నిన్నంతా సోషల్ మీడియాలో ఒకటే హడావుడి… అదీ తెలుగు సోషల్ మీడియాలో… గ్రూపులుగా విడిపోయి మరీ వాదులాటలకు దిగారు… ట్రోలింగ్ సరేసరి… తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నయ్… చెన్నైలో సెలబ్రిటీలు, ప్రత్యేకించి సినిమా వ్యక్తులు, రాజకీయ నాయకులు గట్రా ఎక్కువ కదా… పైగా అదసలే చెన్నై… సినిమా వాళ్ల పట్ల అభిమానుల పిచ్చి మరీ విపరీతం… అకస్మాత్తుగా హీరో విజయ్ సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్‌కు వెళ్లిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… తన వెంట జనం టూవీలర్ల మీద పరుగులు… అసలే చాలా పాపులర్ హీరో కదా… ఇంకేముంది క్షణాల్లో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయిపోయాయి… ఒక హీరో సైకిల్ మీద పోలింగ్ బూత్‌కు పోవడం వార్తే కదా… అది కాస్తా చివరకు ఏ రంగు పులుముకున్నదీ అంటే… పెట్రోల్ ధరలకు నిరసనగా విజయ్ ఈ పనిచేశాడు అనే ప్రచారం స్టార్టయింది… అది మరింత వైరల్ అయిపోయింది… అసలే పోలింగ్ మొదలైపోయింది, మస్తు పాపులారిటీ ఉన్న ఒక హీరో చర్యతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్లస్ బీజేపీకి నష్టం కదా… దొరికింది చాన్స్ అనుకున్న డీఎంకే సోషల్ మీడియా వింగ్ వెంటనే రంగంలోకి దిగిపోయి, అధికార పార్టీలకు సరైన పంచ్ వేశాడు విజయ్ అంటూ ప్రచారం స్టార్ట్ చేసింది…
అన్నాడీఎంకే, బీజేపీ క్యాంపులకు కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు… ఏదో తోచిన ఎదురుదాడి స్టార్ట్ చేసింది… కానీ సరిపోలేదు… ఈలోపు తెలుగు సోషల్ మీడియా కూడా ఈ ‘పెట్రోల్ ధరల నిరసన’ ప్రచారాన్నే నమ్మింది కాసేపు… శెభాష్‌రా విజయ్, నువ్వురా అసలైన హీరోవు, రియల్ హీరో, మా తెలుగు హీరోలు ఉన్నారు దద్దమ్మలు అనే దాకా వెళ్లిపోయింది… ఆమధ్య విజయ్ ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయి కదా, నిజంగానే బీజేపీ మీద కోపంతో విజయ్ జోసెఫ్ ఈ పనిచేశాడు కావచ్చు అని అందరూ నమ్మారు… తను ఏదో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది కొన్నాళ్లు… నిజానికి తను ఎందుకు ఈ సైకిల్ సవ్వారీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడో గానీ, ఈ షో ఎక్కడో బెడిసికొట్టి, ఇంకేదో రూట్లో వెళ్తోంది అనే డౌట్ వచ్చింది కాసేపటికి విజయ్ క్యాంపుకి… దాంతో నో, నో, ఈ ప్రచారం అంతా అబద్ధం అని వివరణలు స్టార్ట్ చేసింది… ఆ క్లారిటీ కూడా విజయ్ క్యాంపే ట్వీట్ ద్వారా ఇచ్చింది… ‘‘అయ్యా, తన సమీపంలోని పోలింగ్ బూత్ దగ్గర అన్నీ ఇరుకు రోడ్లు… తన కారు పార్కింగ్ చేయలేని పరిస్థితి… అందుకే సైకిల్‌పై వెళ్లాడు, వేరే ఉద్దేశాలు లేవు’’ ఇదీ వాళ్లు ఇచ్చిన క్లారిటీ… ఐనా సరే నిన్న సాయంత్రం దాకా తెలుగు సోషల్ మీడియా గ్రూపులు తన్నుకుంటూనే ఉన్నయ్… యాంటీ-బీజేపీ సెక్షన్ అయితే పండుగ చేసుకుంది …
