.
భార్య మొహం చూస్తూ కూర్చుంటారా?
ఆదివారం కూడా పనికి రండి!
ఐటీ ఉద్యోగులు రోజుకు పది గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే చాలదని… రోజుకు పన్నెండు గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి పద్నాలుగు గంటలు పనిచేయాలని ఆమధ్య ప్రఖ్యాత ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఎక్కడో ఏదో సందర్భంలో అన్నారు.
Ads
మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా అవునవును… లక్షలకు లక్షల జీతాలు, అంతులేని వసతులు, ప్రోత్సాహాలు ఇచ్చేటప్పుడు రోజుకు పద్నాలుగు ఇంటూ వారానికి అయిదు రోజులు ఈక్వల్ టు డెబ్బయ్ గంటలు పనిచేస్తేనే పరిశ్రమ బతికి బట్టగట్టకలుగుతుందని వంత పాడారు.
భారతదేశంలో కార్మిక చట్టాలు ఎంతగా దేవాతావస్త్రాలైనా ఉద్యోగుల పనివేళలకు సంబంధించి ఏవో కొన్ని నియమనిబంధనలు ఉండి చచ్చాయి. అవి ఐటీ కంపెనీలకు అడ్డొస్తున్నాయి. అందుకు చట్టాన్నే మార్చడానికి కర్ణాటక శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలుగా ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా డస్ట్ బిన్లో పడేశారు. ఈ బిల్లు చట్టమై ఉండి ఉంటే… ఉద్యోగుల గుండె గుభిల్లే…
ఒడిలో ల్యాప్ టాప్. చేతిలో స్మార్ట్ ఫోన్. టేబుల్ ముందు డెస్క్ టాప్. ఆఫీస్ లో పని. ఇంట్లో ఆఫీస్ పని. బాత్ రూమ్ కాలకృత్యాల కమోడ్ మీద కూడా వదలని జూమ్ మీటింగులు. భార్యాభర్తల సరస శృంగార హనీమూన్లలో కూడా వదలని ఆఫీసు బాసులు. టార్గెట్లు. ఊస్టింగులు. చేసిన అప్పుల ఈఎంఐ లకు సరిపోయే నెల జీతాల ఐటీ జీవితాలు.
రాత్రీ పగలు పని చేస్తున్నట్టుగానే ఉంది.
కంప్యూటర్ కు- ఫోన్ కు మధ్య తేడా లేదు.
ఫోన్ కు- కెమెరాకు;
వ్యాలెట్ కు- ఫోన్ కు- పోస్టు కార్డుకు మధ్య తేడాల్లేవు.
ఉద్యోగులు 24 గంటలూ పైవారికి అందుబాటులోనే ఉంటున్నారు. చాలా మందికి ఇలా అందుబాటులో ఉండటం కూడా ఒక పనే అనే సంగతి కూడా తెలియదు.
టెక్నికల్ గా ఆల్రెడీ రోజుకు 24 గంటల పని చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుత సందర్భం:-
“ఇంట్లో ఎంతసేపు భార్య మొహం చూస్తారు? మొహం మొత్తదా! మీ మొహాలు మండ! ఆదివారాలు కూడా ఆఫీస్ కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి…” అని దేశంలో పేరున్న ఎల్ అండ్ టీ కంపెనీ అధిపతి ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉద్యోగులకు హితబోధ చేశారు.
ఐటీ కంపెనీలన్నీ వారానికి అయిదు రోజుల పని అంటే… మీరేమో వారానికి ఆరు రోజులు చేయించుకుంటున్నారు? అని ఒక ఉద్యోగి తన నిరసనను వ్యక్తం చేయగా… సుబ్రహ్మణ్యన్ కోపం కట్టలు తెంచుకుంది. “నేను ఆదివారం కూడా పనిచేసున్నాను. మీతో ఆదివారాలు పనిచేయించుకోలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను… ఇక ఆదివారాలు కూడా పని చేయాలి… కమాన్ లెట్స్ బీ ఆన్ జాబ్…” అని ఉద్యోగులకు ఉద్బోధ చేశారు.
“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…”
అని బాధపడ్డాడు అందెశ్రీ.
“మరమనిషయిపోతున్నడమ్మా ఉద్యోగన్నవాడు…”
అని అందెశ్రీని తలుచుకుంటూ పాడుకోవడం తప్ప చేయగలిగింది లేదు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article