.
Veerendranath Yandamoori…. వింధ్యారణ్య ప్రాంత లోయలో ఒక చిన్న పల్లె ఉంది. పచ్చటి చెట్ల మధ్య సంతోషంగా కాలం గడిపే ఆ గిరిజనులకి ఆకస్మాత్తుగా ఒక విపత్తు వచ్చి పడింది. గుంపులు గుంపులుగా పులులు వచ్చి వాళ్ళ ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకోవటమే కాక ఇళ్ళ మీద కూడా దాడి చేయసాగాయి.
ఆ గ్రామస్థులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. వాళ్ళని రక్షించడం కోసం ద్రోణుడు ధర్మరాజుని పంపాడు.
ధర్మరాజు వెళ్ళి పులుల దాడి కోసం ఆ గ్రామంలో కొన్ని రోజులపాటూ ఓపిగ్గా ఎదురు చూసాడు. అవి వచ్చినప్పుడు వాటి నాయకుడ్ని చంపి, మిగతా వాటిని పాలద్రోలాడు. విజయోత్సాహంతో గిరిజనులు నాట్యాలు చేశారు. ధర్మరాజుకి ఘనంగా సన్మానం చేసి పంపారు.
Ads
కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగేసరికి ఆ క్రూర మృగాలు ఈసారి మరో నాయకుడి ఆధ్వర్యంలో మరింత పెద్ద గుంపుగా గ్రామం మీద పడ్డాయి.
ద్రోణుడు భీముడ్ని పంపాడు. భీముడి ఆయుధం ‘గద’. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో అది ఒకటి. అయితే అది ఏనుగుని సంహరించగలదు, రధాల్ని బద్దలగొట్టగలదు. అంతే తప్ప ‘చురుకైన’ పులుల మీద ఏ ప్రభావమూ చూపించ లేక పోయింది. భీముడు క్షతగాత్రుడై పడిపోయాడు.
అప్పుడు అర్జునుడ్ని పంపగా, అతను వెళ్ళి తన విలువిద్యా నైపుణ్యంతో అన్ని పెద్దపులుల్ని చంపి తన సోదరుడిని రక్షించి వెనక్కి తెచ్చాడు. ద్రోణుడు అర్జునుడ్ని అభినందించాడు.
అయితే సమస్య తీరలేదు. ఏడాది తిరిగేసరికి యవ్వనంతో బలసిన తరువాతి తరం పులులు గ్రామం మీద మరింత భయంకరంగా దాడి చేశాయి. గ్రామస్తులు మళ్ళీ వెళ్ళి ద్రోణుణ్ణి శరణు వేడారు. అతడు ఈసారి ఆఖరి ఇద్దరినీ పంపించాడు.
నకుల సహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు గ్రామ పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, సహదేవుడు గ్రామస్థులకి తగినంత ధైర్యాన్నిచ్చి పులులతో ఎలా యుద్ధం చేయాలో వాళ్ళకి నేర్పి యుద్ధానికి సంసిద్ధం చేసాడు.
ఈసారి పులులు దండెత్తినప్పుడు ఏమాత్రం ప్రాణ నష్టం లేకుండా గ్రామస్థులే వాటిని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకులసహదేవుల్ని “ఇది నిశ్చయంగా మీ విజయం” అంటూ ద్రోణుడు పొగిడాడు.
ఈ కథ మూడు సూత్రాల్ని చెపుతుంది.
– ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు.
– మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం.
– సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే.
క్లిష్టమైన పరిస్థితులలో 1. భయపడకుండా, 2. కంగారు పడకుండా, 3. సరియైన కోణంలో 4. సముచితమైన నిర్ణయాన్ని 5. ఆలస్యం చేయకుండా తీసుకోవటం ఒక కళ.
కొన్ని సమస్యలకి దీర్ఘంగా, లోతుగా అలోచించి నిర్ణయం తేసుకోవాలి. కొన్నిటికి క్షణాల్లో రంగంలోకి దూకాలి.గంటకి నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతి వస్తుంది. వదిలెయ్యాలా? గాలిలోకి లేపాలా? అన్న నిర్ణయం తీసుకోవటానికి 0.01 సెకండ్ సమయం మాత్రమే వుంటుంది. బంతి బౌండరీ లైను దాటితే నువ్వు హీరోవి. వికెట్టుకి తగుల్తే నువ్వు జీరోవి…
Share this Article