ఆ సంభోగ యాగాలు ఎట్లా..? పిల్లాజెల్లా పుట్టుడెట్లా..? అసలు తిండి, బట్ట, నిద్ర, కొంప… తరువాత మనిషి ధ్యాస, యావ, రంది, ఆశ మొత్తం ఆ పని మీదే కదా… మరి ఆ పనే వీలు కాదు అంటుంటే ఇక మనిషి బతుకుడు దేనికి..? కడుపు నింపుకుని, కాళ్లు జాపుకుని ట్యాబుల్లో ఓటీటీలు చూసుకుంటూ బతకడానికా..? ఈమాత్రం దానికి ఇక కరోనాతో ఫైటింగులు దేనికి..? పోతేపోతాం, ఇక టీకాలు దేనికి..?……….. పొద్దున్నే ఆంధ్రజ్యోతి ఫస్ట్ లీడ్ వార్త చదివాక మానవమాత్రుడు ఎవడైనా సరే, ఇలాగే అనిపిస్తుంది…
చాలాసార్లు అనిపిస్తుంది… టీవీ9 గొప్పదా..? ఆంధ్రజ్యోతి గొప్పదా అని..? ‘‘పోతార్రోయ్, నాశనమైపోతార్రోయ్’’ అనే పిశాచ భాషలో రెండూ ప్రసిద్ధమే… ఎవరు గొప్పో తేలడం కష్టం గానీ ఈ వార్తలోకి వెళ్దాం… అమెరికాలో షన్నా స్వాన్ అనే ఒకామె కౌంట్ డౌన్ అనే పుస్తకం రాసిందట… ఆమె చాలారోజులుగా పర్యావరణంలో పెరుగుతున్న కాలుష్య ప్రభావాల మీద రీసెర్చులు చేస్తోందట… చేసీ చేసీ ఈ విభ్రాంతికరమైన నిజాల్ని కనిపెట్టేసిందట… అవేమిటీ అంటే..? 1973తో పోలిస్తే మనిషి వీర్యంలో 60 శాతం కణాలు పడిపోయాయి… 2045 నాటికి సున్నా అవుతాయట… అంతేకాదు, ష్, కాస్త మెల్లిగా చదవండి… పురుషాంగాలు కుంచించుకుపోతున్నాయట… ఇంకేముంది..? మానవాళి మనుగడే ముప్పు, ఇక కొత్త తరాలు రావు, ఇప్పటి తరాలన్నీ చచ్చిపోతే ఇక ఈ భూగోళం నిజంగానే ‘‘నిర్మానుష్యం’’ అయిపోతుందట…
Ads
వీటికి కారణమేంటీ అంటే..? పీఎఫ్ఎ… ఫరెవర్ కెమెకల్స్ అని పిలవబడే రసాయనాల ప్రభావం… క్లీనర్లు, సబ్బులు, షాంపూలు, టెఫ్లాన్ కోటింగు వంటపాత్రలు, పెయింట్స్, ఫోటోగ్రఫీ, ఫైర్ ఫోమ్, పెస్టిసైడ్స్ ఎట్సెట్రా… మరి ఇప్పుడేం చేయాలి..? ఇవన్నీ లేని పాతరాతియుగంలోకి పోలేం… వీటిని వదులుకోలేం… మళ్లీ ఏ కరోనాయో విరుచుకుపడితే పల్లెలకు పరుగులు తీయగలం, ఐనా ఇవేవీ లేకుండా కాలం కదలదు, స్తంభించిపోతుంది… మరిక అంగస్తంభనలు ఎలా..? పిండస్థాపనలు ఎలా..? ఇక మనిషి జాతికి ప్రపంచవ్యాప్తంగా సపిండికరణ తప్పదా..? ఈ స్వానమ్మ మొత్తం మనిషి భవిష్యత్తును స్కాన్ చేసేసి, జాతకం చదివేసి మరో అబ్బురపడే నిజాన్ని కూడా కనిపెట్టేసింది… (పుస్తకం పేరు కౌంట్ డౌన్ అంటే మనిషి మనుగడకే కాదు కౌంట్ డౌన్, వీర్యంలోని పోతుకణాల సంఖ్య, అంటే ఆ కౌంట్ కూడా డౌన్ అన్నమాట)… ప్రతి మనిషికి వెనుక మలవిసర్జనమార్గం ఉంటుంది, ముందువైపు మర్మాంగరంధ్రం ఉంటుంది… వాటి మధ్య దూరం కూడా ఈ రసాయనాల కాలుష్యంతో మారిపోతుందట… సో, సత్తెనాశ్ ఇలాగైపోతున్నదట…
ఎహె, ఆమె ఏదో రాసింది, వీళ్లు రాసేశారు అంటారా..? పాశ్చాత్యదేశాల్లో కాన్‌స్పిరసీ థియరీలకు గిరాకీ ఎక్కువ… ఇదుగో ఏడాదిలో ప్రళయం, రెండేళ్లలో ఈ భూగోళం నాశనం అని అప్పుడప్పుడూ జోస్యాలు వస్తుంటాయి కదా… వాటినే కాన్‌స్పిరసీ థియరీలంటుంటారు… పుస్తకాలు కూడా రాస్తుంటారు… అమ్ముకుంటారు… ఇలాంటివి పబ్లిష్ చేసేటప్పుడు ఒకటికిపదిసార్లు ఆలోచన, వివేచన, విజ్ఞత కూడా అవసరం… మనిషి పునరుత్పాదక సామర్థ్యం నిజంగా తగ్గుతోందా..? అసలు 1973 సగటు వీర్యకణాల సంఖ్య 60 శాతం తగ్గిపోయింది అని చెప్పాలంటే ఎంత శాస్త్రీయమైన సర్వే, ఎంత సాధికారికంగా జరగాలి..? అలాగే మనిషి మర్మస్థానానికీ, గుదస్థానానికీ నడుమ దూరం పెరిగిపోయింది అని రాసిపారేయడం కాదు, దానికి ఎన్ని పరీక్షల నిరూపణ కావాలి..? ఇప్పటికి ఇలాంటి పరిశోధనలు, ఫలితాలు ఏవీ జరగలేదు, జరిగినట్టు చదవలేదు…
ఎస్, రసాయనాల ప్రభావం మనిషి మీద ఎంతోకొంత ఉన్నది నిజమే… కానీ మరీ ఇలాంటి థియరీలతో వెర్రెక్కించాలా..? అవునుగానీ, ఇవన్నీ నిజమే అయితే ఎలా మరి..,? ఏముంది..? ప్రపంచంలో సగం నేరాలు తగ్గిపోతయ్… మనుషులు ఇంటి చూరును పట్టుకుని ‘వేలాడాల్సిందే’ తప్ప, బయటి స్తంభనలు కూడా బంద్… అసలు ఆడాళ్ల కోర్కెలే అడుగంటాక ఇక మనిషి బతుకు దేనికి..? జస్ట్, స్టెమ్ సెల్స్ నుంచి ఓ మంచి సెల్ పట్టుకుని క్లోనింగు చేయించుకోవడమే… లేదంటే మనిషి వీర్యంలో కష్టమ్మీద దొరికే ఒకటీరెండు వీర్యకణాలు, ఆడమనిషిలోని అండకణాన్ని తీసి, ఫర్టిలిటీ క్లినిక్కుల ల్యాబుల్లో ‘సంభోగం’ చేయించి… అమ్మతనాన్ని రక్షించడమే… లేదంటే ఇక అమ్మతనానికి పిండప్రదానం చేయడమే…!!
Share this Article