Ads
నిజానికి ఇది మరింత వేడిని పెంచడానికి ఇంకో కారణం ఉంది… హీరో అజిత్ ఏ హడావుడీ లేకుండా వెళ్లి, క్యూలో నిల్చుని వోటేయడం పరిపాటి… ఏ ఓవరాక్షనూ ఉండదు… అసలు తను అభిమానులు, ఈ హంగామా గట్రా తనకు నచ్చదు… అభిమానుల మధ్య గొడవల్ని కూడా సహించడు… ఐనా సరే, విజయ్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ నడుమ ఎప్పుడూ ఏదో రచ్చ నడుస్తూనే ఉంటుంది… సో, అజిత్ క్యూలో తన భార్య షాలినితో కలిసి నిలబడ్డ ఫోటో పెట్టేసి… అన్నాడీఎంకే, బీజేపీ క్యాంపులు విజయ్ వ్యతిరేక ప్రచారానికి దిగాయి… ఐటీ అక్రమాలు చేసేవాళ్లు ఓవరాక్షన్ ఇది, పద్దతి కలిగిన వ్యవహారధోరణి ఇదీ అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి ఆ పోస్టుల్ని వైరల్ చేశారు… ఇది ఎటెటో టర్న్ తీసుకుంది… నిజంగానే విజయ్ సైకిల్ స్వారీ పోలీసులకు లేనిపోని తలనొప్పుల్ని క్రియేట్ చేసింది, తన వెంట పరుగులు తీసేవాళ్లను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది… చివరకు విజయ్ ఏదో టూవీలర్‌పై ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు… అయితే..?
అజిత్కూ విజయ్‌కూ పోల్చి, అజిత్‌ను ఆకాశాన్ని ఎత్తుతున్న పోస్టులు చూసిన విజయ్ ఫ్యాన్స్‌కు చిర్రెక్కించింది… వాళ్లకూ ఓ చాన్స్ దొరికింది అనుకోకుండా… ఎవడో ఫ్యాన్ మాస్కు లేకుండా సెల్ఫీ కోసం ఓవరాక్షన్ చేస్తుంటే, ఓపిక నశించి అజిత్ వాడి ఫోన్ లాక్కుని, జేబులో పెట్టేసుకున్నాడు… చూశారా, చూశారా, ఫ్యాన్ పట్ల అజిత్ వ్యవహార ధోరణి అంటూ ఉల్టా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు క్షణాల్లో… తమిళనాడులో అంతే… భూమ్మీద పెట్రోల్ పోసి ఉంటుంది రెడీగా… అగ్గిపుల గీయడమే తరువాయి… అంటుకుంటుంది… నిజానికి అజిత్ మరీ మన బాలయ్య తరహాలో ఫ్యాన్ నడ్డి మీద నాలుగు పీకి, ఫోన్‌ను దూరం పారేయలేదు… సదరు ఫ్యాన్‌ను దగ్గరకు పిలిచి, ఫోన్ వాపస్ ఇచ్చేసి, అక్కడ అసౌకర్యం కలిగినవాళ్లకు సారీ చెప్పి, హుందాగా వెళ్లిపోయాడు… వాస్తవంగా అజిత్కూ విజయ్‌కూ పోలిక పెట్టడం అనవసరం… ఎందుకంటే, అజితే కాదు, రజినీ, కమల్ సహా చెన్నై సినిమా సెలబ్రిటీలంతా సింపుల్‌గా ఏ హడావుడీ, ఏ ఓవరాక్షన్ లేకుండానే వోట్లేసి వచ్చారు కదా…!! ఈ మొత్తం కథలో నీతి ఏమిటి..? సెలబ్రిటీలు బాగానే ఉన్నారు, ఎటొచ్చీ జనంతోనే అసలు సమస్య…!! అదే నెటిజనం…!! ఎక్కడో వర్షం పడుతుంటే, ఇక్కడ బురదతో కొట్టుకోవడం దేనికి..?!
Share this Article