తెలుగు టీవీ సీరియళ్లలో ఏదీ మంచిది ఉండదు… కాకపోతే కాస్త గ్రేడ్లు ఎక్కువ తక్కువ… ఇప్పుడు ఆ దరిద్రాల లోతుల్లోకి వెళ్లి చర్చించడం శుద్ధ దండుగ… కానీ ఇప్పటివరకూ టాప్ రేటెడ్, బంపర్ హిట్ సీరియల్ మాత్రం కార్తీకదీపమే… ఓ మళయాళ ఒరిజినల్‌కు కాపీ… కాకపోతే అడ్డదిడ్డంగా రోజుకోరకంగా మార్చేస్తూ మూడేళ్లుగా నడిపించారు దీన్ని… నడుస్తూనే ఉంది… 1000 ఎపిసోడ్ల రికార్డు అంటూ యాడ్స్ ఇచ్చే కంపెనీలకు నిన్న, మొన్న మెసేజులు పంపించి పండుగ చేసుకున్నారు ఈ సీరియల్ నిర్మాత ప్లస్ స్టార్ మాటీవీ… నిజానికి సీరియళ్లలో ఇంత చెత్తా కేరక్టరైజేషన్ ఉన్న సీరియల్ మరొకటి లేదు… ప్రత్యేకించి డాక్టర్ కార్తీక్ అనే నల్కా కేరక్టర్… కానీ జనానికి అదే నచ్చింది… ఏమో… నచ్చిందో మాటీవీ వాడు రేటింగుల్లో ఏమైనా మాయ చేస్తున్నాడో గానీ అద్భుతమైన రేటింగ్స్ ఈరోజుకూ… అయితే ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే..? మరో 1000 ఎపిసోడ్లు సాగదీస్తామోయ్ అని భయపెడుతున్నాడట ఈ సీరియల్ నిర్మాత శ్రీమాన్ గుత్తా వెంకటేశ్వరరావు….
అవును మరి, కోట్లు సంపాదించి పెడుతున్న కల్పవృక్షం అది… అప్పుడే ఎందుకు కొట్టేస్తారు ఎవరైనా..? ఆ పొదుగును ఎన్నేళ్లయినా పిండుతూనే ఉంటారు… ఇప్పుడు జరిగేదీ అదేనేమో… మరో వెయ్యి ఎపిసోడ్లకూ ఆగుతుందనేమీ లేదు… అప్పటి రేటింగులను బట్టి మరో మూడేళ్లు కూడా సాగదీసే ప్రమాదం కూడా ఉంది… వంటలక్క అలియాస్ ప్రేమి సరదాగా ఆ నిర్మాతను ఇదే ప్రశ్న వేస్తే తనే స్వయంగా చెప్పాడు మరో 1000 ఎపిసోడ్లు లాగుతాము అని..! దీన్ని ప్రేమి తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది… అందులో మొనిత అనే పాత్ర పోషించే శోభా శెట్టి కూడా ఉంది… అయితే… మరో మూడేళ్ల జీడిపాకం అంటే అప్పటికి మా వయస్సు ఎంత పెరుగుతుందో అనే డౌట్ శోభకూ వచ్చింది… అదే అడిగింది… దాన్నలా వదిలేస్తే… నిజంగా మరో 1000 ఎపిసోడ్లు గనుక సాగదీస్తే అప్పటికి సీరియల్ పాత్రలు, కథ ఎలా ఉంటుంది..? పిచ్చి ప్రశ్న… ఏమీ మారవు…
Ads
https://www.instagram.com/tv/CNDC0yOH3lK/?utm_source=ig_embed
వంటలక్క ముసలిదైపోతుంది… ఎప్పటికైనా నా డాక్టర్ నన్ను చేరదీస్తాడు, నా శీలాన్ని నేను నిరూపించుకుంటాను అని డైలాగులు కొడుతూనే ఉంటుంది… సౌర్య, హిమ చదువులైపోయి ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు ఎస్పీ అవుతారు… వారానికి ఓసారి నాన్న దగ్గరకు వెళ్తుంటారు… ఏడుస్తూ తిరిగి అమ్మ దగ్గరకు వస్తుంటారు… అప్పటికి వంటలక్క రోగం ముదిరిపోయి కేన్సర్లోకి దిగుతుంది… డాక్టర్ బాబు నిజం గ్రహించాకే నన్ను తీసుకుపో దేవుడా అని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది… ఆ పాత విలన్ డ్రైవర్ నిజం చెప్పే అవకాశం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంటాడు… సౌందర్య, ఆనందరావు డాక్టర్ బాబు పైత్యాన్ని భరించలేక కాశికి వెళ్లి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఓ ఇల్లు కిరాయికి తీసుకుని బతుకుతూ ఉంటారు… మోనిత అదే ఇంట్లో, అదే వంటమనిషి ప్రియమణితో కలిసి రోజుకు వందసార్లు డాక్టర్ బాబును కెలుకుతూనే ఉంటుంది… ఏనాటికైనా డాక్టర్ బాబును పెళ్లిచేసుకోవాలని కలలు కంటూనే ఉంటుంది… ప్రేక్షకులు జుత్తు పీక్కుంటూనే ఉంటారు… కొందరు ఎర్రగడ్డకు, మరికొందరు వైజాగుకు చేరుకుంటారు… సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది..!! సౌర్య, హిమల్ని అచ్చం డాక్టర్ బాబు గుణం ఉన్న భర్తలే దొరుకుతారు… వాళ్లకు ఒకేరోజు పుట్టిన పిల్లల్లో ఒకరిని మోనిత ఎత్తుకుపోతుంది… తరువాత మన ఇష్టం… సీరియల్ కథను ఎలాగైనా దంచుకోవచ్చు…!! తెలుగు సీరియల్ కదా, ఆ టీవీ దృష్టిలో, ఆ నిర్మాత దృష్టిలో ప్రేక్షకులు మెంటల్ గాళ్లు… ఏం చూపించినా చూస్తారు…!! #KartikaDeepam, #PremiViswanath
Share this Article