.
పార్టీల కళ్లద్దాల నుంచి గాకుండా… మీడియాలో కనిపిస్తున్న బోలెడు విశ్లేషణలకు భిన్నంగా కొన్ని నిజాలు చెప్పుకోవాలంటే…
ఎస్, తిరుపతిలో టోకెన్ల రద్దీలో తొక్కిసలాటలో ఆరుగురు మృతి ఒక విషాదం… జరిగి ఉండాల్సింది కాదు… నిజమే, అదొక యాక్సిడెంట్… ఎవరూ కావాలని చేయరు… చేసినట్టుగా కూడా లేదు… కావాలని తొక్కిసలాటకు కారకులైతే అది ఎటు పోయి ఎవరిని చుట్టుకుంటుందో తెలియదు కాబట్టి వ్యూహం ప్రకారం కుట్ర చేశారు అనడానికి హేతువు కనిపించడం లేదు…
Ads
ఓ ఇద్దరు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు, ఏమవుతుంది..? ఏమీ కాదు, ఏ ఆరు నెలలకో మళ్లీ రీఇన్‌స్ట్యూట్ అవుతారు,.. న్యాయవిచారణా..? ఎవరిని తప్పుపట్టాలి..? ఉప్పెనలాగా టోకెన్ల కోసం ముంచెత్తిన భక్తజనాన్నా..? ఐనా అంతిమంగా ఏం జరుగుతుంది..? ఏమీ కాదు… ఎవరిని నిందించాలి..? పుష్కర మృతి తీవ్రమైన ప్రమాదమే కదా…
అడ్డగోలు నిర్లక్ష్యమే కదా… ఎవరికి ఏం శిక్ష పడింది..? అందరూ బాగానే ఉన్నారు కదా… అసలు కారకుడు మళ్లీ పాలకుడు కూడా అయ్యాడు కదా… ఈ తిరుపతి కేసులో ఎవరో ఒకరు అపస్మారకంలో పోతుంటే ఓ గేటు తెరిచి కాపాడే ప్రయత్నం చేశారుట… సరే, అధికారగణం సరైన రీతిలో స్పందించలేదు సరే… అవి ఉద్దేశపూర్వకమైన తప్పులా..? కొన్ని అలా జరిగిపోతుంటాయి…
ఆటలు, భక్తి ఉత్సవాలు, జనం భారీగా గుమిగూడే సందర్భాల్లో మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ తొక్కిసలాటలు, ప్రాణనష్టాలు జరిగాయి… ఎక్కడికక్కడ వీలైనంతగా జాగ్రత్తలు పాటిస్తారు… ఐనా కొన్ని ఇలా జరుగుతాయి, అంతే…
ఇదే తిరుపతి ఇష్యూలో అసలు నిర్లక్ష్యం ఫిజికల్ టోకెన్ క్యూలలో టోకెన్లు ఇస్తామనడం… కానీ ఇంత జరుగుతుందని ఎవరూ అనుకోరు కదా… వీలైనంతవరకూ ఆన్‌లైన్ టోకెన్ల సిస్టం ప్రవేశపెడితే బాగుండేది… ఐనా టీటీడీ అంటేనే పై నుంచి కింది దాకా నిర్లక్ష్యం, అవినీతి, జవాబుదారీరాహిత్యం, తేలికపాటితనం… రాజకీయాలు, సర్కారు పెత్తనమే దాన్ని భ్రష్టుపట్టించాయి…
అసలు ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వార దర్శనాలు ఓ కొత్తతరహా ఉత్సవాల్లాగా తయారయ్యాయి, సరే, భక్తుల నమ్మకం అది… అది తప్పుపట్టడానికి ఏమీ లేదు… అంత జనాన్ని అంచనా వేయకపోవడంతో జరిగింది ప్రమాదం…
అక్కడ టీటీడీ చైర్మన్ తప్పు ఏముంటుంది..? తను చేసే పని క్రౌడ్ మేనేజ్‌మెంట్ కాదు కదా… అలాగే ఈవో, డిప్యూటీ ఈఓలనూ తప్పుపట్టలేం… వాళ్లు యంత్రాంగానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తారు… వాళ్లేమీ లాఠీలు పట్టుకుని క్యూలను పర్యవేక్షించలేరు కదా… కాకపోతే పాలసీ డెసిషన్ల విషయంలో కొత్తగా ఆలోచించలేక, ప్రవేశపెట్టలేని అసమర్థత… అదే వాళ్ల తప్పు అంటే ఇక ఏమీ మాట్లాడలేం…
వాళ్లదే తప్పు అనడంలో పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు ‘సీజ్ ది షిప్’ లాగే బాధ్యతారాహిత్యం, అనాలోచితం… నిజానికి ఓ చోట ప్రమాదం జరిగింది అనుకొండి… ఓ నలుగురైదుగురు మరణించారు అనుకుందాం… ఎవరైనా వెళ్తారా..? పోలీసులు వెళ్తారు, పోస్ట్ మార్టం, ఆసుపత్రికి తరలింపు, పేపర్లలో చిన్న వార్తలు… కానీ తిరుపతికి పోటెత్తినట్టుగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు పరుగులు తీశారు..? కారణం..?
