.
వైసీపీ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని జనం మొన్నటి ఎన్నికల్లో బలంగా తిరస్కరించారు… చివరకు తెలుగుదేశం కూటమి కూడా అంత ఫలితాన్ని అంచనా వేయలేదు… సరే, ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది…
వర్తమాన రాజకీయాలను బట్టి ఏం జరుగుతుంది..? అప్పటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ముఖ్యులు, ఆ పార్టీ మద్దతుదారులు, ఆ పార్టీ ప్రభుత్వానికి వీరవిధేయులుగా పనిచేసిన అధికారులు గట్రా తమ ప్రాధాన్యాన్ని కోల్పోతారు… లేదా పాత అక్రమాలకు సంబంధించి కేసుల పాలవుతారు…
Ads
కొందరు ఉన్నతాధికారులు ఫోకల్ పాయింట్ల నుంచి అప్రధాన పోస్టుల్లోకి పంపించేయబడతారు, కొందరికి పోస్టింగులే నిరాకరించబడతాయి… వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు తమ పదవులకు రాజీనామాలు చేస్తారు లేదా చేయించబడతారు… అప్పటిదాకా అపరిమిత అధికారాన్ని అనుభవించినవాళ్లు తెర మీద నుంచి మాయం అయిపోతారు…
కొత్తగా నామినేటెడ్ పోస్టుల భర్తీ గట్రా సాగుతాయి… సేమ్, తెలుగుదేశం కేడర్ కూడా బలంగా అదే కోరుతుంది… అప్పటిదాకా వైసీపీ సేవలో నిమగ్నమైన ఎవరికైనా సరే కూటమి ప్రభుత్వంలో అసలు ప్రాధాన్యం ఉండకూడదనే భావిస్తుంది… రాజకీయాల్లో సహజం…
వైసీపీకి అనుకూలంగా పనిచేశారని కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల్ని వదులుకోలేరు, అలాగని కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా… పాత ప్రాధాన్య పోస్టుల్లో అలాగే కొనసాగించలేరు… చంద్రబాబుకు దీన్ని బ్యాలెన్స్ చేయడం కూడా ఓ పరీక్షే… ఐతే వైసీపీకి వీరవిధేయ మద్దతుదారులుగా వ్యవహరించిన ఇతర వ్యక్తుల మాటేమిటి..?
సరిగ్గా సింగర్ మంగ్లీ విషయంలో జరుగుతున్న రాద్దాంతం అదే… తెలుగుదేశం కేడర్ సోషల్ మీడియాలో బలంగా ఓ చర్చ పెడుతోంది… ‘‘ఆమె వైసీపీకి వీరవిధేయురాలు… తెలుగుదేశం పాటలు పాడమంటే మొహం మీదే నేను పాడను అని చెప్పింది… జగన్ కోసం ఊరూరూ తిరిగి పాటలు పడింది, ప్రచారం చేసింది… ఎస్వీబీసీలో ఓ పోస్టు సంపాదించి నెలనెలా అడ్డగోలుగా డబ్బు తీసుకుంది… పక్కాగా వైసీపీ జెండా పట్టుకుంది…’’
మరి అలాంటి సింగర్‌ను నెత్తిన పెట్టుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగుదేశం కేడర్ మనోభావాల్ని హర్ట్ చేశాడనేది ఇప్పుడు ఆరోపణ… ఆమెకు రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్దపీట వేశారు… అరసవిల్లి సూర్యనారాయణ ఆలయంలో కేంద్ర మంత్రికి దీటుగా ప్రోటోకాల్ మర్యాదలు, దర్శనాలు, ఆశీర్వచనాలు లభించాయి… స్థానిక కళాకారుల్ని కాదని మంగ్లీకి అమిత ప్రాధాన్యం ఇచ్చిన తీరు మీదా విమర్శలు వచ్చాయి
వైసీపీ మంగ్లీకి టీడీపీ రామ్మోహన్‌నాయుడు ఇచ్చిన ఈ అమిత ప్రాధాన్యం నిజానికి స్థూలంగా చూస్తే చిన్న విషయంగానే కనిపించవచ్చు… కానీ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ కోణంలో చూస్తే రామ్మోహన్‌నాయుడు మంగ్లీకి ఇచ్చిన అతి మర్యాద, అతి గౌరవం, ఆ సాన్నిహిత్యం అధికార కూటమి శ్రేణులకు ఏమాత్రం నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు…
ఆమధ్య శ్రీకాళహస్తి ఆలయంలో భం భం బోలే అనే తన ప్రైవేటు సాంగ్ వీడియో షూట్ చేసింది… ఈరోజుకూ నో యాక్షన్… (ఈ స్పూర్తితో సింగర్ మధుప్రియ తెలంగాణ కాలేశ్వరం టెంపుల్‌లో తన పాట వీడియో షూట్ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆ గుడి ఈవోను సస్పెండ్ చేసింది… ) అవునూ, మంగ్లీ ఇంకా ఎస్వీబీసీ ఆస్థాన సలహాదారుగా కొనసాగుతోందా..? ఏమండీ శ్యామలరావు గారూ, ఏమండీ బీఆర్ నాయుడు గారూ..?
‘‘మేం ప్రాణాలకు తెగించి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, జగన్ కేసులు, వేధింపులతో అవస్థలు పడ్డాం… కానీ నాయకులేమో ఈరోజుకూ అదే వైసీపీ మద్దతుదారులను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు, మరిక మా త్యాగాలకు విలువేమిటి..?’’ ఇదీ ప్రధానంగా తెలుగుదేశం కేడర్ సోషల్ మీడియా ముఖంగా వేస్తున్న ఓ బలమైన ప్రశ్న… రామ్మోహన్‌నాయుడి దగ్గర జవాబు లేదు… ఇవ్వలేడు..!! తెలుగుదేశం ముఖ్యులు వేసే ప్రతి అడుగునూ ఆ కేడర్ ఎంత నిశితంగా గమనించి, రియాక్ట్ అవుతుందో చెప్పడానికి మంగ్లీ ఎపిసోడ్ ఓ ఉదాహరణ..!!
Share this Article