.
జయ ఆస్తులు తమిళనాడుకే… అని ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చిందట… ఎవరెవరో మేం వారసులం అని చెబుతూ ఆమె ఆస్తుల కోసం కోర్టుల్లో కొట్లాడారు… కానీ ఫలితం లేకుండా పోయింది…
నిజానికి ఆమె బతికి ఉన్నప్పుడే… అన్నింటా తోడున్న తన ‘మిత్రురాలు’ శశికళ జయలలిత పేరు చెప్పి, ఆమె అధికారాన్ని తను వాడుకుని ఎంత సంపాదించిందో తనకే తెలియదు… ఐనా జయలలిత తెలిసీ సహించింది… ఆ బంధం అంత బలమైంది మరి…
Ads
జయలలిత మరణించాక ఎవరికి అందిన కాడికి వాళ్లు దోచుకుపోయారట… అప్పట్లో పుట్టపర్తి సాయిబాబా తదనంతరం కూడా ఇలాగే తన కోటరీ ముఖ్యులు అలాగే అందినకాడికి తరలించుకుపోయారని అంటారు… అంతెందుకు… హైదరాబాద్‌లో జయలలితకు ఉండబడిన విలువైన ఆస్తి, భూమి ఎవరి పాలయిందో ఎవరికీ తెలియదు… రేవంత్ రెడ్డి గనుక దీనిపై విచారణ జరిపిస్తే కొన్ని విస్మయకర అంశాలు ఏమైనా బయటపడతాయేమో…
పోయినవి పోగా… ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నవి 27 కిలోల బంగారు ఆభరణాలు… పది వేల చీరలు… 750 జతల చెప్పులు… బోలెడన్ని గడియారాలు… ఇవన్నీ వోకే… 1562 ఎకరాల భూములు… అసలు అంత ఆమె పేరిట ఎలా పోగైంది..? ఏ భూపరిమితి చట్టాలు ఆమెకు వర్తించవా..? ఏదైనా ట్రస్టు పేరిట రిజిష్టర్ చేసిందా..?
అప్పట్లోనే మొత్తం ఆమె ఆస్తుల విలువ 913 కోట్లు అట… (అందరూ కాజేసినవి పోగా.,.! ఆల్రెడీ ఆమె నివాసాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది… వందల కోట్ల విలువ…) ఇప్పుడు 4 వేల కోట్లు అట…
నిజంగా ఆమె సంపాదించింది, శశికళ తదితరులు కాజేసింది కూడా మొత్తం అలాగే ఉండి ఉంటే… ఎన్ని వేల కోట్ల విలువ తేలేదో..! సినిమా కెరీర్‌లో, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆమె ఏమిటి..? ఆమె తత్వం ఏమిటనే చర్చకు పోవడం లేదు ఇక్కడ… కానీ ఆస్తులు, వస్తువులు, ఆభరణాలు పోగేయడం ఖచ్చితంగా ఓ పిచ్చి… అధికారంలో ఉంది కాబట్టి ఆ పిచ్చి మరింత పెచ్చుమీరింది…
దత్త కొడుకు పెళ్లికి నభూతో అనే స్థాయిలో… మరీ ఇంగ్లిష్ రాచకుటుంబం స్థాయిలో జరిపించడం కూడా ఆ పిచ్చిలో భాగమే… లేకపోతే 27 కిలోల బంగారు ఆభరణాలు ఏమిటి..? పది వేల చీరలు, 750 జతల చెప్పులు… డెఫినిట్‌గా అదొక మానసిక వైకల్యమే… సరే, ఆమె ఇష్టం…
ప్రజలు గుడ్డిగా అప్పగించిన అధికారముంది… అవకాశముంది… సంపాదించింది… కానీ ఏం కట్టుకుపోయింది…? రోజుల తరబడీ ఆ హాస్పిటల్ రూమ్ గోడల నడుమ… నిజంగా ఏం జరుగుతుందో జనానికి తెలియనంత అనామకంగా చచ్చిపోయింది… ఆమె చుట్టూ ఉన్నవాళ్లే ఆమె చుట్టూ చీకటితెరలు కట్టి, ఏం చేశారో… అంతిమంగా ఎంబామింగ్ చేసి, మృతదేహాన్ని జనానికి చూపించి, ఇక పైలోకాలకు పంపించేశారు… ఆమె అంత్యక్రియలు కూడా ఓ వివాదమే… ఆమె పుట్టుక కులాన్ని బట్టి దహనం చేయాలా..? ఖననం కరెక్టేనా అని..!
ఎస్, తమిళనాడు ప్రభుత్వం కాదు, ఎవరూ తేల్చలేరు… తేల్చరు… ఆమె మరణ కారణాల్ని తేల్చనివ్వరు… అది ఒడిశిన కథ… ఖచ్చితంగా ఆమెది ఓ దిక్కులేని మరణమే అనాలి… అంత సంపాదించి చివరకు తనకు సొంత వాళ్లంటూ ఎవరూ లేకుండా పోయారు… కల్తీ లేని ఒక్క కన్నీటి బొట్టు సంపాదించలేకపోయింది… అందరూ ఆమె ఆస్తిపై వాలిన గద్దలే… మరి ఆమె ఎవరిని సాధించుకున్నట్టు… ఏం సాధించినట్టు… వైరాగ్య భావన అని కాదు గానీ… ఆమె జీవితం అడ్డగోలు సంపాదన బాటలో పరుగులు తీసే ప్రతి వాడికీ ఓ పాఠమే… ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న అక్రమార్కులకు..!!
Share this Article