.
Paresh Turlapati ……… చిన్నప్పట్నుంచి చూస్తున్న సినిమా బిట్లు …. ఏమాత్రం మారవు, మనం కూడా మారం కదా… మన నిర్మాతలు అస్సలు మారనివ్వరు కూడా…
1. హీరోకి.. రౌడీలకు ఘోరాతి ఘోరంగా ఫైటింగ్ జరుగుతుంటుంది. హీరో ఒక్కడే కత్తులు కటార్లు ఉన్న వంద మంది రౌడీలను పిన్నీసు పెట్టి.. గుండు సూది పెట్టీ గుచ్చి గుచ్చి సంపేస్తుంటాడు
Ads
2. కొన్ని ఫైటింగుల్లో విలన్ల దగ్గర తుపాకులు ఉన్నా సరే, హీరోని కా*ల్చకుండా జారి పడిపోతూ ఉంటారు.
3. ఆఖర్లో ఎక్కడ్నుంచో విలన్ ఊడి పడి హీరోని ఇరవై నాలుగు రౌండ్లు కాలుస్తాడు. హీరో ‘అబ్బా ‘అంటూ కింద పడిపోతాడు. హీరో ఇక అయిపోయాడని రౌడీలు సంబరాలు చేసుకుంటుంటే హఠాత్తుగా గాలి దుమారం వస్తుంది.
ఎక్కడో గుడి గంటలు వినపడతాయి. ఉరుములు మెరుపులతో వాన మొదలౌతుంది. అప్పటిదాకా ఉలుకు పలుకు లేకుండా కింద పడుకున్న హీరో ఒక్కసారిగా గాల్లోకి లేచి విలన్ ముక్కు కొరికేస్తాడు. సరిగ్గా ఇదే టైముకి శివమణి డ్రమ్ములు బాదేస్తాడు
ఆ.. నువ్వింకా బతికే ఉన్నావా అని విలన్ తెల్ల ముఖం వేసి చూసేలోపు హీరో ఆ పక్కనే రెడీ గా ఉన్న త్రిశూలంతో విలన్ని యేసేసి గాల్లో ఎగరేస్తాడు. దెబ్బకు మిగతా రౌడీలు కాలవలోకి దూకేస్తారు. ఆఖరి సన్నివేశంలో హీరో తాలూకు వాళ్ళందరూ సిల్వర్ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తారు
హీరోయిన్ హీరో వంక ఆరాధనా పూర్వకంగా చూస్తుంది. హీరో తన ఒంట్లో దిగిన బుల్లెట్లను ఒకటొకటి లాగి పారేస్తూ హీరోయిన్ దగ్గరికి వచ్చి అబ్బా అంటూ ఒళ్ళో వాలి పడిపోతాడు. అప్పుడు దర్శకుడు ఆరు నెలల తర్వాత అని స్లైడ్ వేసి , హీరో.. హీరోయిన్తో పాటు ఓ పిల్లోడ్ని కూడా చూపించి, చూసింది చాలు కానీ ఇక బయటికి పోండి శుభం అంటాడు
4. హీరో ఐసియులో వెంటిలేటర్ మీద కూర్చుని హీరోయిన్ వంక చూస్తూ ల్లతా నేను గుటుక్కుమనగానే నువ్వు ఆ శోభన్ బాబుతో ఊటీలో సాంగేసుకోనని నాకు మాటివ్వు ల్లతా అంటూ హీరోయిన్ చేతిని తన చేతిలో వేసుకుని మరీ పుటుక్కుమంటాడు
అలాగే హీరోయిన్ కి.. తండ్రి పాత్రలకు కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. అప్పటిదాకా బాగానే ఉన్నోడు ఆ ప్రామిస్ చెయ్యి అని కెలికించుకుని మరీ పుటుక్కుమంటారు. అదో సెంటిమెంటు ఎమోషన్ సీన్స్.
5. హీరో గంజా తాగినా.. గుట్కా వేసినా ఆఖరికి పచ్చి తాగుబోతు ఆయినా హీరోయిన్ ఆ ముండావాడినే ప్రేమిస్తుంది. ఈ ఫార్ములాని ఇంకో వెయ్యేళ్ళు ఆయినా ఎవరూ మార్చలేరు
6. హీరో చేతిలో విలన్ ఖచ్చితంగా తన్నులు తినాల్సిందే.
7. పాత సినిమాల్లో పోలీసులు క్లైమాక్స్ లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు సినిమా అంతా ఉంటారు కానీ హోప్ లెస్సు అన్నమాట
8. హీరో పక్కన అందమైన వాళ్ళు ఉండరు.. అంతా తొట్టి గ్యాంగును ఏరుకొచ్చి పెడతారు.. మనోడి గ్లామర్ ను డామినేట్ చెయ్యకుండా జాగ్రత అన్నమాట.
9. క్లైమాక్స్ లో విలన్ ముండావాడ్ని హీరో యేసేస్తాడు.. సినిమా అయిపోయిందనటానికి బండ గుర్తు విలన్ గాడి డెడ్డే .ఇవాల్టికి ఈ నవరత్నాలు చాలు గానీ ఇంకా మీకేవన్నా చిన్నప్పట్నుంచి చూస్తున్న రొడ్డ కొట్టుడు సన్నివేశాలు గుర్తొస్తే ఇక్కడ కామెంట్లలో ఊదండి …. పరేష్ తుర్లపాటి
Share this Article