.
Subramanyam Dogiparthi …… కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు , గొప్ప వాగ్గేయకారులలో ఒకరు , మించి రామ భక్తుడు త్యాగయ్య . త్యాగరాజస్వామి . శ్యామ శాస్తి , ముత్తుస్వామి దీక్షితులు , త్యాగయ్యలను కర్నాటక సంగీత త్రిమూర్తులు అని పిలుస్తారు . ముగ్గురూ సమకాలికులు , ఒకే చోట జన్మించిన వారే .
తమిళనాడులోని కుంభకోణం వద్ద ఉన్న తిరువారూర్లో జన్మించారు . 1767- 1847 త్యాగయ్య గారి పీరియడ్ . త్యాగరాజస్వామి జయంతిని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు . ఆయన రామైక్యం చెందిన తిరువయ్యూరులో ఆయన సమాధి అయిన రోజున త్యాగరాజ ఆరాధనోత్సవాలను సంగీత విద్వాంసులు , సంగీత ప్రియులు అద్భుతంగా నిర్వహిస్తారు .
Ads
ఆ ఉత్సవాలలో పాల్గొనటం సంగీత ప్రియులు తమ అదృష్టంగా భావిస్తారు . కుంభకోణం చాలాసార్లు వెళ్ళినా ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళలేదు . త్వరలో ఈ రెండు ప్రదేశాలను దర్శించుకోబోతున్నాను .
మనకున్న గొప్ప వాగ్గేయకారులు అన్నమయ్య , రామదాసు , త్యాగయ్య , క్షేత్రయ్య , నారాయణతీర్ధులు . నేను నాగార్జున యూనివర్సిటీ పాలకమండలిలో సభ్యుడిగా (2004-2010) ఉన్న సమయంలో అన్నమయ్య , నారాయణతీర్ధుల పేర్ల మీద అధ్యయన కేంద్రాలను నెలకొల్పటం జరిగింది . ఇప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయో తెలియదు .
మన తెలుగు వారికి రెండు త్యాగయ్య సినిమాలు ఉన్నాయి . మొదటిది 1946 లో చిత్తూరు వి నాగయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా . ప్రశంసల వర్షం కురిసింది . మైసూరు మహారాజు తన పేలసులో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయించుకుని చూసారు . నాగయ్య గారికి 101 బంగారు నాణేలను , శ్రీరామచంద్రుని రూపు ఉన్న బంగారు నెక్లేసుని బహూకరించారు . కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది .
రెండవ సినిమా 1981 ఏప్రిల్ 17న వచ్చింది . శంకరాభరణం సోమయాజులు , కె ఆర్ విజయ , రావుగోపాలరావు , రోహిణి , ఝాన్సీ , రాళ్ళపల్లి ప్రభృతులు నటించారు . స్క్రీన్ ప్లే , డైలాగులను ముళ్ళపూడి వారు అందిస్తే బాపు దర్శకత్వం వహించారు . కె వి మహదేవన్ సంగీత దర్శకులు . నవత కృష్ణంరాజు నిర్మాత . 1982 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . అయితే కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేకపోయింది .
ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించలేదు . నా ఉద్దేశంలో ఇందుకు ప్రధాన కారణం నాగయ్యతో సోమయాజుల్ని పోల్చుకుని చూడటం . సోమయాజులు బాగా నటించారు . నాగయ్యలా జీవించలేదు . త్యాగయ్యే నాగయ్య రూపంలో వచ్చి చేసిపోయారు . ఈ సినిమాయే కాదు ; పోతన కూడా అంతే . నాగయ్యను చూసిన కళ్ళతో మరొకరిని చూడటం కష్టమే .
ఒక్క రాఘవేంద్రరావు- నాగార్జున కాంబినేషనే గట్టెక్కింది . రామదాసు సినిమా . రాఘవేంద్రరావు మేజిక్ బాగా వర్కౌట్ అయి హిట్టయింది . సుమారు 50 పాటలు , గేయాలు , కృతులు ఉన్నాయి . ప్రతీ తెలుగు వాడికి తెలిసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు , తెర తీయగా రాదా , కనుగొంటిని , జగదానంద కారకా వంటి కీర్తనలు , కృతులు అన్నీ ఉన్నాయి .
ఈ సందర్భంలో బెంగుళూరు నాగరత్నమ్మను తలచుకోకపోతే ఈ సమీక్ష పరిపూర్ణం కాదు . త్యాగయ్య భక్తురాలు , సంగీత విదుషీమణి , దేవదాసి కులంలో జన్మించిన ఆమె తన ఇంటిని సైతం అమ్మి త్యాగయ్య సమాధిని తిరువాయ్యూరులో నిర్మించారు .
సినిమా నిర్మాణ సమయంలో ఆ ప్రదేశాన్ని సందర్శించిన చిత్తూరు వి నాగయ్య అక్కడ త్యాగరాజ నిలయం అనే పేరుతో ఒక సత్రాన్ని కూడా నిర్మించారట . దైవం మానవ రూపేణా . కళా సరస్వతి ఆమె రూపంలో భరత నాట్యానికి , కర్నాటక సంగీతానికి ఎనలేని సేవలను అందించింది .
రెండు సినిమాలు యూట్యూబులో ఉన్నాయి . నేను రెండూ చూసాను . రాముడి మీద భక్తితో , సంగీతం మీద ఇష్టంతో ఈ సినిమాలను చూస్తే చూడగలరు . సినిమాగా చూడటం ప్రారంభిస్తే కాస్త కష్టమే .
భారతీయ సాంప్రదాయ సంగీతం గురించి , మన వాగ్గేయకారుల గురించి , వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకోకపోతే ఎలా ?! బోర్ కొట్టినా సరే రెండు మూడు దఫాలుగా అయినా తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article