ఓ హీరో దిగుతాడు… ఆ ఊళ్లోకి వెళ్తాడు… రైతుల కష్టాల్ని చూసి భోరుమంటాడు… వీళ్లను ఉద్దరించాల్సిందే అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు… అబ్రకదబ్ర, హాంఫట్ అంటూ ఓ పాట వేసుకుంటాడు… పాట అయిపోయేలోపు రైతులు ఉద్దరింపబడాల్సిందే… ఖతం… రైతుల ఆనందబాష్పాలతో ఆ ఊరి చెరువు మత్తడి దూకుతుంది… ఆనందం పట్టలేక కొందరు గుండె ఆగి మరణిస్తారు……… హేమిటిది అని హాశ్చర్యపోతున్నారా..? మన హీరోలు మస్తు ఉద్దరిస్తున్నారు మరి… అప్పట్ల ఓ ల్యాప్టాప్, ఓ ఛాపర్ పట్టుకుని మహేశ్ బాబు వచ్చేసి ఉద్దరించాడు… తరువాత శర్వానందుడు వచ్చి ఇంకాస్త ఉద్దరించాడు… ఓసోస్, రైతుల్ని ఉద్దరించడం మాకు తెలియదా ఏమిటి అనుకుని ఇప్పుడు అరవదేశం నుంచి కార్తి వచ్చి ఉద్దరించాడు… ఎబ్బే, ఉద్దరించడానికి రైతుల సమస్యలు తెలిసి ఉండాల్సిన అక్కర్లేదు, వాటి మీదే ఫోకస్ అవసరం లేదు… జస్ట్, రైతుల్ని ఉద్దరిస్తున్నట్టు కాస్త రంగు, కాస్త వాసన వస్తే చాలు… వీలయితే కార్పొరేటు, కంట్రాక్టు వ్యవసాయం, భూముల్ని కబళిస్తున్న బడా భూతాలు అంటూ కాస్త విలనీని యాడ్ చేస్తే కమర్షియల్ వాల్యూ వచ్చేస్తుంది… సింపుల్…
కార్తి అనబడే తమిళ హీరో గారి తాజా సినిమా సుల్తాన్ చూస్తే అనిపించేది ఇదే… పోనీ, ఎవరో ఒకరు రైతుల కష్టాల్ని డిబేట్కైనా తీసుకొస్తున్నారు కదా, మంచిదే కదా అనుకుందామా..? అదీ ఉండదు… ఓ వంద మంది గుండా గాళ్లను వెంటేసుకుని… అంటే, ఈ సినిమా దర్శకుడి భాషలో వాళ్లు కౌరవులట… వాళ్ల పక్షాన ఈ కృష్ణ హీరో భగవానుడు నిలబడి, వాళ్లను అయిదారు నెలల్లో అబ్రకదబ్ర అంటూ గాంధీ శిష్యులుగా మార్చేస్తాడన్నమాట… ఓహ్, రౌడీలను మార్చడం ఇంత వీజీయా అని మనం పలుసార్లు మూర్ఛబోయి మళ్లీ సోయిలోకి వచ్చేలోపు రెండుమూడు దట్టమైన తమిళవాసన ఉన్న పాటలు… తెలుగు పదాల్లాగే అనిపిస్తాయి, కానీ తెలుగు కాదేమో అనే భ్రమల్లో పడేస్తాయి… పైగా అవే పిచ్చి గెంతులు… దానికితప్ప ఇంకెందుకూ పనికిరాని హీరోయిన్ స్టెప్పులు… అతికే అతి నేర్పే డవిలాగులు వచ్చిపోతాయి… అవునూ, మొన్న ఏదో ప్రెస్మీటులో చెప్పారు కదా, మా సినిమాలో వంద మంది కౌరవుల పక్షాన కృష్ణుడు ఉంటాడు అని… అదెలా..? కౌరవుల్ని పాండవులుగా మార్చాడు… వీళ్లంతా కలిసి ఇంకెవరిపైనో యుద్ధం చేశారు… ఇంతకీ కౌరవులు ఎవరు..? పాండవులు ఎవరు..? కృష్ణుడు ఎవరు..? కథ మధ్యలోనే టపీమని టపా కట్టేసిన తండ్రిగారు ఎవరు..? అని మనం జుత్తు పీక్కునేలోపు శుభం కార్డు పడుతుంది…
Ads
ఆ హీరోయిన్ రష్మిక మంథన ఈ సినిమాలో ఎందుకున్నదో ఆమెకే తెలియాలి… ఫాఫం, పోనీలే, తమిళ ఇండస్ట్రీలోకి తొలి ఎంట్రీ…! కాకపోతే ప్యూర్ ఫార్ములా సినిమా… ఫస్టాఫ్ అంతా కాస్త ఫన్, సాంగులు, ఫైట్లు గట్రా ఉంటయ్… అఫ్ కోర్స్, ఫైట్లు చివరిదాకా ఉండాల్సిందే కదా… ఈసారి ఒక విలన్ సరిపోడని, కాస్త భారీతనం ఉండాలని ఇద్దరు విలన్లను పెట్టారు… పెడితే పెట్టారు కానీ వాళ్లకు విలనీ పెద్దగా తెలియదుట… అసలే హీరో కార్తి కదా, వాళ్లే విలనీని అణిచేసుకున్నారేమో బహుశా… అవునూ, ఇంతకీ కార్తి ఎలా చేశాడు అంటారా..? అందులో ఊడబొడవటానికి పెద్ద స్కోపున్న పాత్రేమీ కాదు… రెగ్యులర్, రొటీన్, మాస్, మసాలా హీరోయిజమే… మరి ఏం చూడటానికి వెళ్లాలి అనేదే కదా మీ ప్రశ్న… భలేవారే, వెళ్లాలని ఎవరు సలహా ఇచ్చారు…?! సినిమా చూసిన వాళ్లకే మహర్షి, శ్రీకారం, క్షత్రియపుత్రుడు, సెవెన్ సుమురాయ్ వంటి బోలెడు సినిమాల కథలు రీళ్లు రీళ్లుగా మెదళ్లను చుట్టేసుకుంటున్నయ్…!! #Sulthan
Share this Article