.
శంకర్… ఒకప్పుడు స్టార్ డైరెక్టర్… తన సినిమా వస్తుందంటే ఓ సంచనలం… కనకవర్షం… అది గతం… గత వైభవం మాత్రమే…
తను ఎప్పుడో దారితప్పాడు… కథల ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రజెంటేషన్ వరకూ… సరైన ప్లానింగ్ లేదు, సరైన గడువులో సినిమా పూర్తి కాదు… ఖర్చు తడిసిమోపెడు… ఇండియన్ 2 ఒక ఉదాహరణ… తాజా గేమ్ చేంజర్ మరో ఉదాహరణ…
Ads
మరిచిపొండి ఇక శంకర్‌ను… తను గేమ్ చేంజర్ కాదు, ఇది తనకు కమ్ బ్యాక్ మూవీ కూడా కాదు… ఫాఫం దిల్ రాజు… దెబ్బపడింది… మాట తప్పి, క్రెడిబులిటీ కోల్పోయి, దిల్ రాజు ఎదుట వంగిపోయి టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇచ్చిన రేవంత్ రెడ్డికీ షాక్… అన్న కొడుకు సినిమా కదాని, చీఫ్ గెస్టుగా పోయి, అడ్డగోలు టికెట్ రేట్లకు అనుమతించిన పవన్ కల్యాణుడికీ షాక్…
అడ్డగోలు హైపులు, ప్రచారాలు, హంగామా, ఫ్యాన్స్ బలి ఎట్సెట్రా ఏమీ సినిమాను గట్టెక్కించవు… అందులో సరుకుండాలి… రక్తికట్టించే డ్రామా ఉండాలి… ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వాలి… ఏం శంకర్..? ఏముంది ఇందులో..?
గేమ్ ఛేంజర్ కథ రామ్ నందన్ (రామ్ చరణ్) అనే యాంగ్రీ యువకుని చుట్టూ తిరుగుతుంది… తను బాధ్యతాయుతమైన ఓ ఐఏఎస్ అధికారిగా పరివర్తన చెందే ఓ యువకుడి కథ… రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే ఓ బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య) అనే అవినీతి రాజకీయ నేతను ఎదుర్కునే కథ… సొసైటీలో మార్పు కోసం రామ్ చేసే ప్రయత్నం కథ…
రాంచరణ్ తప్పేమీ లేదు… తనకిచ్చిన పాత్రలకు (మల్టిపుల్ లుక్స్) న్యాయం చేయడానికి బాగానే కష్టపడ్డాడు… కానీ కేరక్టరైజేషన్లు సరిగ్గా లేకపోవడంతో ప్రభావరహితడుయ్యాడు… అదీ శంకర్ తప్పే… తనకు ఇచ్చిన అప్పన్న పాత్ర మాత్రం కాస్త బాగుంది… లుక్ కూడా వోకే… ఈ సెగ్మెంట్ ఓ పావుగంట ఉంటుందేమో కానీ సంతృప్తికరం…
కైరా అద్వానీ… ఈమె ఈ సినిమాకు కాస్త గ్లామర్ అద్దినా సరే, ఆమె పాత్రకు కూడా పెద్ద గాఢమైన ఎమోషన్స్ లేవు… విజువల్లీ వోకే… చరణ్‌తో లవ్ ట్రాక్ కూడా రొటీన్… చెప్పుకోవల్సింది ఎస్‌జేసూర్య… పాత్రపరంగా పెద్ద సీన్ లేకపోయినా ఉన్నంతలో తన ప్రతిభ చూపించాడు… సూర్య అంటే సూర్య, దట్సాల్…
హీరోను భిన్న వయోరూపాల్లో చూపించడానికి మాత్రమే ప్రయత్నిస్తే అది కొత్తదనం ఏమవుతుంది..? కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యాంగ్రీ యంగ్‌మెన్ పాత్రల్ని చేయడానికి ఈమధ్య హీరోలు ప్రయత్నిస్తున్నారు, కానీ సరైన కేరక్టరైజేషన్, ప్రజెంటేషన్ లేకపోతే అవి ప్రభావం చూపలేవు…
సరే, మొత్తం కథ గురించి మరిచిపొండి… బలంగా ఉండే సీన్లు రాసుకోవాలి కదా… అంజలికి ముఖ్యమంత్రితో ఘర్షణ సీన్.., రామ్ చరణ్ అంత భారీ జనసందోహం ఎదుట మంత్రిని చెంపదెబ్బ కొడతాడు… నిజానికి ఇది బాగా పేలాలి… కానీ శంకర్ దీన్ని కూడా నీరసంగా చిత్రీకరించాడు…
ఇంటర్వెల్ లాజికల్‌గా లేకపోయినా… ముఖ్యమంత్రిని హఠాత్తుగా ప్రకటించడంసెకండాఫ్ కోసం ఆసక్తిని కలిగిస్తుంది… తరువాత కాస్త అప్పన్న పాత్ర ప్రవేశించి సినిమాను గాడినపడేసినట్టు అనిపించినా, ఆ ఫ్లాష్ బ్యాక్ తరువాత మళ్లీ గాడితప్పింది… ఇక క్లైమాక్స్ మరీ వీక్…
హఠాత్తుగా ఆ ఐఏఎస్ ఏకంగా ఎన్నికల కమిషనర్ అవుతాడు… తన సస్పెన్షన్ విత్ డ్రా చేసుకోవాలని 2000 మంది ఐఏఎస్‌లు లేఖ రాయడం గట్రా పెద్దగా రక్తికట్టలేదు… జస్ట్, ఇది ఓ ఉదాహరణ… మంచి ప్రతిభ ఉన్నా సరే జయరామ్‌కు ఓ సాధారణ కామెడీ పాత్ర ఇచ్చారు…
సునీల్, వెన్నెల కిషోర్ సో సో… శ్రీకాంత్ బెటర్… బ్రహ్మానందం, రఘుబాబు, ప్రియదర్శి, సత్య, వైవా హర్ష, పృథ్వి వంటి చాలామంది ఉన్నా పెద్ద ఇంపాక్ట్ లేదు… అన్నట్టు ఆ పిచ్చి కూతల శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఉన్నాడు…
థమన్ పాటలు బాగా లేకపోయినా, అంటే సాదాసీదాగా ఉన్నా బీజీఎం మాత్రం బాగుంది… కాస్త పాపులరైన నానా హైరానా పాట సినిమాలో కనిపించలేదు ఎందుకో మరి… నిజానికి శంకర్ సినిమాల్లో పాటల గ్రాండ్‌నెస్, ప్రజెంటేషన్ బాగుంటాయి… ఇందులో అదీ పెద్దగా కనిపించలేదు…
మొత్తానికి ఓ రొటీన్ ఓల్డ్ కథ, ప్రజెంటేషన్స్‌తో శంకర్ నిరాశపరిచాడు… ఈ సినిమా కోసం ప్రేక్షకుల జేబులు లూటీ చేయడానికి అడ్డగోలు టికెట్ రేట్స్ పెంచడానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి దగ్గర సమర్థన లేదు… ఉండదు..!! అన్నట్టు… శంకర్ భాయ్, మరీ ఐఏఎస్ అధికారులకు, అధికారాలకు అంత సీన్ లేదు… వాళ్లను రాజకీయ అధికారం పనిచేయనిస్తుందా..?
So…Dear director shankar, with out knowing the game how can you change it …
Share this Article