.
బాలకృష్ణ సినిమా అంటే ఏముండాలి..? తరుముడు, తురుముడు… సూపర్ హీరో ఎలివేషన్స్… పంచ్ డైలాగ్స్… యాక్షన్… హీరోయిన్లకు వాచిపోయే స్టెప్పులు… కాస్త అక్కడక్కడా ఎమోషనల్ టచ్… భీకరంగా కర్ణభేరులు పగిలిపోయే దడదడ బీజీఎం…
ఎస్, డాకూ మహారాజ్ కూడా సేమ్… బాలయ్య ఫ్యాన్స్ ఓ సపరేట్ కేటగిరీ… తన బ్లడ్డు తన బ్రీడు సమకూర్చిన ఫ్యాన్స్ ప్లస్ తనదైన సినిమాల్ని ప్రేమించే ఫ్యాన్స్… వాళ్లకు నచ్చేలా దర్శకుడు బాబీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు…
Ads
ఒక సివిల్ ఇంజనీర్ ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ బ్రూటల్ వైల్డ్ యానిమల్‌గా మారే స్టోరీ… ప్లస్ ఓ సామాజిక ఇతివృత్తం టచ్ చేస్తాడు… నిజానికి కథ మామూలుదే… సాదాసీదా… కానీ దాన్ని బాలయ్య అభిమానులు మెచ్చే రీతిలో ఎంగేజింగ్ ప్రజెంటేషన్‌లో దర్శకుడు కాస్త ప్రతిభ కనబరిచాడు…
అఖండలోలాగే ఇందులోనూ రెండు రూపాలు… ఒకటి రెగ్యులర్ బాలయ్య… వైల్డ్ యానిమల్ తరహాలో మరో డిఫరెంట్ బాలయ్య… ఇలాంటి పాత్రలు బాలయ్యకు కొట్టిన పిండి, అలవోకగా చేసుకుంటూ పోయాడు… పాపకు సంబంధించిన ఒకటీరెండు సీన్లలో బాలయ్య అనుభవం కనిపిస్తుంది… ఆ డైలాగ్ డిక్షన్, ఆర్ద్రత బాగుంటయ్…
సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ బాగుంది… లుక్, నటన, పాత్ర కేరక్టరైజేషన్ ఆమెకు ప్లస్… ప్రగ్యా జైస్వాల్ కూడా ఉంది… పర్లేదు… సరే, ఊర్వశిని తీసుకున్నదే బాలయ్యతో చరుపులు, గుద్దుల కోసమట కదా… నిర్మాతే చెప్పాడు… అసభ్యంగా, అశ్లీలంగా, వెకిలిగా ఉన్న దబిడిదిబిడి సాంగ్ స్టెప్పులు ఈ సినిమాకు పెద్ద మరక… ఏమీ బాగాలేదు… బాలయ్య స్థాయికి అది ఏమాత్రం సరిపడని తీరు…
బాబీ డియోల్‌ను విలన్‌గా తెచ్చిపెట్టారు… లోపమేమీ లేదు కానీ పక్కా రొటీన్… తన అప్పియరెన్స్ కూడా అంతంతే… ఐనా బాలయ్య సూపర్ హీరోయిజం ముందు విలన్‌గా ఎవరిని తెచ్చిపెడితేనేం..? ఇంపాక్ట్ ఉండదు…
బాబీ ఓ మామూలు కథనే రాసుకున్నాడు… కాకపోతే దాన్ని బాలయ్య మార్క్ సినిమాలా తీర్చిదిద్దడానికే ప్రయారిటీ ఇచ్చాడు… ఫస్టాఫ్ బాగా ఎంగేజ్ చేస్తుంది ప్రేక్షకుడిని… ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పర్లేదు, కానీ సెకండాఫ్ మరీ రొటీన్… చివరలో కాస్త సాగదీత… ఆ లోపాలన్నింటినీ బాలయ్య కవర్ చేసేస్తాడు కనబడకుండా…
మలయాళీ టామ్ చాకోను తెచ్చుకునీ వేస్ట్ చేసినట్టు అనిపించింది… బలమైన పాత్ర ఏమీ కాదు… ఆ పాత్రల డిజైనే సరిగ్గా లేనప్పుడు బాబీ డియోల్, టామ్ చాకో దేనికి..? మిగతా నటుల గురించి చెప్పడానికేమీ లేదు…
ఈ సినిమాకు సంబంధించి చెప్పాల్సింది తమన్ మ్యూజిక్ కంపోజింగ్… సినిమాకు ప్లస్ పాయింట్ ఇది… తమన్ అసలే బాలయ్య ఫ్యాన్… అఖండతో ఫుల్ జోష్… పాటలు పెద్దగా అలరించలేదు గానీ బీజీఎం విషయంలో మళ్లీ మెరిట్ చూపించాడు… కాకపోతే మరీ అంత సౌండ్ అక్కర్లేదు… బాలయ్య సినిమా అనగానే తమన్ సౌండ్స్ అలాగే భీకరంగా మోగుతాయో ఏమో, తన ప్రమేయం లేకుండానే..!
విజయ్ కార్తీక్ కన్నన్… తమిళ జైలర్ సినిమాటోగ్రాఫర్… ఈ సినిమాలో కూడా తన మెరిట్ చూపించాడు… అనేకచోట్ల విజువల్ ఇంపాక్ట్ కనిపించింది… అన్నీ బాగున్నాయి కానీ ఎటొచ్చీ కథ సాదాసీదా… సెకండాఫ్ ఓ మాదిరి ప్రజెంటేషన్… వీక్ క్లైమాక్స్… ఎడిటింగ్ ప్లస్ ఇంకాస్త బెటర్ సీన్లు రాసుకుని ఉంటే సినిమా పుల్ హిట్ అయిఉండేది… అఫ్‌కోర్స్, ఇప్పటికీ పర్లేదు…
బాలయ్య మార్క్ మాస్ మూవీస్ ఇష్టపడేవారికి సినిమా వోకే… మరి మిగతా వాళ్లకు..? పండుగ ప్రేక్షకులకు..? చూడాలి… గేమ్ చేంజర్ దెబ్బతింది, రాబోయేది వెంకీ ఫన్ ఓరియెంటెడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం… సో, సంక్రాంతి విజేత ఎవరో చెప్పలేం… కానీ ఈ పోటీలకు బాలయ్య అతీతుడు కదా… తన రూట్ తనదే… తన ఫ్యాన్ బేస్ తనదే…!! (ఇది యూఎస్ ప్రీమియర్ షో ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్)…
Share this Article