.
ఇలాంటి అమానవీయ, కలిచివేసే వార్త గతంలో ఎప్పుడూ చదివినట్టు గుర్తులేదు… మళ్లీ చదవాల్సిన అగత్యం పట్టకూడదనే దేవుణ్ని ప్రార్థిస్తున్నాను…
సాధారణంగా తండ్రి మరణిస్తే అంత్యక్రియల్ని, కర్మ విధుల్ని పెద్ద కొడుకు బాధ్యత… ఆనవాయితీ… ధర్మం… తల్లికి చిన్న కొడుకు నిర్వహించాలి… కొడుకులు లేకపోతే కూతుళ్లు కూడా అంత్యక్రియల తంతు నిర్వహిస్తున్నారు… ఆహ్వానిద్దాం… కూతుళ్లు వాళ్ల రక్తమే కదా…
Ads
తల్లిదండ్రుల్ని శ్మశానాల్లో వదిలేసిరావడం, ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం, కొట్టడం, ఆస్తులు లాక్కొని బజారులోకి నెట్టేయడం వంటి ఎన్నో చదివాం, విన్నాం… చివరకు కోర్టులు కూడా పేరెంట్స్ బాధ్యతల్ని చూడకపోతే వాళ్ల ఆస్తుల్ని తిరిగి ఇప్పించడమే కాదు, వాళ్ల మీద కేసులు పెట్టాలనే తీర్పులు కూడా కొన్ని ఇచ్చాయి…
చట్టమూ ఉంది… అదంతా వేరే సంగతి… కానీ ఇది మరీ అసాధారణం… వివరాల్లోకి వెళ్దాం…
మధ్యప్రదేశ్… తీకమ్‌గఢ్ జిల్లా… థాల్ లిథోరా గ్రామం… ఆదివారం ఉదయం అయిదు గంటలకు… ధ్యానీసింగ్ అనే ఓ పెద్దాయన ఓ జాతరకు వెళ్లి అక్కడే మరణించాడు… ఇంటికి పట్టుకొచ్చారు… బంధుగణం, తెలిసినవాళ్లు, ఊరోళ్లు అందరూ వచ్చారు…
అన్నాదమ్ముళ్లు… ఎవరింట్లోకీ తీసుకుపోలేదు మృతదేహాన్ని… నేను అంత్యక్రియలు చేస్తాను, అంటే నేనే చేస్తాను అని పట్టుదల… మొండితనం,.. దానికి సోదరుడు అంగీకరిస్తేనే ఇంట్లోకి తీసుకెళ్లి, శవాలంకరణ, విహిత పద్ధతుల్లో అంత్యక్రియలు చేస్తామని మొండితనానికి పోయారు ఇద్దరూ… ఒకడి పేరు కిషన్ సింగ్ ఘోష్, మరొకడి పేరు దామోదర్ ఘోష్…
ఒరేయ్, పెద్ద కొడుకు బాధ్యత అది అని గ్రామస్థులు చెబితే తమ్ముడు వినడు… చివరకు మహామూర్ఖుడైన అన్న ఓ ప్రతిపాదన పెట్టాడు… ‘శవాన్ని రెండు ముక్కలు చేద్దాం… ఒక భాగానికి నువ్వు అంత్యక్రియలు చేసుకో, మిగతాది నా వంతు…’ ఇదీ ఆ నీచమైన ప్రతిపాదన…
విన్న గ్రామస్థులు ఠారెత్తిపోయారు… తిట్టారు… ఊరి నుంచి వెలివేస్తామన్నారు… కానీ ఎంతకూ వాడు వినడు… అయిదారు గంటలపాటు శవం రోడ్డు మీదే… గొడవ, లొల్లి… చివరకు గ్రామస్థులు పోలీసులను పిలిచారు… ఇక్కడ పోలీసులు నిజానికి ఏం చేయాలి..? అయోమయం… కొందరు గ్రామస్థులు అన్నను తన్నడానికీ సిద్ధమయ్యారు… నిజమే, దేహశుద్ధికి అర్హుడే…
ఎవడూ వినకపోవడంతో… కాస్త పోలీసు మర్యాద చూపించాల్సి వస్తుంది, ఊరివాళ్లే అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుందని తమ భాషలో చెప్పారు… అప్పుడు గానీ ఇద్దరూ తోవకు రాలేదు… సంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకే అంత్యక్రియలు చేస్తాడనీ, తద్దినాలు గట్రా చిన్న కొడుకు పెట్టుకోవచ్చుననీ చెప్పారు… కాదు, ఆదేశించారు… ఇంకెన్ని చూడాలో మనం..!!
అవునూ… ఆ ముసలాయన భార్య ఏమన్నది..? ఏమో… ఏ వార్తలోనూ ఆ సమాచారం మాత్రం కనిపించలేదు… ఏముంది..? షాక్‌లో మునిగి, ఏడుస్తూ చూసి ఉంటుంది… పాపం, ఏం చేయగలదు..?! ఆమె దాకా వస్తే ఇంకేం సమస్యో..!! ఇంకేం గొడవో..!!
Share this Article