.
“భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో?” అని ప్రశ్నిస్తూ… ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులను, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను పట్టి మనకు చూపించాడు దాశరథి. అలా మనం నిలుచున్న భూమి ఇలా ఉండడానికి ఎన్నెన్ని కోట్ల సంవత్సరాలు ఎన్నెన్ని విధాలుగా పరిణామాలు చెందిందో కొంతైనా తెలుసుకోవడానికి బెలుం గుహలోకి ప్రవేశించాలి.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల దగ్గరున్న బెలుం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవని సాంకేతిక నిపుణులు లెక్కకట్టారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో భూమిలోపల అంతర్వాహినిగా ప్రవహించిన చిత్రావతి చేసిన చిత్ర విచిత్రాలే ఈ బెలుం గుహలు. నది ఉధృతి రాతిని కోయగా… కోయగా సహజంగా ఏర్పడ్డవి ఈ గుహలు.
Ads
నీటిలో ఉన్న ఖనిజాలు, లోహాలు, లవణాలు కాలగతిలో ఘనీభవించి వివిధ ఆకృతులుగా ఏర్పడతాయి. పైకప్పు నుండి వేలాడే రాతి ఆకృతులు కొన్ని. కింది నుండి పైకి మొలిచినట్లు నిలిచేవి కొన్ని. నీరు సుడులు తిరుగుతూ రాతిని తొలిచి రంధ్రాలు చేసినవి కొన్ని. సాంకేతిక పరిభాషలో వీటన్నిటికీ విడివిడిగా పేర్లున్నాయి. ఆ వివరణలు ఇక్కడ అనవసరం.
వాల్మీకి రామాయణంలో గంగావతరణం అద్భుతమైన ఘట్టం. భగీరథుడు ముందు నడుస్తుంటే గంగ ఆయన వెనుక వెళుతూ ఉంటుంది. వామనుడు త్రివిక్రముడై… ఒక పాదంతో ఆకాశమంతా కొలిచేవేళ బ్రహ్మ కడిగిన నీరు- ఆకాశం నుండి శివుడి తల మీద… అక్కడి నుండి హిమాలయాల మీద… అటు నుండి భూమ్మీద…
చివరకు పాతాళం దాకా వెళుతుంది. భగీరథుడి వెంట వెళ్ళే గంగ అభంగ తరంగ మృదంగ ధ్వనులను, ఎగసిపడే తెలి నురగలను, ఒంపులు తిరిగే హొయళ్లను, దాటే కొండాకోనలను, దూకే జలపాతాలను, పవిత్రీకరించిన భూములను, క్షేత్రాలను, తీర్థాలను వాల్మీకి మైమరచి వర్ణించాడు.
బెలుం గుహలోకి దిగి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం నడిచి… మళ్ళీ వెనక్కు వస్తున్నప్పుడు కనిపించే వింత వింత ఆకృతులు, ఎత్తు పల్లాలు, సొరంగాలు కళ్ళతో చూడాల్సినవి. మనసులోకి ఒంపుకోవాల్సినవి తప్ప మాటల్లో చెబితే తేలిపోయేవి. ఆ గంగావతారాణాన్ని రికార్డు చేయడానికి ఒక వాల్మీకి పుట్టాడు. ఈ చిత్రావతి తీర్చి దిద్దిన బెలుం అందాలను రికార్డు చేయడానికి కూడా ఒక కవి పుట్టి ఉండాల్సింది.
లక్షల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహల్లో నాలుగున్నరవేల సంవత్సరాల క్రితం మానవులు నివసించినట్లు ఆధారాలు దొరికాయి. 1884 వరకు ఈ గుహలున్నట్లు ప్రపంచానికి తెలియనేలేదు. రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే ఇంగ్లిష్ అధికారి తొలిసారి బెలుం గుహలను ప్రస్తావించాడు.
మరో వందేళ్లు దీన్ని గురించి పట్టించుకున్నవారు లేరు. 1982లో డేనియల్ గెబావర్ ఆధ్వర్యంలోని జర్మనీ నిపుణుల బృందం చాలా కష్టపడి… పేరుకుపోయిన… కూరుకుపోయిన మట్టిని తొలగిస్తూ… రాతి గుహలోకి దారిని కనుగొన్నారు.
స్థానికంగా రామస్వామిరెడ్డి, చలపతి రెడ్డి, మద్దులేటి ఆ బృందానికి కావాల్సిన సహాయసహకారాలందించారు. 1988లో ప్రభుత్వం దీన్ని రక్షిత స్థలంగా ప్రకటించింది. 1999లో దీన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చేతుల్లోకి తీసుకుంది. 2002 నుండి సందర్శకులను అనుమతిస్తున్నారు.
గుహ ముఖ ద్వారాన్ని మాత్రం కొంత విస్తరించి… దిగడానికి అనువుగా మెట్లు ఏర్పాటు చేశారు. మిగతా గుహను అంగుళం కూడా మార్చకుండా అలాగే ఉంచి… కాపాడడం విశేషం. లోపల రంగు రంగుల విద్యుత్ దీపాలు అమర్చారు. కొంచెం లోపలికి వెళ్ళగానే ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి… బయటి నుండి గొట్టాల ద్వారా ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. కింద గుహ. గుహపైన రైతుల సాగు సాగుతూనే ఉంది.
గుహ ముఖద్వారంలో, లోపల ఏర్పడ్డ వివిధ రూపాలను బట్టి-
# సింహద్వారం
# కోటిలింగాల గది
# పాతాళగంగ
# సప్తస్వరాల గుహ
# ధ్యానమందిరం
# వేయి పడగలు
# మర్రిచెట్టు గది
# మండపం
కొస మెరుపు:- “బిలం” అంటే గుహ. ఎప్పటినుండో బిలం అని మనమంటుంటే ఇంగ్లిష్ వాడు వచ్చి పలకలేక…”బెలుం”, “బెలూమ్” అంటే దాన్నే ఖాయం చేసుకుని…తప్పును ఒప్పుగా ఒప్పుకున్నాం సార్”- అన్నాడు స్థానిక యువకుడైన మా గైడ్.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article