.
కన్నెకంటి వెంకటరమణ ….. తిరుపతి విషాద సంఘటన… మేడారం జాతర అనుభవాలు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం, పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారనే వార్తలతో దేశం మొత్తం నివ్వెర పోయింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా, ప్రతీ రోజూ లక్షల సంఖ్యలో భక్త జనులు వెంకన్న దర్శనానికి వస్తున్నా, ఏవిధమైన లోటు, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మంచి పేరుంది.
Ads
టిటిడి చేసే ఏర్పాట్లపై దేశంలోని పలు ప్రముఖ ధార్మిక సంస్థలు, ఆలయాలు అధ్యయనానికి కూడా వస్తాయి. అంతెందుకు, ఇటీవల అయోధ్యలో నిర్మించిన ఆలయంలో కూడా తిరుమలలో చేపట్టిన విధంగానే క్రౌడ్ మేనేజిమెంట్ విధానాలను అమలు చేస్తున్నారు. ఇంత పకడ్బందీ ఏర్పాట్లున్న తిరుపతిలో ఆరుగురు మరణించడం నిర్వాహకులను క్షమించరాని నేరంగా పరిగణించవచ్చు.
ఇదే మాదిరిగా, శబరిమలలో గతంలో, 1999 , 2011 లలో, జరిగిన దుర్ఘటనలో పదుల సంఖ్యలో మరణించారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో జరిగిన సంఘటనలో 121 మంది మరణించడం ఇలా… ఎన్నో ప్రార్థనాలయాల్లో జరిగిన మిస్-మేనేజ్మెంట్ తో మరణాలు సంభవించాయి.
అయితే, ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. దేశంలోనే ఆమాట కొస్తే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర పేరుగాంచింది. అధికారిక లెక్కల ప్రకారంగానే, నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో ఏమాత్రం కనీస సౌకర్యాలు లేని ఈ జాతరకు హాజరయ్యే వారిలో 50 శాతానికి పైగా గిరిజనులు, మరో 30 శాతం భక్తులు గ్రామీణ ప్రాంతం వారుంటారు. ఈ జాతరకు కనీసం ఆరునెలల ముందునుండే ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది.
ప్రధానంగా జాతర రోజుల్లో క్రౌడ్ కాంట్రోల్ కు, ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాల పార్కింగ్, క్యూ లైన్ల ఏర్పాట్లు, ఎప్పటికప్పుడు భక్తులకు సలహాలు, సూచన లివ్వడానికి విస్తృతమైన ఏర్పాట్లు, వేలాది సీసీ టీవీ ల ఏర్పాటు, ప్రతీ కిలోమీటర్ కు ఒక పోలీస్ చెక్ పోస్ట్, దాదాపు 15 వేల మంది పోలీస్ ల విధి నిర్వహణ…
ఇలా ఏమాత్రం రిస్క్ కు తావివ్వకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సమయంలో తిరుమలలో, శబరిమలతోపాటు మరి కొద్ది రోజులల్లో ప్రారంభం కానున్న కుంభమేళాలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళాకు విస్తృతమైన ఏర్పాట్లను చేస్తాయి.
ఇక్కడ, మేడారం జాతరకు మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రమే ప్రమేయముండదు. అయినప్పటికీ, గత పదిహేను జాతరలలో (ఈ వ్యాస రచయిత DPRO హోదాలో అధికారికంగా మీడియా మేనేజ్మెంట్ విధులు నిర్వహించారు,) ఎప్పుడూ కూడా తొక్కిసలాటలు గానీ, అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం గమనార్హం.
ఇక, ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు మేడారం జాతర నిర్వహణ ఒక పెద్ద పాఠం. శిక్షణలో ఉన్న ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులను తప్పనిసరిగా ఈ మేడారం జాతర విధులకు పంపిస్తారు.
నలు దిక్కులా అమ్మల పట్ల భయమూ భక్తీ, శ్రద్దా విశ్వాసం తప్పా మరేం లేని ఈ జాతరకు హాజరయ్యే వారు కేవలం తల్లులను ఎంత కష్టమైనా దర్శించుకోవాలన్న తపన తప్పా, అందరికన్నా, ముందుకు తోసుకుపోయి వెళ్లాలన్న తొందరపాటు ఉండకపోవడమే ఈ జాతర సవ్యంగా జరగడానికి కారణం అని చెప్పవచ్చు.
టోకెన్లు లేవు, కంపార్ట్‌మెంట్లలో బంధించడాలు ఉండదు… క్యూ సాఫీగా సాగిపోతుంది… ఆర్జిత సేవల్లేవు… జస్ట్, మూడు రోజుల్లో కోటిన్నర దర్శనాలు… ఒక్కసారి ఆలోచించండి… చంటిపిల్లలు, ముసలివాళ్లతో కూడా వస్తాయి కుటుంబాలు… స్నానాల దగ్గర, దర్శనాల దగ్గర ఏ తొక్కిసలాటలు ఉండవు… అంత అడవి నడుమ కూడా అన్నీ సజావుగా సాగిపోతాయి…
నాగరికులుగా భావించే భక్తులు దర్శించుకునే తిరుమల, శబరి తదితర దేవాలయాల కన్నా, గ్రామీణ, గిరిజనం దర్శించుకునే మేడారం జాతరలో భక్తుల క్రమశిక్షణను చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది…
————————————————————————————————————————
Share this Article