.
Subramanyam Dogiparthi …… గొప్ప సందేశాత్మక ప్రేమకావ్యం . సప్తపది సినిమాలో బ్రాహ్మణ యువతి , దళిత యువకుడి ప్రేమ కధ . అయితే ఈ సినిమాలో వాళ్ళకు వాళ్ళుగా ఎలాంటి సాహసం చేయరు .
బొంబాయి సినిమాలో బ్రాహ్మణ యువకుడు , ముస్లిం అమ్మాయి . సామాజిక కట్టుబాట్ల సంకెళ్ళను విదిలించుకుని లేచిపోతారు . ఈ సీతాకోకచిలుక సినిమాలో బ్రాహ్మణ యువకుడు , క్రైస్తవ యువతి .
Ads
యువతి అన్న డేవిడ్ గ్రామంలో మోతుబరి , షైలాక్ లాంటి వడ్డీ వ్యాపారి , మత ఛాందసుడు . యువకుడి తల్లి పేద సంగీత టీచర్ . బలహీనురాలు . యువతీయువకులు పారిపోతారు . క్లైమాక్సులో క్రిస్టియన్ ఫాదర్ జగ్గయ్య మత ఛాందసుడయిన డేవిడ్ కు మతం కన్నా మానవత్వం , ప్రేమ గొప్పదని కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తాడు .
సప్తపది సినిమాలో యాజులు పాత్రను ఈ సీతాకోకచిలుక సినిమాలో క్రిస్టియన్ ఫాదర్ పోషిస్తాడు . ఇద్దరూ మతంకన్నా ప్రేమ , మానవత్వం గొప్ప అని ఉద్బోధిస్తారు . అయితే సీతాకోకచిలుక సినిమాలో ముగింపు ఏమిటంటే హీరోహీరోయిన్లు తమ మతాలకు గుర్తులయిన క్రాసుని , జంధ్యాన్ని తీసేసి ముందుకు సాగిపోతారు . వీళ్ళను చంపటానికి వెతుక్కుంటూ వచ్చిన గ్రామస్తులు నిశ్చేష్టులయి చూస్తూ ఉండిపోతారు .
ఈ సినిమా అఖండ విజయానికి కారణాలలో ఒకటి ఇళయరాజా సంగీతం , వేటూరి సాహిత్యం , వాణీ జయరాం , సుశీలమ్మ , బాలసుబ్రమణ్యంల గాత్ర మహిమ . మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో చెప్పలేం .
మరో గొప్ప పాట . సినిమాకు ఐకానిక్ సాంగ్ సాగరసంగమమే ప్రణయ సాగర సంగమమే . ఒకసారి డ్యూయెట్టుగా , మరోసారి హీరోయిన్ ఒక్కతే టీచర్ దగ్గర పాడుతుంది . ఇక్కడ పాడినప్పుడు సాగరసంగమమే ప్రణవ సాగరసంగమమే జానకి కన్నుల జలధితరంగం అని పాడుతుంది . అద్భుతమైన పాట . ఈ పాటలో ముచ్చెర్ల అరుణ శాస్త్రీయ నృత్యం కూడా చాలా అందంగా ఉంటుంది . నృత్య దర్శకుడు శేషుని మెచ్చుకోవాలి .
మరో శ్రావ్యమైన పాట అలలు కలలు . మరో చక్కటి డ్యూయెట్ మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పాట చాలా బాగుంటుంది . ఇంకొకటి హీరోయిన్ని టీజ్ చేసే పాట పాడింది పాడింది పట్నాల కాకి రొటీనే అనుకోండి . సినిమా అంతా ఇళయరాజా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది . ఈతరం బోయపాటి శీను వంటి ఢాంఢాం దర్శకులకు పనిచేసే ఢాంఢాం సంగీత దర్శకులు ఇలాంటి సినిమాలను చూస్తే బేక్ గ్రౌండే మ్యూజిక్ గురించి కాస్తయినా తెలుస్తుంది .
శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావే ఈ సినిమాకు కూడా నిర్మాత . టైటిల్సులో అల్లు అరవిందుకు ఆర్ధికాభివందనలు అని వేస్తారు . అంటే ఫైనాన్సింగ్ చేసాడన్న మాట . హీరోహీరోయిన్లుగా కార్తీక్ , ముచ్చెర్ల అరుణ ఇద్దరూ కొత్తవారే . తమిళ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాని తీసారు .
