ఎన్నికలంటే దొమ్మీ కాదు… బాహాబాహీ ఫైటింగు కాదు… ఎన్నికలంటే వ్యూహాలు…! ఏపీలో ఉండీలేనట్టుగా ఉన్న బీజేపీకి ఈ సత్యం తెలుసో లేదో మనకు తెలియదు కానీ… దానికి చదరంగం ఎత్తులు ఏమాత్రం తెలియవని మరోసారి అర్థమైంది… నిజంగానే ఏపీబీజేపీని చూస్తే సంఘ్ పరివార్‌కే జాలేసేట్టుగా ఉంది పరిస్థితి… దేవుడా నువ్వే దిక్కు, నువ్వే ముఖ్యమంత్రివి అంటూ పార్టీ అధ్యక్షుడు అలా జనసేనాని ఎదుట సాగిలబడిపోతాడు… చేతులు కట్టుకుని, భయభక్తులతో కాస్త తలవంచి, కోపగించుకోకు ప్రభూ అన్నట్టుగా చూస్తుంటాడు… కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కనీసం ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేని ఓ చిన్న ప్రాంతీయ పార్టీ నాయకుడి ఎదుట మోకరిల్లడం మాటెలా ఉన్నా సరే… అసలు సొంత పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినే బీజేపీ ప్రకటించదు, అలాంటిది వేరే పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా కీర్తించడం నభూతో… నో, నో, ఆయన సీఎం కేండిడేట్ కాదు, కాకపోతే నా తమ్ముడు, నన్ను గెలిపిస్తాడు అంటుంది ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిని… ఈలోపు ఏం జరిగింది..? చాయ్ గ్లాసు పగిలిపోయింది… అనగా…?
ఆ జనసేన ఎన్నికల గుర్తు టీ గ్లాసును ఎన్నికల సంఘం వేరే నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది… ఇక్కడ ఎన్నికల సంఘం వైపు నుంచి ఏ పొరపాటూ లేదు… పవన్ కల్యాణ్ వైపు నుంచి కూడా ఏ పొరపాటూ లేదు… జనసేన వోట్లు తమకు సరిగ్గా పడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది బీజేపీయే… కానీ ఆ సోయి లేదు పార్టీకి… దాడి చేయడం, యుద్ధం చేయడం కాదు, ప్రమాదం ఏవైపు నుంచి వస్తుందో ముందుగా ఊహించగలిగేవాడే చదరంగంలో రాణిస్తాడు… నవతరం పార్టీ ఏం చేసింది..? చాకచక్యంగా ఎత్తు వేసింది… ఆ దెబ్బకు బీజేపీ గింగరాలు తిరిగిపోతున్నదిప్పుడు… నవతరం ఎలా ఆలోచించిందీ అంటే…
Ads
- ఎలాగూ జనసేన బరిలో లేదు… అదేమో రిజిష్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు… రికగ్నైజ్ పార్టీ కావాలంటే నిర్ణీత శాతాల్లో వోట్లు సంపాదించి ఉండాలి… ఆ లెక్కల్లో జనసేన ఇంకా ఫిట్ కాలేదు… సో, దానికి ఇంకా గుర్తింపు రాలేదు…
- గుర్తింపు దక్కి ఉండాలంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు…. చెల్లిన వోట్లలో 6 శాతం వచ్చి ఉండాలి, లేదా కనీసం రెండు సీట్లు గెలిచి ఉండాలి… మొత్తం సీట్లలో 3 శాతం గెలిచి ఉండాలి లేదా మొత్తం వోట్లలో 8 శాతం సాధించి ఉండాలి… అవేవీ జరగలేదు కాబట్టి జనసేనకు గుర్తింపు దక్కలేదు…
- దాంతో దానికి ఇన్నిరోజులూ కేటాయిస్తున్న గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది… ఫ్రీ సింబల్ కాబట్టి ఏ అభ్యర్థయినా తమకు కేటాయించాలని అడగొచ్చు… నిరాకరించే అవకాశం ఎన్నికల అధికారులకు కూడా ఉండదు…
