.
( రమణ కొంటికర్ల )… ….. ఒక ఐఐటీయన్ ఒక సన్యాసిగా ఎందుకు మారాడు..? తండ్రితో తన జ్ఞాపకాల మ్యాప్ ఏం చెబుతోంది..?
దృశ్యాన్ని చూసే కోణాలేవైనా.. ఎవరి ఆలోచనలేమైనా.. స్వదేశీ, విదేశీ భక్తుల రాకతో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఓ డిబేట్! ఆ చర్చలో మాంక్ గా అవతరించిన ఐఐటీయన్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్.. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ మరో బిగ్ డిబేట్!
Ads
ఐఐటీ పూర్తి చేసిన అభయ్ సన్యాసిగా ఎందుకు రూపాంతరం చెందాడో ఓ నేషనల్ మీడియాతో వెల్లడించాడు సరే! కానీ, అతను తన లైఫ్ జర్నీలో, వివిధ సందర్భాల్లో కొన్ని మ్యాప్స్ వేసుకుని ఓ పేపర్ పై రాసుకున్న విషయాలు క్వైట్ ఇంట్రెస్టింగ్!
ఇంతకీ అభయ్ ఏం రాసుకున్నాడు..? ఎందుకు ఓ బాబాగా అవతరించాడు…?
అభయ్ లైఫ్ జర్నీలో తన తండ్రి పాత్ర చాలా ప్రభావవంతమైందనేది మాత్రం ఆయన వివిధ సందర్భాల్లో రాసుకున్న ఓ చార్ట్ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే, తన తండ్రితో బాల్యంలో గడిపిన సమయం.. తండ్రి చెప్పిన మాటలు.. తన తండ్రిని కలవలేకపోయిన సమయంలో, కాస్త దూరంగా ఉన్న గ్యాప్ లో అభయ్ పై తెలియని ఒత్తిడిని పెంచిందా అన్నదీ అతడి చార్ట్ మనలో ఓ సందేహాన్ని రేకెత్తిస్తుంది.
పెద్ద పెద్ద వాళ్లతో స్నేహం చదువులను దెబ్బతీస్తుందని తన పాపా చెప్పిన మాటలను ఉటంకిస్తూనే అభయ్.. ఓ బుక్ పై నిషేధం అనే సింబల్ డ్రా చేయడం కనిపిస్తుంది. అయితే, తండ్రితో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ తో ఒకింత ఒత్తిడికి గురైన అభయ్.. ఆ ఒత్తిడిని తన చదువులపై పెట్టి ఉత్తీర్ణత సాధించిన తీరు.. ముంబై ఐఐటీలో ఏరోస్పేస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ కార్పోరేట్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేసిన తీరు.. టూ డిఫరెంట్ అండ్ టూ కాంట్రాస్ట్.
ఐఐటీయన్ బాబా అలియాస్ అభయ్ సింగ్ కెనడాలో 36 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేశాడు. తనకు నాలుగు సంవత్సరాలుగా ఓ స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. కానీ, అదీ బ్రేకప్ అయింది. ఆ సమయంలో తాను మద్యం, సిగరెట్లకు బానిసయ్యానని కూడా అతను అంగీకరించాడు.
దానికి తోడు బాల్యం నుంచి తన తల్లిదండ్రులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం.. తన లవ్ కూడా బ్రేకప్ కావడంతో వివాహం వ్యవస్థపైనే తాను విశ్వాసం కోల్పోయాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచంపై నమ్మకం కోల్పోయినప్పుడు.. ఆధ్యాత్మిక మార్గమే తన చివరి గమ్యస్థానంగా భావించిన అభయ్ మాంక్ గా అవతరించాడు. ప్రపంచం పట్ల ఉన్న భ్రమ తొలిగా పోయింది. జీవితం లక్ష్యం శాంతి అని భావించిన అభయ్ సింగ్ అనే సైన్స్ గ్రాడ్యుయేట్ మొత్తంగా ఆధ్యాత్మికవాది అయ్యాడు.
మొత్తంగా అభయే ఓ భిన్నమైన క్యారెక్టర్!
అందుకే ఐఐటీ బాబా అభయ్ ఇప్పుడు మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్! ప్రయాగ్‌రాజ్ అంటేనే బాబా, సాధువులు, సన్యాసులన్నట్టు ఆకట్టుకుంటున్న వేళ.. అభయ్ మరింత సెంటర్ ఆఫ్ అట్రాక్షనయ్యాడు. ఇంతకాలం అనుభవించిన ఆధునిక జీవితానికి దూరంగా, ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడమే అభయ్ అందరినీ ఆకర్షించేందుకు ప్రధాన కారణం.
