.
ఫోను బ్రాండ్‌ను బట్టి, అందులో ఛార్జింగ్‌ను బట్టి మారే క్యాబ్ రేట్లు
అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర నిముషంలో అన్నం తెప్పించుకోవచ్చు. అర నిముషంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అర నిముషంలో డబ్బు తెప్పించుకోవచ్చు. పంపవచ్చు.
Ads
విమానం టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ గదులకు డబ్బు కట్టవచ్చు. ఫోటోలు తీయవచ్చు. వీడియోలు రికార్డ్ చేయవచ్చు. వార్తలు చదవచ్చు. వినవచ్చు. చూడవచ్చు. ఇంకా ఎన్నెన్నో చేయవచ్చు.
ఇప్పుడు ప్రతి పనికీ ఒక యాప్. గోరటి వెంకన్న చెప్పినట్లు- ఆన్‌లైన్‌లో అంతా “అంగడి మాయ”. దైనందిన జీవితం మొత్తం యాప్‌ల మయం.
ప్రతిరోజూ ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల్లో కోట్లకుకోట్లు పోగొట్టుకునేవారి కథలు పుంఖానుపుంఖాలుగా వింటూనే ఉన్నాం. సాంకేతికత పెరిగేకొద్దీ సేవల్లో సౌలభ్యం, వేగం ఎంతగా పెరుగుతాయో… మోసాలు, దోపిడీలు కూడా అంతే వేగం అందుకుంటాయి.
మనం ఆన్‌లైన్లో ఏది వెతికితే, ఏది వింటే, ఏది చూస్తే, ఏది ఆర్డర్ ఇస్తే… అవే పదే పదే మన ముందుకు సజెషన్స్‌గా ఆటోమేటిగ్గా వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటు చేసి పెడుతుంది. మన బలహీనత మీదే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా బలంగా దెబ్బకొడుతుంది. మన ప్రమేయం లేకుండానే మనం దాని చేతిలో బందీలం అయిపోయాం.
జార్ఖండ్ రాష్ట్రంలో జామ్‌తారా జిల్లాలో సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్పించే శిక్షణ సంస్థలు వెలిశాయని ఓటీటీలో వెబ్ సీరీస్ చూసి తెగ ఆశ్చర్యపోయాం. కొన్ని లక్షలమంది సైబర్ నేరాల్లో బుద్దిగా శిక్షణపొంది… ఆన్‌లైన్ దోపిడీలను చక్కటి వృత్తిగా ఎంచుకుని ఎలా స్థిరపడ్డారో తెలుసుకుని బాధపడ్డాం.
పూటగడవక ఆన్‌లైన్ దోపిడీలను వృత్తిగా ఎంచుకోవడాన్ని కూడా సమాజం కొంతవరకు అంగీకరించినట్లుంది. అదే ఆన్‌లైన్ దోపిడీని ఆ సర్వీసులు అందించే యాప్ వాడే చేస్తే? అలా దోపిడీ చేయడానికి వీలుగానే యాప్‌లో సాఫ్ట్‌వేర్ కోడ్ రాసి పెడితే? దేవుడు కూడా మనల్ను రక్షించలేడు. అలాంటి యాప్ అధికారిక దోపిడీ వార్త ఇది.
మనం ఫోన్లో ఉబర్, ఓలా లాంటి యాప్‌ల ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకుంటాం. మన ఫోన్ రకాన్ని బట్టి, అందులో ఛార్జింగ్ శాతాన్ని బట్టి క్యాబ్ ధరలను నిర్ణయించేలా యాప్‌ను తయారుచేసినట్లు ఢిల్లీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త రిషబ్ సింగ్ కనుగొన్నాడు.
ప్రయోగాత్మకంగా మూడు నాలుగు కంపెనీల ఫోన్లను ముందు పెట్టుకుని… ఒక్కో ఫోన్లో ఛార్జింగ్ శాతంలో తేడాలు ఉండేలా చేసి… ఒకేసారి అన్ని ఫోన్ల నుండి ఒకే దూరం ప్రయాణానికి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. ఎక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్ బుక్ చేసిన క్యాబ్ ధర తక్కువగాను, అతి తక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్ బుక్ చేసిన క్యాబ్ ధర అతి ఎక్కువగాను ఉండడాన్ని సాక్ష్యాధారాలతో రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించాడు.
ఇలా ఒక్కో యాప్ వాడు ఎన్నెన్ని మోసాలు చేస్తున్నాడో! ఇప్పటికే చేశాడో! ఇంకా ఎన్నెన్ని చేయబోతాడో! అయిపోయే ఛార్జింగ్‌కు ఏమి తెలుసు పాపం!
రేప్పొద్దున మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసి బుక్ చేయబోతే… ముందు ఆ ఛార్జింగ్ కొన ఊపిరికి పడిపోయేలా చేసి… తరువాత మీ బుకింగ్‌ను తీసుకునేలా వాడు కృత్రిమ మేధమ్మను ఉసిగొల్పడని గ్యారెంటీ ఏమిటి?
నిజమే. ఇది-
“అరచేతి అద్దాల అంగడి మాయ!
దాని దెబ్బకు మనిషి బతుకు బొంగరమైపాయ!!”
ఏ పులి మేకను రక్షిస్తుంది గనుక! అంటూ పులి చంపిన లేడి నెత్తురును చూపించారు కవులు. అలా మనల్ను ఏ యాప్ రక్షిస్తుంది గనుక! అని ఈ ఛార్జింగ్ ఆధారిత దోపిడీలను, యాపులు పిండిన నెత్తురును చూడాలి.
సాధారణంగా చేలకు రక్షణగా కంచెలుంటాయి. కంచెలే చేను మేసే ఈ ఆధునిక ఆన్‌లైన్ సాగులో- “ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” లాంటి కృత్రిమ మేధకు విరుద్ధమైన ప్రకృతి సహజసిద్ధమైన సామెతలను మననం చేసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు!
కొస మెరుపు:-
మీరు ఏదైనా వస్తువు కొనడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ సంస్థల యాప్స్ ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఒక ధర, ఐఫోన్ అయితే ఒక ధర చూపిస్తాయి. ఫోన్ రేటును బట్టి ఒకే వస్తువు ధర మారుతూ ఉంటుంది. ఎక్కువ డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన సాంకేతిక దోపిడీ వ్యవస్థ ఇది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article