Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకానొక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక రోజు… ఓ కుదువ తంతు…

February 4, 2025 by M S R

.

ఒక రిజిస్ట్రార్ ఆఫీసు అనుభవం…….. ఇల్లు కట్టి చూడు… ఒక్కోసారి కష్టాలు చెప్పే వస్తాయి- మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడానికి. అలా మొన్న ఒకరోజు నాకు చెప్పే వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని.

మనం భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేయగానే పట్టణ పరిపాలన శాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు జాగాను తనిఖీ చేస్తారు. నిర్మాణానికి అనుమతి రావాలంటే మనం కట్టే జాగాలో కొంత భాగం మునిసిపల్ కమిషనర్ పేరుతో అధికారికంగా ధారాదత్తం చేయాలి. దీన్ని ప్రభుత్వం ముద్దుగా “కుదువ బెట్టుకోవడం (మార్టిగేజ్)” అంటోంది.

Ads

టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతించిన ప్రకారం మనం కట్టినట్లు సాంకేతిక నిర్ధారణ అయితేనే ఆ మార్టిగేజ్ ను విడుదల చేస్తారు. లేకపోతే అది ప్రభుత్వపరమవుతుంది. అలా మా ఆవిడ పైసా పైసా కూడబెట్టుకుని దశాబ్దాల క్రితం కొన్న జానా బెత్తెడు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ముందు మునిసిపల్ కమిషనర్ కు భూమి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ ధారాదత్తం చేసివ్వడానికి వెళ్ళిన సందర్భం.

ఇందులో ప్రభుత్వ ఉద్దేశం ఏమైనా కావచ్చు. నాకు ఇందులో తలవంపులు; ఆర్థిక శారీరక శ్రమ; నష్టం కనిపిస్తున్నాయి. అయినా సరే తప్పదు. శ్రీవల్లి అడిగితే పుష్పరాజ్ సోఫాలో డబ్బులు పెట్టి అనుకున్న తేదీలోపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చేశాడు. మా ఇంట్లో, ఆఫీసులో కలిపి కొత్త పాత సోఫాలు నాలుగయిదు ఉన్నా…నా శ్రీమతి అడిగినా… నేను ఒక వార్డు మెంబరు డ్రయివర్ను కూడా మార్చలేను కదా!

పెళ్ళామడిగితే ఎట్లుంటాదో… చెప్పేకి నాతాన ఎర్రచందనం దుంగల్లేవు కదా! పుష్పరాజ్ తగ్గేదే ల్యా! అన్నాడు. మనం పెరిగేదే ల్యా! అనుకోవాలి- అని నేను మా ఆవిడను నాకొచ్చిన అరకొర మాటలతో ఓదార్చాను. ఆ అవమాన, నైరాశ్య గాథ ఇది.

నేనొక బాధ్యతగల ఆర్కిటెక్చర్ ను కలిశాను. ఆయన భయభక్తులున్న ధర్మపరాయణుడు. ఆయనొక మనిషిని అప్పగించారు. ఆ మనిషి మధ్యాహ్నం మూడింటికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక మనిషికి ఫోన్లో అప్పగించాడు. ఆ మనిషి ఇంకొకరి ఫోన్ నంబరిచ్చాడు. అతడికి ఫోన్ చేస్తే కూర్చోమన్నాడు.

మూడు నాలుగయ్యింది. నాలుగు అయిదయ్యింది. సొంత ఆస్తిని రాసిచ్చే నేనొచ్చాను…స్వీకరించే మునిసిపల్ కమిషనర్ రాడా? అంది మా ఆవిడ. హతవిధీ! ఈ చదువుకున్నవాళ్ళతో ఇదే చిక్కు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఒకరోజు అయిదు వేల మార్టిగేజ్ లు జరిగితే… అయిదువేల చోట్లకు వెళ్ళడం మనిషికి అయ్యే పనేనా! వాళ్ళెవరూ రారు!