తమిళంలో హీరోయిన్ పాత్రని రాధ వేసింది . తెలుగులో Mucherla Aruna బాగా నటించిందని అనిపించింది నాకు . ముగ్ధగా , పొగరుబోతుగా , పట్టుదల కల యువతిగా బాగా నటించింది . దర్శకుడు భారతీరాజా అలా నటింపచేసారు .
ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్ర సిల్క్ స్మితది . వాంప్ పాత్రలకు , డాన్సర్ల పాత్రలకు పెట్టింది పేరయిన సిల్క్ స్మిత ఉదాత్తమైన పాత్రలో రాణించింది . తర్వాత శరత్ బాబు . మోతుబరిగా , అహంకారిగా , మత ఛాందసుడిగా , క్రూరంగా బాగా నటించారు . జగ్గయ్యకు ఈ పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకుడు మరచిపోలేడు .
హీరో తల్లిగా డబ్బింగ్ జానకి పేదరాలిగా , ఒక్కగానొక్క కొడుకు కోసం తాపత్రయపడే తల్లిగా బాగా నటించింది .
ఇంక ఆలీ . ఈ సినిమాకు ముందే రెండు సినిమాల్లో కనిపించినా ఈ సీతాకోకచిలుక ద్వారానే పాపులర్ అయ్యాడు . దీనికి ముందు ప్రాణం ఖరీదు , నిప్పులాంటి నిజం సినిమాల్లో నటించాడు . ఈ సినిమాలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు .
కొత్త కుర్ర పిల్లలతో తీసిన ఈ సినిమా పది సెంటర్లలో వంద రోజులు ఆడి రికార్డుని నెలకొల్పింది . మొత్తం క్రెడిట్ భారతీరాజాకే చెందాలి . స్క్రీన్ ప్లే , దర్శకత్వం , పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంటాయి . జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వచ్చింది . ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా వచ్చింది .
ఎవర్ గ్రీన్ మ్యూజికల్ మేజిక్ . ఈ సినిమా లోని పాటలు నాకు బాగా ఇష్టం . నా గుంటూరు సంసారం తొలిరోజుల్లో ఆరు వందల రూపాయలకు కొనుక్కున్న ఓ నేషనల్ పేనసోనిక్ రికార్డు ప్లేయర్ ఉండేది . కేసెట్ ప్లేయర్ అన్న మాట . ఈ పాటలతోనే నా డే ప్రారంభం అయ్యేది . అలా ఈ సినిమాతో ఓ ప్రత్యేక అనుబంధం కూడా ఉంది నాకు .
తొమ్మిదవ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . భారతీరాజాయే హిందీలో కుమార గౌరవ్ , పద్మినీ కొల్హాపురి , డేనీ డెంజోపాలతో తీసారు . టైటిల్సు నుండి శుభం దాకా ప్రతి ఫ్రేమూ చాలా అందంగా ఉంటుంది .
మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరం యువతీయువకులు , సాంప్రదాయ ఛాందసవాదులు , మతోన్మాదులు తప్పక చూడాలి . మారాలి . మతం కన్నా మానవత్వం , పరస్పర ప్రేమ గొప్పవని తెలుసుకుంటే ప్రశాంత జీవితాలను సాగించవచ్చు . Finally , it’s an unmissable , message oriented , musical , visual marvel . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
ఈ సినిమా కథ మీద కొన్ని విమర్శలూ ఉన్నాయి… అసలు పరిణత ప్రేమ అంటే తెలియని ఆ కుర్ర జంట, ఆకర్షణే నిజమనుకునే అపరిపక్వ ప్రేమను గొప్పగా, ఆదర్శంగా ఇలా గ్లోరిఫై చూపించి నిర్మాత, దర్శకుడు సొసైటీని పొల్యూట్ చేసే ప్రయత్నం చేశారనీ… యువతను స్కూల్ దశ నుంచే దారితప్పించే పూర్ టేస్ట్ ప్రదర్శన అనేది ఆ విమర్శల సారాంశం… (ముచ్చట)
Share this Article