- జనసేన బరిలో ఉండి ఉంటే, ఆ పార్టీకే గాజు గ్లాసు కేటాయించేవాళ్లు… కానీ అది పోటీలో లేదు… నవతరం కూడా రిజిష్టర్డ్ పార్టీయే… వాళ్లు అడిగితే ఫ్రీ సింబల్‌గా ఉన్న గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం తిరస్కరించడానికి వీల్లేదు…
- గాజు గ్లాసును తాము తీసేసుకుంటే… బీజేపీకి పడాల్సిన జనసేన వోట్లు తమకు టర్న్ అవుతాయి… ఇదీ ఆలోచన… భలే పట్టుకున్నాడు ఆ పార్టీ నాయకుడెవరో గానీ…
ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలే పలుసార్లు గెలుపూవోటముల్ని అటూఇటూ మార్చేస్తుంటయ్… మనం చూశాం కదా, ట్రక్కు గుర్తు కూడా టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండి, ఒకటీ రెండు చోట్ల టీఆర్ఎస్ పార్టీని ఓటమి పాలుచేసింది… ఇక్కడ ట్విస్టు ఏమిటంటే… నవతరం పార్టీ గాజు గ్లాసు గుర్తును అడగబోతున్నదని అక్కడి వైసీపీ లీడర్లకు ముందే తెలుసు… సో, జరిగేదంతా నవ్వుకుంటూ చూస్తుండిపోయారు… నవతరం పార్టీ గనుక ఆ గుర్తు అడగకపోతే, అవసరమైతే వేరే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ద్వారా ఈ గ్లాసు గుర్తు కేటాయింపును అడిగించాలనీ వైసీపీ లీడర్లు ప్లాన్ చేశారుట… ఎవరో ఒకరు, బ్యాలెట్ పేపర్లో మాత్రం ఈ గ్లాసు గుర్తు ఉండాలనేది వైసీపీ ఆలోచన… దీన్ని లోకల్ బీజేపీ పట్టుకోలేకపోయింది… తెల్లమొహం వేసింది… దీన్ని ముందే ఊహిస్తే… ఏదోరకంగా ఎన్నికల సంఘం ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా ప్రయత్నించడానికి వీలుండేది… పవన్ కల్యాణ్ పాదయాత్ర బిజీలోనే బీజేపీ నాయకులు ఉండిపోవడం వల్ల కూడా దీన్ని ముందే పసిగట్టలేకపోయి ఉండొచ్చు కూడా..!
ఇదెలా నష్టపరిచే ప్రమాదం ఉందంటే..? జనసేన సానుభూతిపరులు, అభిమానులు బ్యాలెట్ పేపర్ మీద గ్లాసు గుర్తు చూసి వోట్లు గుద్దేసే ప్రమాదం… తద్వారా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన వోట్లకు గండి… కమలం గుర్తుకు వోటు వేయండి అనే ప్రచారంకన్నా గ్లాసు గుర్తుకు వోటేయకండి ప్లీజ్ అని బీజేపీ అదనపు ప్రచారాన్ని చేసుకోవాల్సిన దురవస్థ… నిజానికి దీని ప్రభావం ఎంతమేరకు ఉంటుందో ఇదమిత్థంగా అంచనా వేయడం కష్టం… కానీ గందరగోళం మాత్రం నిజం… ‘‘ఏమో, మన బాసు చివరి క్షణంలో నిర్ణయం మార్చుకుని, బీజేపీకి సపోర్ట్ ఉపసంహరించుకుని, పోటీకి పెట్టాడేమో’’ అనుకుని వోట్లేసే వాళ్లూ ఉంటారు… దీనికి తగ్గట్టు నవతరం పార్టీ అభ్యర్థి తన ప్రచార చిత్రాల్లో ఓ నిలువెత్తు ఫోటో పెట్టుకుని, మెడలో ఎర్ర తువ్వాలు గనుక వేసుకుని, మెడకు ఎడమవైపున కుడిచేత్తో తడుముతున్నట్టు ఫోజు (పవన్ మ్యానరిజం) పెడితే మరింతగా పేలుతుంది… ఎర్ర తువ్వాలు వాడటం మీద ఏ బ్యానూ లేదని గమనించగలరు..!!
Share this Article