అవతల మనలాగే మార్టిగేజ్ రాసివ్వడానికి వచ్చినవారందరూ బుద్ధిగా వారి వంతు కోసం నిరీక్షిస్తుంటే… నువ్వేమిటి రూల్స్ మాట్లాడతావు! అని నేను గట్టిగా విసుక్కున్నాను. నేను హర్ట్. నువ్వు నా వైపా! ఈ దుర్మార్గ విధానాలవైపా! తేల్చుకో! అంది. నువ్వు రాయలసీమవాడివి… ఎలా ఉండాలి? నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశావు… ఇలా దయనీయంగా తలవంచుకుని ఎలా ఉంటావు? అని రెచ్చగొట్టింది.

వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు- నేనెంత? అని సమయోచిత సామెత చెప్పి చల్లబరిచాను. కౌంటర్లలో వాళ్ళ ముందు అంత విసుగ్గా మొహం పెట్టి… వారికి వినపడేలా హిందీలో అలా తిడుతున్నావేమిటి? అని విసుక్కున్నాను. గమనించావా? వారికి అర్థం కావాలనే… అని నవ్వుతూ అంది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారు అనుభవజ్ఞులు. వైఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని కూడా అందులోనే అర్థముంది కాబట్టి నేను కూడా ఏడవలేక నవ్వాను.

ఇలా అని తెలిస్తే ఇల్లే కట్టేవాళ్ళం కాదు కదా! అని రాజ్యాంగపరమైన మౌలిక ఆదేశిక ప్రాదేశిక సూత్రాల్లోకి వెళ్ళింది. అకెడెమిక్ చర్చలంటే నాకు చాలా ఇష్టం. పైగా ఇంకో గంట ఆలస్యమయ్యేలా ఉంది. ఈలోపు తన దృష్టి మళ్ళించకపోతే అక్కడ అల్లకల్లోలం చేసేలా ఉంది. వెంటనే టీ వీ డిబేట్లో అరుచుకున్నట్లు కాకపోయినా… ప్రశాంతంగా చర్చలోకి దిగాము. అప్పుడు మా ఆవిడ అడిగిన ప్రశ్నలివి:-

1. భవన నిర్మాణ అనుమతి కోసం లక్షల్లో మునిసిపాలిటీకి ఫీజు కడుతున్నాం కదా! మళ్ళీ మార్టిగేజ్ కోసం స్టాంప్ డ్యూటీకి కూడా మనమే ఎందుకు కట్టాలి? కనీసం మార్టిగేజ్ ఉచితంగా చేసి పెట్టాలి కదా?
2. కోట్ల వ్యాపారాలే ఆన్ లైన్లో జరుగుతుంటే ఈ మార్టిగేజ్ ఏమిటి ఇలా ఇంకా పాతరాతి యుగంలో ఉంది?
3. ఎక్కడికక్కడ ఉన్న మునిసిపల్ జోనల్ ఆఫీసుల్లో చేస్తే ఇంత దూరం తిరిగే శ్రమ తగ్గుతుంది కదా!
4. అయినా సైట్ కొనేప్పుడు స్టాంప్ డ్యూటీ. ఇల్లు కట్టేప్పుడు స్టాంప్ డ్యూటీ… ఏమిటో ఈ స్టాంప్ కలెక్షన్ హాబీ…!

అలా వ్యవస్థను నాకు మాత్రమే వినిపించేట్టుగాను, స్వగతంలోను కడిగి పారేస్తూ కాలం భారంగా గడుపుతుంటే ఎప్పటికో మా వంతు వచ్చింది. తీరా లోపలికి వెళితే సేల్ డిడ్ జెరాక్స్ ఉంది… ఒరిజినల్ ఏదీ? పాస్ పోర్ట్ ఉందా? ఆధార్ ఓటీపి వచ్చిందా? లాంటి రాజ్యాంగ మౌలిక స్వరూప స్వభావానికి సంబంధించిన గంభీరమైన ఎన్నెన్నో ప్రశ్నలు అడిగింది రిజిస్ట్రార్ మహాతల్లి ప్రశాంత వదనంతో.

