.
Aranya Krishna… మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు అభినందనలు.
ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల (15.12.2005) త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ 19 ట్20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది.
Ads
లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ ఐన త్రిష ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు కూడా తీసింది. తన సెంచరీని కేవలం 53 బంతుల్లోనే బాదిపడేసింది. మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది ఈ తెలంగాణ బిడ్డ. జనవరి 31న జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది. ఈ మ్యాచ్ లో కూడా త్రిష తన బాట్ తో మంచి ప్రదర్శన చేసింది. ఇంక ఇవాళ జరిగిన ఫైనల్స్ లో బాట్ తో 44 రన్స్, బాల్ తో 3/15 ఆల్ రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.
ఐతే చిత్రమేమంటే బలమైన షాట్స్ తో ఎంతో దూకుడైన బాటింగ్ తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్ రౌండర్ ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కనీస ధర ఐన 10 లక్షలకి కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు!
త్రిష తండ్రి ఒక జిం ట్రెయినర్. త్రిష కెరీర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. త్రిష అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నది. ముఖ్యంగా తన కోసం తండ్రి పడ్డ కష్టాల గురించి చెప్పింది. వరల్డ్ కప్ లో త్రిష సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రాంరెడ్డి కూడా ప్రేక్షకుల్లో వుండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు. తాను సాధించిన “ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ” అవార్డుని తన తండ్రికే అంకితమిచ్చింది.
మహిళా క్రికెట్లో త్రిష సాధించిన ఘన విజయాల్ని చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం వచ్చిన “కౌసల్య కృష్ణమూర్తి” సినిమా గుర్తొచ్చింది. కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఓ మంచి సినిమా అది. ఈ సినిమా విశిష్టత ఏమిటంటే కూతురు క్రికెట్ కెరీర్లో ఎదగడానికి అడ్డంకుల్ని అధిగమించడానికి శ్రమిస్తుంటే రైతైన తండ్రి వ్యవసాయంలో అంతకు రెట్టింపు కష్టాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటాడు.
ఇద్దరి వ్యధాభరిత జీవితాలు సమాంతరంగా సాగుతుంటాయి. చివరికి కూతురు భారత్ కి ప్రాతినిధ్యం వహించి జట్టుని గెలుపు బాట పట్టిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకుంటూ ఆమె క్రికెట్ గురించి మాట్లాడదు. దేశంలో వ్యవసాయం గురించి, దుర్బలమైపోతున్న రైతు గురించి మాట్లాడుతుంది.
ఏ బ్యాంక్ అయితే టోర్నమెంట్ ని వాణిజ్య దృక్పథంతో స్పాన్సర్ చేసి, ఆమెకి నగదు బహుమతిని అందిస్తుందో అదే బ్యాంక్ ఆమె తండ్రి ఇంటిని, ఇంట్లో సామానుని ఋణం కింద జప్తు చేస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడుతుంది.
“క్రికెట్లో జట్టుకి కష్టాలు వస్తే కోహ్లినో, టెండూల్కరో వచ్చి గట్టెక్కిస్తాడు. కానీ రైతు కష్టాల్లో వుంటే ఏ హీరో కూడా రైతుకి మద్దతుగా ముందుకొచ్చి కష్టాల నుండి బైట పడేయడు” అంటుంది. క్రికెట్లో విజయం సాధించినంత తేలిక కాదు వ్యవసాయంలో విజయం సాధించటమనే సందేశం ఈ సినిమా ఇస్తుంది.
ఈ సినిమాలో క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగటానికి ఎంత మానసిక వ్యధ భరించాలో ప్రభావవంతగా చూపాడు దర్శకుడు. ఒక కమిట్మెంట్ తో తీసిన సినిమా ఇది. ఎన్నో చోట్ల డైలాగ్స్ గుండెల్ని సూటిగా తాకుతాయి సంభాషణలు. సినిమా మొత్తం మంచి మూడ్ క్రియేట్ చేసిన బాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇంత మంచి సినిమా రిలీజ్ ఐన వెంటనే మంచి పేరు తెచ్చుకోగానే ప్రభాస్ నటించిన “సాహో” అనే చెత్త సినిమా కోసం థియేటర్లను వీడాల్సి వచ్చింది. ఇంతా చేసి ఆ “సాహో” ఫ్లాప్. అందుకే అనేది “మన సినిమా హీరోలందరూ తెర మీదనే కాదు పరిశ్రమకే విలన్లు” అని!
నోట్: “కౌసల్య కృష్ణమూర్తి” సన్ నెక్స్ట్ ఒటిటి లో వుంది. ఆ సబ్స్క్రిప్షన్ లేకపోతే యాడ్స్ ని భరిస్తూ యూట్యూబ్ లో చూసేయండి.
Share this Article