రాజకీయం… జగన్ రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాడుకుంటాడనే భయం… అందుకే జగన్‌కన్నా ముందే వెళ్లడం, సమీక్షలు, తిట్లు, ముఖ్యమంత్రి ఎదుటే టీటీడీ చైర్మన్, ఈవోల వాదులాటలు… (ఆ చైర్మన్, ఆ ఈవో ది గ్రేట్ చంద్రబాబు ది గ్రేట్ ఎంపిక… వార్త చదువుతుంటేనే నవ్వొచ్చింది…) మంత్రుల పరామర్శలు… మీడియా అటెన్షన్ పూర్తిగా అటువైపే… పైగా ఒకరికొకరు బ్లేమ్ గేమ్స్… తలాతోకా లేని వాదనలు…
జగన్ హయాంలో పెట్టిన టోెకెన్ సిస్టమే కారణం అని ఆంధ్రజ్యోతివాడు ఏదో గోకాడు… సాక్షి ఊరుకుందా ఈరోజు నాలుగు పేజీలతో బాది వదిలింది చంద్రబాబును… ఎవరూ తక్కువ కాదు… వాళ్లదీ ఆ టోకెన్ల కోసం వచ్చిన భక్తుల బాపతు మూఢ భక్తే కదా.,.
టీటీడీ బోర్డు మెంబర్ అట ఎవరో… కుట్ర కోణంపై దర్యాప్తు అంటున్నాడు… అంటే జగన్ మీదకు జనం దృష్టిని ఫోకస్ చేయడం… ఇంకెవరో కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి… సుగర్ లెవల్స్ తగ్గిపోయి వాళ్లే చచ్చిపోయారట… ఇవన్నీ మన దిక్కుమాలిన వృత్తి ఫలితమా అని మనం జనానికి చేరవేయడం కళ్లు మూసుకుని, అన్నీ వదిలేసుకుని…
ముందే చెప్పాను కదా… జస్ట్, ఓ యాక్సిడెంట్… నాలుగు రోజులు వాడిని వీడు, వీడిని వాడు… తిట్లు, నిందలు, ఆరోపణలు… అంతే… చూస్తూ ఉండండి… మళ్లీ ఏదో ఉత్సవానికి ఇంతకురెట్టింపు జనం పోటెత్తుతారు… టీటీడీ మారదు, సిస్టం మారదు… భక్తీ తగ్గదు… ఇది రియాలిటీ…
వద్దురా, ప్రమాదంరా బాబూ అన్నా ఎవడూ వినడు… మీ వీథి చివరి గుడిలో దేవుడు లేడా, అక్కడికి వెళ్లొచ్చు కదయ్యా అని చెబితే, నువ్వెవడివిరా చెప్పడానికి అని చెయ్యెత్తినా దిక్కులేదు… అప్పుడు ఏ దిక్కు ద్వారం నుంచి తప్పించుకోవాలో కూడా మనకు తెలియదు… దేవుడు చెప్పడు..!!
Share this Article