.
లాస్ ఏంజిల్స్… హాలీవుడ్ ప్రముఖులతోపాటు సొసైటీని ప్రభావితం చేయగల హైప్రొఫైల్ వ్యక్తుల ఇళ్లు తగులబడిపోయాయి… ఆ సంపన్ననగరం ఇప్పుడు పొగలు రేగుతున్న ఓ బూడిదకుప్ప…
నామరూపాల్లేకుండా కాలిపోయింది… పునరుద్ధరణ అసాధ్యం అనిపించేలా…! 12 లక్షల కోట్ల నష్టం అని ఓ ప్రాథమిక అంచనా… ఇంకా ఎక్కువే ఉండొచ్చు…
Ads
40 వేల ఎకరాల మేరకు కార్చిచ్చు కాల్చేసింది… 10 వేల ఇళ్లు బూడిదయ్యాయి… 2 లక్షల మంది ఇళ్లు లేనివారయ్యారు… భవిష్యత్ ప్రమాదాల్ని ఊహించి మరో 2 లక్షల మందిని ప్రభుత్వం ఖాళీ చేయించింది…
కారణాలపై రకరకాల విశ్లేషణలు… మానవ తప్పిదాలంటూ నిందలు… బీమా కంపెనీలు దివాలా తీసినట్టేననే వ్యాఖ్యానాలు… కొన్నాళ్లు సాగుతాయి… ఈ నగర పునర్నిర్మాణం కూడా అమెరికాకు ఓ పెద్ద పరీక్ష…
కార్చిచ్చు తీవ్రతను చూపించే అనేక వీడియోలు భీతావహంగా ఉన్నాయి… నిజానికి అమెరికాకు ప్రకృతితో పోరాడటం కొత్తేమీ కాదు… గడ్డకట్టించే అత్యంత శీతల పరిస్థితులు, ఇదుగో ఇలాంటి కార్చిచ్చులు, టోర్నడోలు, ముంచెత్తే నీటిప్రవాహాలు… వాట్ నాట్..?
అడవుల్ని నరికేస్తూ విస్తరిస్తున్న ఆవాసాలు… ప్రకృతి అమెరికన్‌కు పరీక్ష పెడుతూనే ఉంది… మనిషి అక్కడ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రకృతికి ఎదురుతిరుగుతూనే ఉన్నాడు… ఎంత ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకుని సవాళ్లు విసిరినా సరే… ప్రకృతి బలం ముందు ఎంతటి అగ్రరాజ్యమైనా పిపీలికమే కదా…
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎవ్వరైనా సరే… నేను సురక్షితంగా ఉన్నాను, నాకేమీ కాదు అనే భావనలో ఉంటే అంతకుమించి మూర్ఖ భావన మరొకటి ఉండదు… మరీ అననుకూల వాతావరణ పరిస్థితుల్లో బతికే జనం ఎంతగా రక్షణ మార్గాల్ని అనుసరిస్తున్నా సరే, ఏదో ఒక విపత్తు, ఎప్పుడో ఓ దురదృష్ట క్షణంలో ముంచేయడమో కాల్చేయడమో…
సంపన్న గృహాలు… కోట్లకుకోట్లు ఖర్చుచేసి ఆడంబరంగా సమకూర్చుకున్న ఇళ్లు కాలిపోతే బీమా రావచ్చు గాక… కానీ ఆ ఇళ్లతో పెనవేసుకున్న మెమొరీలు, ముచ్చటపడి ఒక్కొక్కటీ సమకూర్చుకున్న ఆధునిెక సౌకర్యాలు, అలంకరణలు, ఇళ్లల్లో ఇప్పుడు బూడిదగా మారిన జ్ఞాపకాలు…
ఎవడెంత సంపన్నుడైతేనేం..? ఎంత ప్రముఖుడైతేనేం… తరుముకొస్తున్న అగ్నికీలలు… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, భయంతో పరుగులు తీస్తూ… తెల్లారేసరికి ఇంకెక్కడో అనాథగా, అనామకుడిగా ఆశ్రయం పొందే దుస్థితి… డెస్టినీ…
గతంలో కూడా ఇక్కడ విపత్తులు రాలేదని కాదు… కానీ ఈ స్థాయి ఎప్పుడూ లేదు… ఎప్పుడూ అమెరికన్ యంత్రాంగం కూడా సంసిద్ధంగానే ఉంటుంది అక్కడ గతానుభవాల దృష్ట్యా… కానీ ఈ నిప్పుల సునామీని ఎవరాపగలరు..?
ఇళ్లు కాలిపోయిన ప్రముఖుల పేర్లను ఇక్కడ ప్రస్తావించడం లేదు… అనేకులు… చివరకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ కొడుకు ఇల్లు కూడా..! సంక్షిప్తంగా మరొకటి చెప్పుకోవాలి…
కారణాలు ఎలాంటివైనా సరే… కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఓ మార్పు కనిపిస్తోంది… ఎడారుల్లో వరదలు వస్తున్నాయి… కుంభవృష్టి కొన్ని నగరాల్ని అతలాకుతలం చేస్తోంది… పచ్చటి అడవుల్లో మంటలు… అవన్నీ ఎందుకు..? మన మేడారం అడవిలో వేల ఎకరాల్లో చెట్లు అకస్మాత్తుగా నేలకూలాయి… ఏదో జరుగుతోంది..!!
Share this Article