మా ఆవిడ భర్తను నేనేనని నన్ను చూసి; నా పక్కన నిలుచున్నది నా భార్యేనని ఆమెను చూసి … ఎగాదిగా చూసి… ప్రభుత్వ గుర్తింపు కార్డుల ఫొటోలతో మార్చి మార్చి చూసి… వివిధ ఆధారాలతో పోల్చుకుని… నిర్ధారణకు వచ్చేదాకా కౌంటర్లు తిప్పుతూనే ఉంది. కౌంటర్లలో ఉద్యోగులు కూడా ఒక డిజిటల్ ఫోటో, సంతకం తీసుకోవడానికి నత్తకు నడకలు నేర్పుతూ ఆరోజు చీకటిపడే వేళలో ఎలాగో పూర్తి చేయగలిగారు.

“వెయ్యి మంది దొంగలు తప్పించుకున్నా పర్లేదు… ఒక నిర్దోషికి శిక్ష పడకూదన్నది ఒక ఆదర్శం; లోకం అనాదిగా ఒప్పుకున్న న్యాయం” అని మా ఆవిడకు చెబుదామని నోటిదాకా వచ్చిన మాటను పరిస్థితుల దృష్ట్యా జీర్ణమంగే సుభాషితం అని భర్తృహరి అన్నట్లు గొంతు దాటి బయటికి రానివ్వలేదు.

ఏదో నేర విచారణలో భాగంగా అనుమానితులను పోలీసులు పిలిస్తే వెళ్ళి… వారి ముందు దీనంగా, భయంగా, దిగులుదిగులుగా… ఆ నేరం మేము చేయలేదని అన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడానికి నిలుచున్నట్లు మాకే అనిపించిందో! అందరికీ అలాగే ఉందో! మాకు తెలీదు. ప్రజాపాలనలో ఎవరు కలుగజేసుకుంటే ఇది బాగవుతుందో కూడా తెలీదు.

ఈగ ఇల్లలుకుతూ ఇంటిపేరు ఒక్కటే మరచిపోయింది. మేము ఇల్లు ఇంకా కట్టనేలేదు… కట్టి… అలకనేలేదు… ఇప్పుడే ఇంటిపేర్లు మరచిపోయాం. కట్టేసరికి ఎలాగూ అసలు పేర్లు కూడా మరచిపోతాం. నేను నేనన్న అహంకారాన్ని; మనం మనమన్న అస్తిత్వాన్ని రద్దుపరిచే ఒకానొక మార్టిగేజ్ వైరాగ్య జ్ఞానమిది! మనదనుకునేదేదీ మనది కానే కాదని తెలియజెప్పే నిస్సంగ నిర్మోహ నిర్వికార అద్వైతసిద్ధికి ప్రభుత్వ అధికార యంత్రాంగ బోధనా మార్గమిది!

కొస మెరుపు:-

“సమశ్శతౌచ మిత్రేచ తధామానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః”
అన్న భగవద్గీత భక్తియోగ శ్లోకాన్ని లేపాక్షి ఓరియంటల్ స్కూల్ ఆరోతరగతిలో మా సంస్కృతం గురువు కె వి ఆర్ మూర్తి సార్ అంత పట్టుబట్టి ఎందుకు నేర్పారో ఇలాంటప్పుడే అర్థమవుతూ ఉంటుంది.

శత్రువును- మిత్రుడిని;
సన్మానాన్ని- అవమానాన్ని;
వేడిని-చల్లదనాన్ని;
సుఖదుఃఖాలను ఒకేలా చూస్తూ ఈ భవసాగరాన్ని దాటి పొమ్మన్నాడు సాక్షాత్తు జగద్గురువు.

హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని వదిలినప్పుడు ఉబ్బితబ్బిబ్బులై సొంత ఊళ్ళకు వెళుతున్నవారిలా రిజిస్ట్రార్ ఆఫీస్ దాటి బయటికి రాగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాము. ఈసందర్భంగా మా ఆవిడ పెట్టిన శాపనార్థాలు ఎక్కడ ఫలిస్తాయోనని నాకు ఒకటే దిగులుగా ఉంది! వారిని అపార కృపా పారావారుడు, కరుణాసముద్రుడు, లోకాంతరంగుడు అయిన ఆ దేవదేవుడు ఎల్లవేళలా రక్షించుగాక! (కవర్ ఫోటో కేవలం సింబాలిక్)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions