.
( Aranya Krishna ) .. … బచ్చల మల్లి ఓ మూర్ఖుడి కథ. ఐతే మూర్ఖులు దుష్టులు, దుర్మార్గులు అయివుండాలని లేదు. వారిది దుష్ప్రవర్తన కిందకే వస్తుంది. వాళ్లకీ మనసుంటుంది. హృదయం వుంటుంది. అందులో ప్రేమ వుంటుంది. బాధ్యత వుంటుంది. కానీ అంతకు మించి అహం వుంటుంది.
మూర్ఖత్వం అంటే నియంత్రణ లేని అహంకారమే. అవతలి వ్యక్తుల్లోని బలహీనతల్ని, పరిమితుల్ని ఏ మాత్రం సహించలేక పోవడం మానవ సంబంధాల్లో కనబడే అతి పెద్ద మూర్ఖత్వం. ఇలాంటి వాళ్లు జీవితంలో దిద్దుకోలేని తప్పులు చేస్తారు. తమ జీవితాల్ని, ఇతరుల జీవితాల్ని సంక్షోభంలోకి నెడతారు.
Ads
ఎవరైనా తమ తప్పులు గ్రహించి అవి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలే కానీ గతాన్ని రివైండ్ చేసి, చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం జీవితం ఎవరికీ ఇవ్వదు. వాటి పరిణామాల్ని అనుభవించాల్సిందే. అలాంటి ఓ మూర్ఖుడి కథే “బచ్చల మల్లి”…
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తన కుటుంబ వాతావరణం, చుట్టూ వున్న సమాజం రూపొందిస్తాయి. అలాగని ఏ మనిషికీ తాను చేసే చెడు నుండి మనం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేం. వ్యక్తుల గురించి మన మంచి చెడుల విశ్లేషణలు సమాజ వాతావరణంలో మంచి మార్పులకి దోహదం చేయాలని ఆశించడం తప్ప దిద్దుకోలేని తప్పులు చేసే వ్యక్తులకి మనం చేయగలిగే సహాయం లేదు. మొదటి నుండి చివరి వరకు మనసుని పట్టి కుదిపేసే సన్నివేశాలున్న ఈ సినిమా ఈ తత్వాన్నే మనకి చెబుతుంది.
నేను కథ చెప్పడం కంటే మీరు సినిమా చూడటమే మంచిది. హీరోయిన్ బచ్చల మల్లిని మనసు మార్చుకొని ప్రేమించడానికి కారణం అత్యంత బలహీనంగా వుంది. ఆ పాత్రకిచ్చిన క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. కథని ప్రెజెంట్ చేయడంలో ఎంతో మంచి స్క్రీన్ ప్లే ప్రతిభని చూపించిన దర్శకుడు హీరోయిన్ పాత్ర రూపకల్పనలో విఫలమయ్యాడు.
మల్లిని మొరటుగా, మూర్ఖంగా చూపించాలనే తాపత్రయంలో అతన్నో పెద్ద ఫైటర్ గా చూపించదం కూడా నాకు నచ్చలేదు. ఈ రెండు విషయాలు మినహాయిస్తే సుబ్బు దర్శకత్వం చాలా బాగుంది. చాలా విషయం వున్నవాడు ఇతను.
అల్లరి నరేష్ నటన చాలా ఉన్నత స్థాయిలో వుంది. గతంలో కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ వేసి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అతనికి ఇంతవరకు రాలేదు. అతను ఏ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనో వుండాల్సిన వాడు. రావు రమేష్, రోహిణి అదరహో అనిపించారు. మంచి పాత్ర దొరకాలే కానీ వారెంతటి మంచి నటులో ఈ సినిమా సాక్ష్యం చెబుతుంది. ‘బలగం’ జయరాం, వైవా హర్ష, హరితేజ, ప్రవీణ్ కూడా బాగా చేశారు.
చిన్న పిల్లాడితో బూతు మాటలు, ముదురు డైలాగులు చెప్పించి సొమ్ము చేసుకునే “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా నచ్చని వారికి “బచ్చల మల్లి” నచ్చుతుంది. అమెజాన్ ప్రైం లో వుంది సినిమా. చూడండి.
Share this Article