.
ఎవరో అడిగారు… గుమ్మడి నర్సయ్యకు రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తప్పు కాదా..? అంతసేపు పడిగాపులు కాస్తే… ఐదుసార్లు ఎమ్మెల్యే, పెద్దమనిషి… కలవకపోవడం అంటే అవమానించడం కాదా..?
నిజమే… ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టీమ్ నుంచి తప్పు… తను ఒకవేళ కలిసే పరిస్థితి లేకుండా ఉంటే… తన ఇంటి వద్దో, సచివాలయం వద్దో… ఎవరైనా వచ్చి చెప్పి ఉండాల్సింది… లేదా నిజంగా రేవంతుడే వచ్చి కలిసి ఉంటే అది తనకే మంచి పేరు తెచ్చి పెట్టి ఉండేది… రెండూ జరగలేదు… ఒకరకంగా అగౌరవమే…
Ads
ఐనా తను ఎక్కువగా సచివాలయం వదిలేసి, మొత్తం సమీక్షలు, మీటింగులు పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగులో పెడుతున్నాడు కదా… ఐతే కేటీయార్ సహా బీఆర్ఎస్ దీన్ని ప్రాపగాండా చేయాల్సిన పనీ లేదు… ఎందుకంటే..? గతంలో గద్దర్‌కూ కేసీయార్ వల్ల ఇదే అవమానం కదా జరిగింది…?
అది ఎంతో ఇదీ అంతే… అంతెందుకు..? గూడ అంజయ్య అనుకుంటా… ఆసుపత్రిలో ఉండి, ఒక్కసారైనా కేసీయార్‌ను కలిస్తే బాగుండు అని నోరు విడిచి అడిగినా సరే కేసీయార్ ఖాతరు చేయలేదు… తనూ అంతే కదా… ప్రగతి భవన్ గోడలు ఎంత ఎత్తుకు లేపి, ఎవరికీ ఎంట్రీ లేకుండా చేశాడు కదా… అదేకాదు…
ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కావాలనే ప్రజాజీవితానికి దూరంగా ఉంటున్నా సరే… ఆర్జిత సేవలు, విశిష్ట దర్శనాలు తప్ప ధర్మదర్శనాలకు దిక్కులేదు కదా ఫామ్ హౌజులో… సో, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు… పరస్పరం వేళ్లు చూపుకుని విమర్శించుకునే పనీ లేదు…
వీళ్లే కాదు… జగన్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి… అందరూ అంతే… దర్శనాలు బహు దుర్లభం… ఒక్క వైఎస్ మాత్రమే మినహాయింపు… గ్రేట్… రోజూ ప్రజాదర్బారు… సగటు మనుషుల సమస్యలు కూడా విని, వివరాలు తీసుకోవడమే కాదు… వాటి ఫాలోఅప్ జరిగేది…
సరే, గద్దర్ గతంలో ప్రజాప్రతినిధి కాదు, తను ఏ పోస్టులో లేడు, తనకు ప్రోటోకాల్స్, అపాయింట్‌మెంట్స్, ప్రొసీజర్స్ తెలియకపోవచ్చు… కానీ గుమ్మడి నర్సయ్య అయిదుసార్లు ఎమ్మెల్యే… తనకు తెలిసి ఉండాలి కదా… ఓ ప్రాపర్ చానెల్ అవసరం అని… నేరుగా ఇంటికి వెళ్తే సీఎం కలుస్తాడా..? తను ఏ మీటింగులో ఉన్నాడో, ఏ సమీక్షలో ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో…
ఆయన న్యూడెమోక్రసీ పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షమేమీ కాదు… తనిప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు… మాజీ ఎమ్మెల్యేలు బోలెడు మంది ఉన్నారు, అందరూ ఇలాగే వస్తే ఎందరిని కలవగలడు..? అనే శుష్క వాదనలూ కరెక్టు కాదు… ఆయన ఏదో సమస్యపై వచ్చాడు… కలవడం వీలుకాకపోతే ఎవరినైనా బాధ్యుడిని, ముఖ్యుడిని నర్సయ్య చెప్పింది విని ఫాలో అప్ చేయాల్సిందిగా చెప్పి ఉండాల్సింది… లేదా ఇంకేదో సమయాన్ని చెప్పి రమ్మనాల్సింది…
ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు ఏది చెప్పుకోవడానికి సీఎం దగ్గరకు వచ్చినా… వినడానికి, ఫాలో అప్ చేయడానికి, రికార్డ్ చేసి, ఓ ప్రాపర్ మెకానిజం ద్వారా సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం అవసరం… అది రాజకీయ నాయకుడికి మంచి పేరు తెచ్చి పెడుతుంది కూడా…! రేవంత్ క్యాంపులో ఈ లోపం స్పష్టంగానే కనిపిస్తోంది..!!
గద్దర్, గుమ్మడి నర్సయ్య ఇద్దరూ విప్లవ పార్టీల ప్రతినిధులే… ఒకరు పీపుల్స్‌వార్, తరువాత మావోయిస్టు… నర్సయ్య న్యూడెమోక్రసీ… కాకపోతే న్యూడెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు కూడా ఓ ఎత్తుగడగా మొగ్గి ఎన్నికల్లో పోటీచేస్తుంటుంది… అవునూ, గద్దర్ పేరిట అవార్డులు కూడా పెట్టేంత అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి అందులో కాసింతైనా గుమ్మడి నర్సయ్యకు ప్రయారిటీ, విలువ ఇవ్వకపోవడం ఎలా అర్థం చేసుకోవాలి..!? సమంజసంగా లేదు..!! ఈయనకు కూడా తెలంగాణ సమాజంలో మంచి పేరే ఉంది నాయకా…
Share this Article