.
– పమిడికాల్వ మధుసూదన్ 9989090018 పార్కింగ్ చోటు ఉంటేనే కారు రిజిస్ట్రేషన్
భారతదేశంలో మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. ఈ సమస్య మహానగరాల్లో మహానరకంలా తయారవుతోంది.
Ads
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. సింగపూర్, లండన్ లాంటి చోట్ల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించడానికి, బిజీ వేళల్లో రోడ్లమీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు.
ఉన్నవారు, లేనివారు లండన్లో వందేళ్ళుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన ట్యూబ్ (భూ గర్భంలో తిరిగే రైలు) లోనే తిరుగుతున్నారు. లండన్ ట్రేడ్ మార్క్ అయిన డబుల్ డెక్కర్ రెడ్ కలర్ సిటీ బస్సు ప్రతి అయిదు నిముషాల్లోపు ఒకటి దొరికేలా ప్రజారవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు.
ట్యూబ్, సిటీ బస్ ఆగితే లండన్ కాలు కదలదు. వ్యక్తిగత వాహనాలు ఏయే వేళల్లో లండన్లో ఏయే జోన్లలో తిరగవచ్చో నిర్ణయించారు. ఎలెక్ట్రిక్ వాహనాలు తప్ప మిగతా వ్యక్తిగత వాహనాలు సెంట్రల్ లండన్లోకి ప్రవేశించాలంటే వణుకు పుట్టేలా ఎంట్రీ చార్జీలను విధిస్తున్నారు.
లండన్లో తిరుగుతున్నప్పుడు ట్యూబ్, డబుల్ డెక్కర్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వారి నగర ప్రణాళిక; రోడ్లు, పార్కింగ్ ప్లేస్ ల నిర్వహణ; మనముందుకు ఏ నంబర్ బస్సు ఎన్ని నిముషాల్లో వస్తుందో తెలిపే కచ్చితమైన యాప్; కార్డు ద్వారానే టికెట్ కు చెల్లింపులు… అన్నీ చూస్తున్న, అనుభవిస్తున్న ప్రతిసారీ నాకు అసూయగా ఉంటుంది. మన దగ్గర ఆటోలు తిరిగినట్లు అక్కడ డబుల్ డెక్కర్ బస్సులు సునాయాసంగా తిరుగుతున్నాయి.
చేతిలో రెండు పెద్ద సూట్ కేసులున్నా… ట్యూబ్ లో, సిటీ బస్సులో ఇంకొకరి సాయం అవసరం లేకుండా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, ఫుట్ పాత్ లు, బస్ స్టాపులు మొత్తం వ్యవస్థను తీర్చిదిద్దారు.
చివరికి లండన్ ఊరి మధ్యలో ప్రవహించే థేమ్స్ నదిలో ఉబర్ బోట్లను కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ స్థాయిలో వాడుతున్నారు. రోడ్డు మీద సిటీ బస్సుతో పోలిస్తే… బోట్లోనే పది నిముషాలు ముందు వెళ్ళచ్చంటే మేమందులోనే తిరిగి… మరింత అసూయపడ్డాము.
సింగపూర్లో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను నిరుత్సాహపరచడానికి కార్ల మీద పన్నులను విపరీతంగా పెంచారు. ఒక బెంజ్ కారు షో రూమ్ ధర కోటి రూపాయలైతే… దానిమీద పన్ను మరో కోటి కట్టాలి. ఇంతింత పన్నులు కట్టి కార్లు కొనడంకంటే హాయిగా పబ్లిక్ ట్రన్స్ పోర్ట్ లో వెళ్ళడం ఉత్తమం అనేలా చేశారు.
పార్కింగ్ ప్లేస్ చూపనిదే వాహనం కొనుగోలు చేయడానికి వీల్లేకుండా బాంబేలో కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ప్రస్తుతానికి కొత్తగా కొనుగోలు చేయబోయే కార్లకే ఈ నియమం. భవిష్యత్తులో పాతవాటికి కూడా పార్కింగ్ చూపించుకోవడం యజమాని బాధ్యత కావచ్చట.
మన ఇంటి రెంటల్ అగ్రిమెంట్లో, సేల్ డీడ్ లో మన పేరుతో కార్ పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు డాక్యుమెంట్ చూపితేనే కొత్త కారు మన పేరుతో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈపని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికైనా చేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మహానగరాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ నిబంధనను ప్రవేశపెట్టకతప్పదు.
ఆచరణలో ఇది ఎంతవరకు అమలు చేయగలరోకానీ… మంచి ఆలోచన. జనానికి మించి కార్లు, బైకులు, ఆటోలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ఏమి చేయగలవు? ఒకవైపు కాలుష్యం. మరో వైపు గంటల తరబడి రోడ్లమీద ఆగిపోయే జీవితాలు.
