.
‘ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు’… తన పాత సినిమాల పాపాలు కడిగేసుకోవడానికి రాంగోపాలవర్మ ఏదో సిండికేట్ అనే సినిమా తీస్తున్నాడట కదా… దానికి పెట్టిన ట్యాగ్ లైన్ ఇదీ…
నిజమే… మస్తు చెప్పినవుర భయ్… హైదరాబాద్, మీర్‌పేట ప్రాంతంలోని ఓ నేరం గురించి చదువుతుంటే హఠాత్తుగా ఆ వాక్యమే గుర్తొచ్చింది… ఒళ్లు గగుర్పాటు… నేరం తీరు, ఆ సీన్లు ఊహిస్తుంటే దెయ్యాలు, పిశాచాలు కూడా గజగజ వణికిపోతాయేమో…
Ads
మనిషి క్రూరుడే… డౌట్ లేదు… కానీ ఆ క్రూరత్వం తీవ్రత ఇంతగా ఉంటుందా అనిపించేలా… కేసు వివరాలు రాసి, పొద్దున్నే మూడ్ ఖరాబ్ చేస్తున్నందుకు పాఠకులు క్షమించాలి… కానీ దాని తీవ్రత అలాంటిది…
ప్రకాశం జిల్లా, జేపీ చెరువు… గురుమూర్తి అని ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్… వెంకటమాధవితో 13 ఏళ్ల క్రితం పెళ్లయింది… ఇద్దరు పిల్లలు… హైదరాబాద్‌కు వచ్చి జిల్లెలగూడ, న్యూవెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు కొంతకాలంగా… ఆయన కంచన్‌బాగ్, డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు…
తనకు భార్య మీద అనుమానం తలెత్తింది… తరచూ గొడవలు జరిగేవి… ఆయనలో క్రమేపీ కోపం కట్టలు తెంచుకుంది… ఆమె ఖతం చేయాల్సిందే అని తీర్మానించుకున్నాడు… ఆధారాల్లేకుండా హతం ఎలా చేయాలో పలు యూట్యూబ్ చానెళ్లు, ఇతర సోషల్ మీడియా సైట్లు గట్రా చూశాడు… యూట్యూబ్ నేర్పించేది అదే కదా సులభంగా… కొన్ని క్రైమ్, హారర్ సినిమాలు చూశాడు… ఓ ప్లాన్ వేసుకున్నాడు మనసులో…
రీసెంటుగా వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా కూడా చూసినట్టున్నాడు… సొసైటీకి నేరాలు నేర్పేది కూడా సినిమాలే… మటన్ నరికే ఓ చెక్క దిమ్మె కొన్నాడు… మంచి బరువైన కత్తి కూడా… తరువాత..?
ముందుగా ఓ కుక్కను చంపాడు… రిహార్సల్ చేశాడు… ఈనెల 16న మళ్లీ గొడవ జరిగింది భార్యాభర్తల నడుమ… చంపేశాడు… ముక్కలుగా నరికాడు ఆమె మృతదేహాన్ని… వాటిని కుక్కర్‌లో వేసి ఉడకబెట్టాడు… ఎండబెట్టాడు… కాల్చి, రోకలితో దంచి పొడి చేశాడు… డ్రైేనేజీ మ్యాన్‌హోల్‌లో పారబోశాడు… దగ్గరలోని చందన చెరువులో కొంతభాగం కలిపేశాడు…
క్రూరత్వం అనే పదాన్ని మించిన మరోపదం కావాలి నిజానికి ఈ ధోరణిని సరిగ్గా చెప్పాలంటే..! కనిపించడం లేదని, చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు… మేడ్చల్‌లో ఉండే అత్త ఉప్పాల సుబ్బమ్మకు వీడి మీద మొదటి నుంచీ డౌటే… పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసుల వద్దకు భర్త కూడా వచ్చి అమాయకంగా తనకేమీ తెలియదన్నట్టు నటించాడు…
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చూశారు… భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఫీడ్ కనిపించలేదు… కానీ గురుమూర్తి అనేకసార్లు ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది… దాంతో తనమీదే సందేహాలు మొదలయ్యాయి…
గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ‘కాస్త తమదైన శైలిలో’ విచారిస్తే అన్ని నిజాలూ బయటపడ్డాయి… విచారించే క్రమంలో ఆ నిజాలు వింటూ పోలీసులు ఎంతగా షాక్‌కు గురయ్యారో… నిజమే కదా… ‘ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు’ కదా… ఐనా జంతువుల్లో ఈ క్రూరత్వం ఉండదు కదా..!!
Share this Article