.
అంబానీ, ఆదానీ… ప్రస్తుతం మన దేశంలోనే కాదు… వరల్డ్ క్లాస్ బిలియనీర్లు జాబితాలో స్థానం విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నారు… ఒకరిని మించి మరొకరు…
అన్నీ సక్రమ సంపాదన మార్గాలేమీ కాదు… ఇప్పుడు ఇక్కడ ఆ ఆర్జన తీరుల జోలికి వెళ్లడం లేదు… కానీ ఒక్క విషయంలో మాత్రం అంబానీకన్నా ఆదానీకి చప్పట్లు కొట్టాలి… ఆ ఆదర్శాన్ని అభినందించాలి…
Ads
ఢిల్లీ ఎన్నికల ఫలితాల రద్దీలో పడి ఆదానీకి వార్తలపరంగా దక్కాల్సిన సరైన ప్రాధాన్యం, అభినందనలు దక్కలేదు… ఇంతకీ ఎందుకు అభినందించాలి..?
అంబానీ ఆమధ్య తన కొడుకు పెళ్లి చేశాడు… అక్షరాలా 5 వేల కోట్లు ఖర్చు చేశాడు… రెండు ప్రివెడింగ్ ఈవెంట్స్, అట్టహాసాలు, ఆడంబరాలు, సంపద ప్రదర్శన… పిచ్చి ఖర్చు… సమాజానికి అక్కర్లేని ఓ నష్టదాయక స్పూర్తి అది…
తనకు ఆర్జనలో ప్రత్యర్థి ఆదానీ కూడా తన కొడుకు పెళ్లి చేశాడు నిన్నో మొన్నో… వరుడి పేరు జీత్ ఆదానీ… ఆదానీ ముందుగానే చెప్పాడు, తన కొడుకు పెళ్లిని నిరాడంబరంగా చేస్తానని..! అన్నట్టుగానే అహ్మదాబాద్‌లోని ఆదానీ టౌన్‌షిప్‌లో గుజరాతీ, జైన పద్దతుల్లో నిరాడంబరంగా పెళ్లి తంతు పూర్తి చేశారు… వధువు తండ్రి గుజరాత్ డైమండ్ మర్చెంట్ జైమిన్ షా కూతురు దివా జైమిన్ షా…
డబ్బు లేక కాదు… ఇద్దరూ… కానీ దాన్ని ఓ వృథా ఖర్చుగా భావించాడు ఆదానీ… అంతేకాదు, ఆ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, నిజమైన ఆదర్శరీతిలో పది వేల కోట్లను సామాజిక సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించాడు…
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు గట్రా రంగాల్లో ఖర్చు చేస్తాడట… (తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ విధి, బాధ్యత ఖాతాలో ఈ పది వేలు ఖర్చు చేస్తాడా..? అదనమా..? తెలియదు… అదనమే అయితే అభినందనలను అర్హుడు…)
మరో మంచి విషయం… వరుడు జీత్ ఆదానీ కూడా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించాడు… ఏటా 500 మంది దివ్యాంగ మహిళలకు ఒక్కొక్కరికి 10 లక్షలు పెళ్లిసాయంగా అందిస్తానంటున్నాడు… గుడ్… దేశంలో ఛారిటీ విషయంలో అంబానీ, ఆదానీలకన్నా పలువురు ముందంజలో ఉన్నారు… అది వేరే కథ…
నో, నో, అంబానీని తప్పుపట్టొద్దు… తన నికరసంపదలో తన కొడుకు పెళ్లికి ఖర్చు చేసింది జస్ట్, అర శాతం మాత్రమే అని సమర్థించేవారూ ఉన్నారు… అదే ఖర్చును సొసైటీ కోసం పెట్టొచ్చుగా… దేశంలో ఎవరూ సొసైటీ నుంచి అంత సంపద తీసుకోలేదు, కాసింత, అంటే అదే అరశాతం సొసైటీకి ఇవ్వలేడా..? అందుకని ఈ విషయంలో అంబానీకన్నా ఆదానీ గ్రేట్…
అంబానీ పెళ్లిలో పాన్ ధర, స్వీట్ ధర, డెకరేషన్లు, బట్టలు, భోజనాలు, అలంకరణల దగ్గరి నుంచి లక్షల వార్తలు… ఫోటోలు… వీడియోలు… కానీ ఆదానీ ఇంట పెళ్లికి అందులో అరశాతం వార్తలు కవరేజీ లేదు… నిజానికి మీడియా ఆదానీ ఇంట నిరాడంబరపు పెళ్లికి కదా ప్రయారిటీ ఇవ్వాల్సింది…!
ఎస్, ఖచ్చితంగా ఎంత నిరాడంబరంగా పెళ్లి జరిగితే అంత మంచి కవరేజీ ఇవ్వాలి… రాను రాను ఓ వేలంవెర్రిలా మారిపోయింది పెళ్లిళ్లలకు ఖర్చు పెట్టడం..! ఒకరిని చూసి మరొకరు, పోటీలు, అప్పులు… పైగా సెలబ్రిటీల పెళ్లిళ్ల వీడియోలకు రేట్లు కూడా పెట్టి అమ్ముకుంటున్నారు… ఇదొక దుష్ట సంప్రదాయం..!! మన పెళ్లిళ్ల తీరు మీద రాస్తూ పోతే ఒడవదు, తెగదు… పెళ్లి మారదు..!!
Share this Article