ఒక తెలంగాణ… కౌలు రైతులకు పైసాసాయం అందదు సర్కారు నుంచి… భూమి ఎవరి పేరిట ఉంటే వాళ్లకు డబ్బులిచ్చేస్తుంది… వాళ్లు సాగు చేయకపోయినా సరే, నిజానికి రిస్క్ తీసుకుని సాగు చేస్తున్నది, ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నదీ కౌలు రైతులే కదా, వాళ్లకు కదా సాయం అందాలి అని ఎవరైనా అమాయకంగా అడిగితే జవాబు దొరకదు… ఒక ఆంధ్రప్రదేశ్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే సర్కారు ఎడాపెడా డబ్బులు ఏదో పథకం పేరు చెప్పి ఇస్తూనే ఉంది… మరి మిగిలిన కులాల్లో పేదలు లేరా..? జవాబు దొరకదు ఈ సర్కారు దగ్గర… జస్ట్, ఉదాహరణకు ఇవి చెప్పుకోవడం…
తమిళనాడులో మరీ అరాచకం… అక్కడ స్కీముల గురించి, వాటి అర్హతల గురించి రాయాలంటే స్పేస్ సరిపోదు… ఐనా సర్కారు వారి పేదరికం లెక్కలే పెద్ద బోగస్ యవ్వారం… ఎవరికి సర్కారు పథకాలు అందుతున్నాయో, ఎవడికి ఏమీ దొరక్క మరింత పేదరికంలోకి జారిపోతున్నాడో చెప్పడం కష్టం… ఇక కేంద్ర పథకాలు, వాటి నిధుల మళ్లింపు అనేది మరో పెద్ద కథ… అసలు మన పథకాలన్నీ రాజకీయాలు, వోట్ల లెక్కలతో ముడిపడి ఉన్న ‘పథకాలు’ కదా… ఈ స్థితిలో రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకం ప్రశంసనీయం… కానీ మన మీడియాకు అదేమీ పట్టలేదు… పట్టదు…
Ads
ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ ఆదాయ పరిధిలో ఉన్నా సరే….. అందరినీ ఓ ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకొచ్చింది గెహ్లాట్ ప్రభుత్వం… ఒక కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకూ ప్రయోజనం లభిస్తుంది… ఉచితమే… ఎవరూ రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు… ఆ పథకం కింద నమోదు చేసుకుంటే చాలు… దాని చిరంజీవి ఆరోగ్య బీమా పథకం… వస్తే వచ్చారు, అధికాదాయ కుటుంబాలు, సంపన్న కుటుంబాలు వస్తే వచ్చారు… కానీ పేదరికం లెక్కల్లోకి, పార్టీల వోట్ల లెక్కల్లోకి రాని మధ్యతరగతికి ఎంత భరోసా..? ఇవ్వాళారేపు ఎగువ మధ్య తరగతే వైద్య ఖర్చుల్ని భరించలేక బేర్మంటోంది… అల్పాదాయ వర్గాల్లో అనేక ఆత్మహత్యలకు కారణం వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులే…
ప్రత్యేకించి వైద్యారోగ్యంలోకి కార్పొరేట్ ప్రపంచం ఉధృతంగా దూసుకొచ్చాక… సర్కారీ వైద్యం పడకేసిన తరువాత… ఆరోగ్య బీమా పథకాలు తప్పనిసరి అయిపోయాయి ఇప్పుడు… ప్రైవేటు బీమా ఏజెన్సీలు వేలకువేల ప్రీమియం వసూలు చేస్తున్నాయి… ఓ మోస్తరు రోగమొచ్చినా సరే, ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ తలుపు తడితే చాలు లక్షలకులక్షలు హారతి కర్పూరమే… అనవసర పరీక్షలు, అడ్డగోలు రేట్లు, అసలు కార్పొరేట్ వైద్య దరిద్రం అందరికీ తెలిసిందే కదా… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పరిధి చాలా పరిమితం… కోట్ల మంది ఆ పథకం పరిధిలోకే రారు… అసలు ఏ కేంద్ర పథకమైనా అంతే కదా… ఈ స్థితిలో ప్రతి కుటుంబానికి ఆ అయిదు లక్షల బీమా భరోసాను ఇవ్వడం మెచ్చుకోదగిందే… కాకపోతే పథకం అమలులో లోటుపాట్లు లేకుండా కాస్త ముందుగానే నట్లు బిగించాలి…!! #chiranjeevihealthinsurance #HealthAll
Share this Article