ఎన్నెన్ని కోట్ల విలువైన పనిగంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని నిరుపయోగమవుతున్నాయో! ఎన్నెన్ని కోట్ల ట్యాంకర్ల డీజిల్, పెట్రోల్ రోడ్లమీద ట్రాఫిక్ లో ఇరుక్కుని మండిపోతోందో! ఎన్నెన్ని మెట్రిక్ టన్నుల కాలుష్యం ఒక్కో గంటకు ఒక్కో మహానగరం ఉత్పత్తి చేసి… మన ఊపిరితిత్తులకు సమానంగా పంచుతోందో! ఎన్నెన్ని రోగాలకు ఈ వాహన కాలుష్యం కారణమై… ఆసుపత్రులన్నీ మూడు బెడ్లు ఆరుగురు పేషంట్లుగా ఖాళీలేకుండా దినదినప్రవర్ధమానమవుతున్నాయో! మనకెందుకు?
మన ఇంటిముందు పబ్లిక్ రోడ్డుమీద మన వాహనాన్ని నిలుపుకోవడం మన ప్రాథమిక హక్కు. మనం పెట్టుకోకపోతే ఖాళీగా ఉంటుంది కాబట్టి… పక్క కాలనీలో పార్కింగ్ లేనివాడు వచ్చి… మన ఇంటి ముందు రోడ్డు మీద దర్జాగా పార్క్ చేసి… కవర్ కప్పి… కొన్ని తరాలపాటు కదిలించకుండా పెట్టుకుంటాడు. రోడ్డుకు రెండు వైపులా ఇళ్లల్లో పార్కింగ్ లేనివారు పార్క్ చేసిన వాహనాలతో రోడ్డు దేవాతావస్త్రమై ఎవరికీ కనిపించకుండా ఉంటుంది.
స్వతంత్ర దేశంలో పంచాయతీ, ఆర్ అండ్ బి, మునిసిపల్, నేషనల్ హైవేలు ఉండగా… పార్కింగ్ లు ఎందుకు దండగ! ఇన్ని దశాబ్దాలుగా పార్కింగ్ లేకపోయినా రెండు కార్లు, నాలుగు బైకులను రోడ్డు మీద పెడుతూ బతకడం లేదా? ఇప్పుడు కొత్తగా పార్కింగ్ ఉంటేనే బండి రిజిస్ట్రేషన్ అంటే వింటామా? విని ఊరుకుంటామా? హమ్మా!
హైదరాబాద్ బంజారాహిల్స్ మా ఆఫీస్ గోడ పక్కన రోడ్డును అడ్డగిస్తూ పట్టినన్ని కార్లు, ఆటోలు, ట్రాలీలు పెట్టేసి అయిదారు నెలలపాటు కదల్చరు. పైగా అందులో కూర్చొని మిట్ట మధ్యాహ్నమే నిషేధిత తెల్లపొడులేవో పీల్చే బ్యాచ్ లు.
మా రోజువారీ పనులకు ఇబ్బందయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సార్! పాపం! మీరు చదువుకున్నవారిలా ఉన్నారు. ఇలా ఫిర్యాదు చేయకండి. కంప్లైంట్ ఇచ్చింది మీరని తెలిస్తే… రాత్రిళ్ళు వచ్చి మీ వాహనాలను ధ్వంసం చేస్తారు… అని గతంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనలను నాకు బాధ్యతగా విడమరిచి చెప్పి… మౌనమే శ్రీరామరక్ష అని ఉచిత సమయోచిత సలహా ఇచ్చారు.
చదువుకున్నవారిని ఇలా ఎన్నెన్నో పాపాలు పగబట్టిన పాముల్లా, వేటకుక్కల్లా వెంటాడతాయని చిన్నప్పుడే తెలిసి ఉంటే అసలు చదువు జోలికే వెళ్ళేవాడిని కాను. కనీసం ఇప్పటికే అబ్బిన వానాకాలం చదువునైనా వదిలించుకునే అన్ లర్నింగ్ కు ఏ అన్ అకాడెమీలో చేరాలో పోలీసులు అదే నోటితో ఉచిత సలహాగా చెబితే బాగుండేది.
మంచివారిని కాపాడడానికి పోలీసులు తీసుకునే చొరవలో భాగంగా దీన్ని పరిగణిస్తూ… కళ్ళల్లో సుడులు తిరిగిన ఆనంద బాష్పాలతో నాకు సలహా ఇచ్చినవారికి మౌనంగా మనసులోనే మొక్కుకోకపోతే అనౌచిత్యం అవుతుంది!
ప్రజాస్వామ్యమిది. ప్రజల కొరకు, వలన, కై, కు, కి, యొక్క ప్రజలే గెలిపించిన ప్రభుత్వాలు వేసిన రోడ్లన్నీ ప్రజలవే. దున్నేవాడిదే భూమి- తొక్కేవాడిదే రిక్షా! పార్క్ చేసుకున్నవాడిదే పబ్లిక్ రోడ్డు! ఏమి బాంబే తమాషాగా ఉందా!
అన్నట్లు- ఇదే నిబంధన హైదరాబాద్ లో కూడా అమలైతే! ఆ ఊహే ఎంత అందంగా ఉందో కదా! పాత కార్లకూ పార్కింగ్ స్పేస్ కంపల్సరీ అని రూల్ పెడితే నగరంలోని 60, 70 శాతం కార్లు స్క్రాపే… ఐనా కార్ల కంపెనీలు ఈ రూల్ పెట్టనిస్తాయా మన అమాయకత్వం కాకపోతే..!
Share this Article