.
ఒక ఉదాహరణతో విజయసాయిరెడ్డి మీద తనకున్న కసినంతా ప్రదర్శించినట్టున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ…
‘‘కాకతాళీయమే అయినా ఒకప్పటి సినిమా హీరోయిన్, డ్రగ్స్ కేసులలో అభియోగాలు ఎదుర్కొన్న మమతా కులకర్ణి శుక్రవారంనాడే సన్యాసినిగా మారిపోయారు… విజయసాయిరెడ్డి కూడా అదే రోజు తన రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారు…’’ అని రాసుకొచ్చాడు…
Ads
మరీ మమతా కులకర్ణి సన్యాసావతారంతో సాయిరెడ్డి సన్యాస ప్రకటనను పోల్చడం ఓరకమైన వెక్కిరింపు, దూషణ… ఏమో, తను బలంగా చెప్పే పాత్రికేయ విలువలు, ప్రమాణాలు కావచ్చు బహుశా…
బాలకృష్ణ సినిమాలాగే… పంచులు, మసాలాలు ఎక్కువై లాజిక్ తక్కువయ్యే సినిమా పోకడలాగే… సాయిరెడ్డి మీద తనదైన శైలిలో, తనదైన విశ్లేషణ సాగించిన ఆర్కే… చివరలో కారణం ఏదీ తేల్చలేక తెల్లమొహం వేసినట్టుగా కనిపిస్తోంది…
అవును, సాయిరెడ్డి రాజకీయ అధికారమే బలమైంది అని నమ్మేవాడు… కదా, మరి ఎటు పోవాలో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవాడు, ఇంకా చాన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉండే అవకాశం ఉండీ ఎందుకు వదులుకున్నాడు… కాస్తో కూస్తో అదే రక్షణ కదా…
ఐతే కొన్ని కారణాల్ని వివరించి చెప్పాడు ఆర్కే… తను ఎలాగూ టీడీపీ కోణంలోనే, వైసీపీ విద్వేష కోణంలోనే విశ్లేషిస్తాడు కాబట్టి… అన్నీ అందరూ నమ్మాలని ఏమీలేదు… కానీ చెబుతున్న వివరాలు కొన్ని ఆసక్తకరం…
జగన్‌తో సాయిరెడ్డికి పడటం లేదు, అవమానిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు, కత్తెర పెడుతున్నాడు… మరోవైపు తన అక్రమాలపై కూటమి ప్రభుత్వం కస్సుమంటోంది… జగన్ కేసుల్లో నంబర్ టూ తనే… ఈ స్థితిలో బీజేపీలో చేరడానికి అమిత్ సాతో రాయబేరాలు… తనేమో పీయూష్ గోయల్‌తో మాట్లాడమన్నాడు…
అబ్బే, ఇప్పుడు మేమూమేమూ ఒకటే కూటమి, సో, చంద్రబాబు వోకే చెప్పుకుండా నిన్ను బీజేపీలో చేర్చుకోం అన్నాడట పీయూషుడు… అదెలా..? బీజేపీలో ఎవరు చేరాలన్నా చంద్రబాబు అనుమతి కావాలా..? కూటమి కూర్పులో ఈ నిబంధనలు కూడా ఉన్నాయా..? సరే, తెలుగుదేశం మాత్రం నువ్వు అప్రూవర్‌గా మారు, అప్పుడే కనికరిస్తాం అని చెప్పిందట…
దానికీ ఒక దశలో సిద్ధపడీ, వైఎస్ వివేకా హత్య గుర్తొచ్చి, భయపడి వెనక్కి తగ్గాడట… నో, రాజీనామా చేయకు అని జగన్ చెప్పినా సరే, చేశాడు కదా, మరి ఆ గొడ్డలి భయం తరమలేదా ఇప్పుడు..? ఒక దశలో బీజేపీకి దూరమై కాంగ్రెస్ పంచన చేరాలని జగన్ ఆలోచిస్తే సాయిరెడ్డి వద్దన్నాడట…
అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహంగా ఉంటాడా..? రోజురోజుకూ కునారిల్లుతున్న కాంగ్రెస్‌తో అంటకాగాలని అనుకుంటాడా జగన్…? పైగా ఇన్నేళ్లు మోడీని నమ్ముకుని ‘స్వేచ్ఛ’ను అనుభవిస్తున్నాడు కదా… హఠాత్తుగా మోడీని వదిలేయాలని ఎందుకు అనుకుంటాడు..? ఇన్నేళ్లూ బీజేపీ తనకేమీ పొగపెట్టలేదు, ఇబ్బందిపెట్టలేదు… దాన్ని వదిలేసి తనను ప్రబల శత్రువుగా భావించే కాంగ్రెస్ వైపు వెళ్తే జగన్‌కు వచ్చేదేమిటి..?
పైగా తనను తెల్లారిలేస్తే కడిగేస్తున్న చెల్లె షర్మిల కాంగ్రెస్‌లో ఉంటే జగన్ దానికి అనుబంధంగా ఎలా మారతాడు..? పైగా తన మీద బొచ్చెడు కేసులు పెట్టి వేధించిన అదే సోనియా కాంగ్రెస్ కూటమిలో ఎలా చేరగలడు..? ఇవన్నీ కరెక్టే అనుకుందాం… మానసికంగా, కుటుంబపరంగా, పార్టీపరంగా ఒత్తిళ్లు ఎక్కువై సాయిరెడ్డి రాజీనామా చేశాడనే ముక్తాయింపే మరింత సందేహాస్పదమైన విశ్లేషణ… సాయిరెడ్డిలో అంత బేలతనం ఉందని తన గురించి తెలిసిన వారందరికీ తెలుసు..!!
Share this Article