Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊరుఊరంతా బట్టతలలు… వాళ్లకు ఇదొక రకం హఠాత్ విపత్తు…

January 12, 2025 by M S R

.

ఆకారం- వికారం అన్నవి రూఢిని బట్టి స్థిరపడతాయి. అందరికీ నెత్తిన జుట్టు ఉండడం సహజం. అలా నెత్తిన జుట్టు ఉన్నవారి ఆకారం బాగున్నట్లు…జుట్టు లేనివారు వికారంగా ఉన్నట్లు…ఒక అలిఖిత ప్రమాణం స్థిరపడిపోయింది. దాంతో జుట్టులేనివారిని, బట్టతలవారిని సమాజం అనాదిగా చిన్నచూపు చూస్తోంది. ఎగతాళి చేస్తోంది. అదోలా చూస్తోంది.

ఈ అవమానాలను భరించలేక కొన్ని బట్టతలలు తమ నున్నని రన్ వే మీద కొత్తగా వెంట్రుకలను పొడిపించుకుంటున్నాయి. కొన్ని బట్టతలలు తమ సువిశాల క్రికెట్ గ్రవుండ్ మీద హెయిర్ గ్రాఫ్టింగ్ చేయించుకుంటున్నాయి. పుడమి పొలంలో దుక్కి దున్ని…ఎరువులు చల్లి…నారుపోసి…నీరుపోసి…పైరు పెట్టడంలా…  నిగనిగలాడే ఎడారి తలను దున్ని…చిల్లులు పెట్టి…నూనెలు చల్లి…ఒక్కో వెంట్రుక నారు నాటి…నీరు పోసి…పెంచి పెద్ద చేసి…నాటిన వెంట్రుక ఊడిపోకుండా నిలబెట్టడం రాకెట్ సైన్స్ కంటే సంక్లిష్టమయినది.

Ads

అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి…బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి.
బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు.

bald head

 

“ఊరుకున్నంత ఉత్తమం లేదు;
బోడి గుండంత సుఖం లేదు”
అన్న సామెతను కొందరు ట్రూ స్పిరిట్లో తీసుకుని…బట్టతల సమస్యకు శాశ్వత గుండుతో పరిష్కారం కనుక్కున్నారు. వీరిది శాశ్వత నిజ వైరాగ్య ఆమోదయోగ్య ప్రాక్టికల్ సిద్ధాంతం.

వెంట్రుకతో సమానమయిన వెంట్రుకల మీద వ్యామోహం ఉండకూడదనే పుణ్యక్షేత్రాల్లో తల నీలాలు భక్తి భావనతో సమర్పణ చేస్తూ ఉంటాం. అహంకారానికి తల, తలలోని ఆలోచనలు కారణం. అలాంటి తల నరికి దేవుడి కాళ్లమీద పెట్టాలి. తల నరుక్కుంటే బతికి ఉండము కాబట్టి…తలమీద వెంట్రుకలను నరకడం ప్రతీకాత్మకం. ఇంతకంటే ఇంకా లోతయిన తాత్వికత కూడా గుండు కొట్టించుకోవడంలో ఉంది కానీ…ఆ విషయాలు ఇక్కడ అనవసరం. గుండును గుండు అంటే బాధ. ఎగతాళి. అవమానించడం. ఆట పట్టించడం.

గుండె జారినా పరవాలేదు కానీ… గుండు రాకూడదు… వెంట్రుకలు రాలుతుంటే…గుండె జారినంతపనవుతుంది. మనసు మనసులో ఉండదు. మెదడు చల్లబడి…కొయ్యబారినా పరవాలేదు కానీ…జుట్టు తెల్లబడకూడదు. వయసు ఎనభై దాటి ఏ అవయవమూ స్పందించకపోయినా పరవాలేదు కానీ…నెత్తిన జుట్టు రంగు నలుపు తగ్గకూడదు.

ఇందులో న్యాయం, ధర్మం, అందం- వికారాల స్పృహ, మోసం, ఆత్మన్యూనత లాంటి విషయాల చర్చలో ఎవరి వాదన వారిది.

నెత్తిన ఒత్తయిన జుట్టున్న కరకు మనసు హంతకుడినయినా భరిస్తుంది కానీ…
మెత్తటి మనసున్న నెత్తిన జుట్టులేని మంచి మనిషిని మాత్రం భరించనే భరించదు పాడు లోకం!

తిరుమల వైకుంఠద్వార దర్శనానికి వెళ్ళబోతే…తిరుపతి టోకెన్ల కౌంటర్లలో నేరుగా వైకుంఠానికి వెళ్ళిన వార్తలు, ఫార్ములా వన్ రేస్ అవినీతి కేసులో ఏసిబి విడతలవారి వార్తల ప్రాధాన్యాల మధ్య ఒక బట్టతల వార్త అప్రధానమై…ఎవరూ పట్టించుకోనిది అయ్యింది. నిజానికిది సమాజాన్ని పట్టి పీడిస్తున్న చాలా పెద్ద సమస్య. పెద్ద వార్త.

blad head

మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. నీటి కాలుష్యం వల్ల ఊరందరికీ ఒక్కసారిగా జుట్టు రాలిపోతోంది. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.

చర్మసంబంధవ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు సరఫరా అయ్యే మంచినీటిలో పురుగులమందులేవో కలిసినట్లు నిపుణుల బృందం ప్రాథమిక పరిశీలన. రేప్పొద్దున ఆ నీటిని శుభ్రం చేసి…మళ్ళీ రసాయనాల్లేని మంచినీటిని ఈ మూడూళ్ళకు ఇవ్వచ్చు. కానీ రాలిన జుట్టును తిరిగీ అతికించలేరు కదా! మళ్ళీ జుట్టును మొలిపించలేరు కదా!

పాపం.
కొన్ని వందల తలలు బోడులైతేగానీ…బట్టతలలకు నీటి కాలుష్యం కూడా ఒక ప్రధానమైన కారణమని తెలియలేదు.

తెలుగు నీతి పద్యంలో బట్టతల ఉన్నవాడి నెత్తిన ఖర్మకొద్దీ తాటిపండు దెబ్బ పడి ఏదో అవుతుంది.
ఇక్కడ మహారాష్ట్రలో నీటికాలుష్యం దెబ్బ పడి నెత్తిన బట్టతల లేనివారికి వచ్చి ఏదేదో అవుతోంది.

మీరు తాగే, స్నానం చేసే నీళ్ళల్లో ఏయే విషరసాయనాలున్నాయో ఒకసారి పరీక్ష చేయించుకోండి. సగం రోగాలకు ఆ నీళ్ళే కారణం అని తేలకపోతే…మహారాష్ట్ర బుల్దానా వెళ్ళి తాజా ఊరుమ్మడి బట్టతలలను అడగండి!

“ఒత్తుగ హొయలుపోయిన క్రాపులెక్కడ?
నిగనిగలాడిన ఉంగరాల జుట్టెక్కడ?
పాయలు తీసి అల్లిన జడల జాడలెక్కడ?
ఏవి తల్లీ! నిరుడు మొలిచిన కేశసమూహములు?”
అని బుల్దానా పల్లెలు కేశవిషాదయోగ కవిత్వంతో వివరంగా సమాధానం చెప్తాయి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions