Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంగ్లిషు నుంచి తెలుగులోకి సరైన అనువాదం ఓ పే-ద్ద కళ…

January 28, 2025 by M S R

.

Bhandaru Srinivas Rao ……. “నేను ఈ గవర్నర్ పదవిలోకి రాక మునుపు ఒక గైనకాలజిస్టుగా ఎంతో మంది నవజాత శిశువులను హాండిల్ చేశాను. తెలంగాణా కూడా నవజాత రాష్ట్రమే. కాబట్టి సులభంగా ఈ రాష్ట్రాన్ని కనిపెట్టి చూసుకోగలననే ధైర్యం వుంది. నేను తమిళ బిడ్డను, ఇప్పుడు తెలంగాణా సోదరిని”

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఒకప్పటి తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్.  ఆమె తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన తర్వాత కొన్నాళ్ళకు రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లాది కృష్ణానంద్ ఫోన్ చేశారు. ‘రేపు మీరు రాజ్ భవన్ కు రావాలి. గవర్నర్ గారి పుస్తకం ఆవిష్కరణ. వీలయితే నాలుగు ముక్కలు మాట్లాడాలి’.

Ads

రాజ్ భవన్ నాకు కొత్త కాదు, రేడియో విలేకరిగా చాలా సార్లు వెళ్లాను. అటువైపు వెళ్లక ఇంచుమించు పదిహేనేళ్లు కావస్తోంది. అయినా అక్కడ పనిచేసే సిబ్బంది చాలామంది నా మొహం చూసి గుర్తుపట్టి పలకరించడం సంతోషం అనిపించింది.

గవర్నర్ వచ్చారు. వెంట ఆవిడ భర్త సౌందర రాజన్ కూడా వచ్చారు. ఆయన కూడా డాక్టరే. చాలా చాలా నిరాడంబరంగా వున్నారు. అతిశయం అన్నది మచ్చుకు కూడా కనబడలేదు. ప్రతి సందర్భంలో, అతిధుల్ని ముందుంచి ఆయన వెనుకనే నిలబడ్డారు.

సాంస్కృతిక సభలు, సమావేశాలు కవర్ చేసే ఇంగ్లీష్ పత్రికా విలేకరులకు అలవాటయిన పదం, ఆల్సో స్పోక్. వక్తల సంఖ్య భారీగా వుంటే అందరి పేర్లూ, వాళ్ళు చేసిన ప్రసంగాలు తమ రిపోర్టులో ప్రస్తావించడం కష్టం కనుక, పలానా పలానా వాళ్ళు కూడా మాట్లాడారు అనడానికి ఇలా క్లుప్తంగా రాసి సరిపుచ్చుతుంటారు. అలాంటిదే ఇది.

హిందూ పత్రికలో ఓ పేరా వస్తే చాలు అదే మహాప్రసాదం అని మహామహులే భావిస్తారు. అలాంటిది ఓ పుస్తకం గురించి ఆ పత్రికలో ఏకంగా ఓ సమీక్షే వచ్చింది. ఇక నేను అనగానెంత. అంచేత నేను కూడా, పైన చెప్పినట్టు “….also spoke” అన్నమాట.

ఇక విషయం ఏమిటంటే!
ఆ పుస్తకం రాసింది దాసు కేశవరావు గారనే పెద్ద మనిషి (1867- 1934). ఈ దాసు గారికి ఓ మనుమడు. ఆయన పేరు కూడా దాసు కేశవరావే. ఈ చిన్న దాసు గారు నా ఈడువాడే కానీ నాకంటే చాలా  పెద్దవాడు, గొప్పవాడున్నూ.

హిందూ దినపత్రిక హైదరాబాదు ఎడిషన్ డిప్యూటి ఎడిటర్/ బ్యూరో చీఫ్ గా చేసిన సీనియర్ జర్నలిస్టు.  దాసు కేశవరావు గారి కుటుంబం చాలా పెద్దది. సుప్రసిద్ధమైనది. దాసు గారి కుటుంబానికి మూల పురుషుడు, దేవీ భాగవతం కావ్యం సృష్టికర్త అయిన దాసు శ్రీరాములు (1846- 1908) గారి కుమారుడే మన కథానాయకుడు దాసు కేశవ రావు సీనియర్.

(బొంబాయి మొదలయిన చోట్ల చాలా కాలం వుండబట్టేమో, ఆయన పేరుకి చివర పంత్ అని చేర్చినట్టున్నారు) వారి కుటుంబంలో దాదాపు అందరూ న్యాయవాది వృత్తిలో స్థిరపడినప్పటికీ, ఈయన గారి అభిప్రాయాలు విభిన్నం.

మన ఒక్కరి కడుపు నింపుకోవడం కాదు, పది మందికీ ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో వ్యాపారాలు చేయాలని అప్పటి బొంబాయి, హైదరాబాదు, ట్రావెన్ కూర్ సంస్థానాల్లో రైల్వే కాంట్రాక్టులు అవీ చేసి పుష్కలంగా డబ్బు గడించారు.

ఆ డబ్బుతో, సంపాదించిన అనుభవంతో బెజవాడకు వచ్చి అత్యంత అధునాతన ముద్రణా పరికరాలతో 1896లో వాణి ప్రెస్ ప్రారంభించారు. అప్పటికి బెజవాడ వాసులకు కరెంటు అంటే ఏమిటో తెలియదు. తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి, ఒక చిన్నపాటి విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకుని వాణి ప్రెస్ తో పాటు, ఇరవై ఒక్క గదుల తన రాజ ప్రసాదానికి కూడా విద్యుత్ కాంతుల సొగసులు అద్దారు.

అలాగే బాపట్లలో తన కుమార్తె పెళ్లి చేసినప్పుడు, అక్కడే ఒక పవర్ హౌస్ నిర్మించి (ఇప్పుడు రంగారావు తోట అంటున్నారు) కళ్యాణ మండపం యావత్తూ విద్యుత్ వెలుగులు నింపారు. అయిదు రోజులపాటు అంగరంగవైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలని, ప్రత్యేకించి విద్యుత్ దీపాల తోరణాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండ్లు కట్టుకుని బాపట్ల వచ్చేవారని ఆ రోజుల్లో వైనవైనాలుగా చెప్పుకున్నారు.

తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై రాజభవన్ లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి నా ముందు మాట – ఇంగ్లీష్ పుస్తకం గురించి తెలుగులో పరిచయం- అనే పేరుతొ రాశాను. నా పాత అనుభవాన్ని అందులో ఉటంకించాను. ఈ సీరియల్ లో ఒకచోట ఈ ప్రస్తావన వచ్చింది కూడా.

“మూడు/నాలుగు దశాబ్దాల క్రితం నాకు రేడియో మాస్కోలో ఉద్యోగం వచ్చింది. నేను నా కుటుంబాన్ని వెంటబెట్టుకుని మాస్కోకి వెళ్లాను. ఆ దేశంలో శాకాహారులకు భోజనానికి ఇబ్బంది అని ఎవరో చెప్పగా విని, కొన్ని నెలలకు సరిపడా ఉప్పూ కారాలు, పోపుగింజలు మొదలయిన తిండిసామానులు సూటుకేసుల నిండా సర్దుకుని పట్టుకు పోయాము.

మాస్కో షెర్మితోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీషులో ఏమంటారో ఆ క్షణాన చప్పున గుర్తు రాలేదు.

అది తినే వస్తువనీ, వంటల్లో వాడతామనీ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను. ఘాటయిన ఇంగువ వాసన, వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకునే మాదక పదార్ధము కాదని రుజువు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరలిగాము.

మాలాంటి ఈ బాపతు వాళ్ళు ఉంటారని దాసు కేశవరావు పంత్ గారు ఊహించే అంతకు యాభయ్ ఏళ్ళకు పూర్వమే ఒక పుస్తకం రాశారు. ‘ఇది జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతారు’ అని దానికిందనే ఓ ట్యాగ్ లైన్ కూడా వుంది.

ఆంగ్లంలో పట్టు సాధించాలని కోరుకునే తెలుగువాళ్ళకు పనికొచ్చే చిన్న పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం పేరు A Vade Mecum. లాటిన్ పదం. చిన్ని పుస్తకం అని అనడం ఎందుకంటే, జేబులో పెట్టుకోవడానికి వీలైన గైడు లాంటిది అని తెలుగులో ఆ లాటిన్ పదానికి నిఘంటు అర్ధం.

ఇంగ్లీష్ బాగా తెలిసినవాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఆంగ్ల పదాల తెలుగు సమానార్ధకాలు చప్పున స్పురించవు. మరీ ముఖ్యంగా సామెతలు, కాయగూరలు వగైరా. ఉదాహరణకు ‘He is at his wits end for dinner’ అనే వాక్యాన్ని అనువాదం చేయాల్సివస్తే అది ఏ రూపం సంతరించుకుంటుందో వర్తమాన వార్తాపత్రికల్లో వస్తున్న అనువాదాలను చూస్తే తెలిసిపోతుంది.

నిజానికి మన వైపు బాగా ప్రాచుర్యంలో ఉన్న వాడుక పదం, ‘వాడికి పూటకు ఠికానా లేదు’ అంటుండే దానికి అది ఇంగ్లీష్ సమానార్ధకం అని ఈ పుస్తకంలో వుంది. అలాగే ‘She is near her time’ అని ఎవరైనా అన్నారనుకోండి. మన తెలుగు అనువాదకులు హడావిడిగా ఎలా రాస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. కానీ దాసు కేశవరావు పంత్ గారు దీనికి తెలుగు సమానార్ధకాన్ని పట్టుకున్నారు. ‘ఆవిడకు పురిటి ఘడియలు దగ్గర పడ్డాయి’.

గందరగోళంలోకి నెట్టే మరో వాక్యం. ‘It rains cats and dogs’. ఎప్పుడో, ఎక్కడో చదివాను. పిడుగుల వర్షంలాగా ‘పిల్లులు, కుక్కల వాన’ అనే అనువాదాన్ని. దాసు కేశవ రావు పంత్ గారు ‘కుంభపోత’గా వర్షం కురవడం’ అని రాసారు. బహుశా కుండపోతను ఆయన ‘కుంభ’పోతగా రాసివుంటారు. కుంభం అన్నా కుండ అనే అర్ధం కదా!

ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా గూగులమ్మ వుంది కదా అనే వాళ్ళు ఉండొచ్చు. వారికి ఇటువంటి పొత్తాలతో ఒరిగేది ఏమిటి అనే ప్రశ్న ఎదురు కావచ్చు. అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన అంశం వేరే. దాసు కేశవ రావు పంత్ అనే పెద్దమనిషి ఎప్పుడో ఎనభయ్ ఏళ్ల క్రితమే ఇటువంటి బృహత్తర ప్రయత్నం చేసారు అనే సంగతిని వర్తమాన సమాజంలో జీవిస్తున్న వారికి తెలియచెప్పడానికి కూడా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది. ఇది పందొమ్మిదో ప్రచురణకు నోచుకున్నది అంటేనే దీనికి లభించిన ఆదరణ, దీనికి ఉన్న విశిష్టత బోధపడతాయి.

ప్రచురణకర్తలయిన మా వయోధిక పాత్రికేయ సంఘం వారికి మనఃపూర్వక అభినందనలు.  పుస్తకం విడుదల చేశారు. ఆ తర్వాత మాలో కొందరిని మాట్లాడమని కోరారు. ముక్తసరిగా మాట్లాడాను. సంవత్సరం కిందట తెలంగాణా గవర్నర్ గా పదవీ స్వీకారం చేసిన పిమ్మట, ‘తెలుగు నేర్చుకుంటాను’ అని లేడీ గవర్నర్ చెప్పిన వార్త పత్రికల్లో వచ్చిన సంగతి గుర్తుచేసి, ఆ కారణంగానే తెలుగులో మాట్లాడుతున్నాను అని చెప్పాను.

గవర్నర్ ప్రసంగం కాబట్టి పత్రికల్లో, మీడియాలో వివరంగానే వస్తుంది. కనుక ఆ ప్రసంగంలో వినవచ్చిన ఒక ముచ్చటతో ముగిస్తాను. ‘ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు ఓ నిరుద్యోగి వచ్చి తన కష్టాలను ఏకరవు పెట్టి, బతుకుతెరువుకోసం ఏదైనా ఉద్యోగం వేయించండి’ అని ప్రాధేయపడ్డాడుట. ఆ నాయకుడు చిరునవ్వు నవ్వి, ‘ఏ ఉద్యోగం దొరక్కనే తాను రాజకీయాల్లోకి వచ్చాను’ అని జవాబిచ్చాడుట…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions