.
పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలూ చూసి ఇవ్వాలనేవారు… వరుడికి ధూమపానం, మద్యపానం, పేకాట ఇతరత్రా అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు… కానీ ఈరోజుల్లో ఈ లక్షణాలు కామన్ అయిపోయాయి ప్రస్తుతకాలంలో… అది వేరే కథ…
వరుడి ప్యాకేజీ ఎంత..? అతడి బ్యాంక్ బ్యాలన్స్ ఎంత ఉంది..? వధువు ఏం చదువుకుంది… ఎంత సంపాదిస్తుంది..? అనేవి చూడ్డం తప్పనిసరి అయిపోయాయి… ఇలాంటి వివాహాలు బంధాలు, కుటుంబ చరిత్ర, అనుబంధాల మీద కాకుండా బ్యాంకు బ్యాలెన్స్‌లు.. ప్యాకేజీలపై ఆధారపడి కుదురుతున్నాయి…
Ads
ఇప్పుడు చెప్పుకునే ఓ వివాహ సంబంధం ఎందుకు ఎత్తిపోయిందో చెప్పుకోవడానికే ఓ విశేష కారణం ఉంది… మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు… ఒకరినొకరు నచ్చారు, అన్నీ మాట్లాడుకున్నారు…
ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు… అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేశాడు, అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించాడు… అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు…
ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడనేది వధువు తరఫువారి ప్రశ్న… అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు…
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు… సిబిల్ స్కోర్ మాత్రమే చూసి పెళ్లి కేన్సిల్ చేస్తే పిచ్చితనం అంటారేమో గానీ, ఇప్పటికే చాలా రుణాలు తీసుకున్నాడనేది ఓ సమర్థ కారణమే… అవును మరి, వధువు తరఫువారు అన్నీ చూస్తారు కదా… ఇదీ చూశారు…
నిన్నో నేడో ఓ ఫుల్ పేజీ ఆర్టికల్ చూశాను ఏదో పత్రికలో… సిబిల్ మీద… సిబిల్ స్కోర్ పెరగడానికి ఏం చేయాలి..? ఏ ప్రాతిపదికలతో సిబిల్ రేటింగ్ ఫిక్సవుతుంది వంటి చాలా విషయాలు ఏకరువు పెట్టింది ఆ ఫుల్ పేజీ వార్త… కానీ కీలకమైన అసలు విషయాల్లోకి పోలేదు…
సిబిల్ రేటింగ్స్ ఖరారు చేసేది ప్రభుత్వ సంస్థ కాదు… నిజానికి దానికి ప్రభుత్వపరంగా ఏ ప్రాధాన్యత, ఏ విలువ ఉండకూడదు… కానీ బ్యాంకులు, రుణసంస్థలు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి… కొన్ని అంతర్జాతీయ సంస్థలు దేశాలకే క్రెడిట్ రేటింగ్స్ ఇస్తాయి… వాటిని బట్టే ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి… అది మరో కథ…
పర్ సపోజ్… ఓ వ్యక్తి తన జీవితంలో ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకులోనూ రుణం తీసుకోలేదు… క్రెడిట్ కార్డుల్లేవు… సో, రుణాల చెల్లింపుల్లో తనను అధికారికంగా ఎవరూ అంచనా వేయలేరు… మరి తనకు ఇప్పుడు రుణం కావాలంటే ఎలా..? తనకు ఏ రేటింగ్ ఇస్తుంది సిబిల్..? అలాంటోళ్లకు జీరో లేదా మైనస్ వన్ రేటింగ్ ఇస్తుంది సిబిల్…
అంటే తనకు రుణచెల్లింపుల చరిత్ర ఏదీ లేకపోయినా… సిబిల్ స్కోర్ అంటూ లేదు కాబట్టి కొత్తగా రుణాలు దక్కకపోవడం అన్యాయం కాదా..? కోట్లాది మంది ప్రజల రుణలభ్యతను, రుణఅవకాశాలను ఓ ప్రైవేటు సంస్థ శాసిస్తూ ఉంటుంది… సో, సిబిల్ స్కోర్ కోసం రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించి, మన క్రెడిబులిటీని బిల్డప్ చేసి పెట్టుకోవాలన్నమాట… ఇలా రుణాలకు సిబిల్ స్కోర్ ప్రామాణికం కావడం మీదే బోలెడు విమర్శలు…
పైగా వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలకే ఇవన్నీ తకరార్లు, కొర్రీలు, సాకులు… లక్షల కోట్లను ధనిక వ్యాపారులు, నాయకులు తీసుకుని ఎగవేస్తూనే ఉంటారు… బ్యాంకులే వసూళ్లు చేతకాక ఉదారంగా ఆ రుణాల్ని మాఫీ చేస్తూ ఉంటాయి… చేయకపోతే సదరు రుణగ్రహీత ఏ లండన్‌లోనో తేలతాడు ఇక్కడ మాయమై..! సో, సిబిల్ అనేదే ఓ భ్రమపదార్థం…!!
Share this Article