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్.. శాస్త్ర, సాంకేతిక రంగాల్ని తృణప్రాయంగా వదిలేసి.. ఆధ్మాత్మిక జీవితం కోరుకోవడంలో ఆంతర్యమేంటన్నదే ఓ పెద్ద ప్రశ్న. ముందు ఐఐటీ ఇంజనీర్ కాస్త.. ఆ తర్వాత ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ పట్ల కూడా ఫోకస్ చేయడం తన విభిన్నమైన ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. బాంబేలో నాలుగేళ్ల పాటు ఉన్న అభయ్ బాబా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్ తో ఓ జాబ్ సంపాదించాడు. కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేశాడు. ఆ జాబ్ కూడా నచ్చక కొన్నాళ్ళకు వదిలేశాడు.
ఆ తర్వాత ఇంకేదో చేయాలనుకుని.. తనకిష్టమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ బాట పట్టాడు. ఇంజినీరింగ్ లైఫ్ స్టైల్‌కు బ్రేకప్ చెప్పేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ కోర్సును కూడా పూర్తి చేసి.. తన జీవిత గమనాన్ని మార్చుకున్నాడు. అప్పటికే జీవితం పట్ల ఉన్న తత్వ బోధన మారిందన్నాడు.
ఫోటోగ్రఫీతో ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూనే.. భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు బద్ధలవ్వడం, వరదలు, బీభత్సాల వంటి అదే ప్రకృతి ఆగ్రహం ఒకింత ఆందోళనకు గురి చేసేదట అభయ్ నుంచి. దానికంతటికీ కారణం ఆ లయకారుడు శివుడేనన్న భావనతో.. మరింత లోతుగా శివమయమైన ప్రకృతి అన్వేషణలో భాగంగా ఓ సన్యాసి రూపమెత్తాడు అభయ్.
కొన్ని రోజులు ఆయన విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో కోచింగ్ కూడా ఇచ్చాడు. అకాడమిక్ చదువుల్లో విజయం సాధించినా.. ఎందుకో, జీవితంలో మాత్రం అభయ్ కి సంతృప్తి దొరకలేదు. దాంతో అతను ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. ఆధ్యాత్మికతను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అన్వేషణ మొదలెట్టాడు.
తన ఆరాధ్య దైవం శివుడని చెబుతున్న అభయ్ అనే ఈ మాంక్.. సన్యాసిగా మారాక మాత్రం అదేంటోగానీ ఆధ్యాత్మికతను పూర్తిగా ఆస్వాదిస్తున్నానంటాడు. సైన్స్ ద్వారానే ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకుంటున్నట్లు చెప్పిన అభయ్.. లోతుగా వెళ్లిన కొద్దీ సర్వం శివమయమే అంటాడు.
శివుడే వాస్తవమని, అద్భుతమనే అభయ్.. ఆంగ్లభాషపై తనకున్న పట్టుతో మహాకుంభమేళాకు వస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను రంగరించి అతను మాట్లాడే తీరే అతణ్ని అంత పెద్ద కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. .
అభయ్ సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్‌స్టాలో అతడి పోస్టులు చూడొచ్చు. ఇసుక వేస్తే రాలని జనంలోనూ..మహాకుంభమేళా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందనడంలోనే తన ఐడియాలజీ ఏంటో అవగతమవుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోబైల్ తో పాటు, ఇంటర్నెట్ తెచ్చిన సౌకర్యాలతో.. మనుషుల బంధాలు సోషల్ మీడియా పలకరింపులకే పరిమితం అవుతున్న రోజుల్లో.. అభయ్ సింగ్ స్టోరీ ఓ కేస్ స్టడీ. తన తండ్రితో ఏర్పడ్డ దూరం కూడా తన లైఫ్ జర్నీ ఈవిధంగా గమ్యాన్ని మార్చుకునేందుకు కారణమైందా.. ?
ఎంతో దగ్గరగా మెదిలిన రక్త సంబంధంతో గ్యాప్ ఏర్పడితే పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో జీవితంలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయా..? అనేటువంటి అనేక అంశాలు.. అభయ్ సింగ్ జీవిత గమనంలోని అనూహ్య మలుపులు, ఆయన గీసుకున్న మ్యాపు, పాపా పేరుతో తన తండ్రితో ఉన్న ఎమోషనల్ బాండ్.. ఇవన్నీ పరిపరివిధాల ఆలోచనలు రేకెత్తించేవే!
Share this Article