.
రేపు మహాశివరాత్రి… భక్తసులభుడికి అనేకరకాల పూజలు… జాగారం… అభిషేకాలు… ఐనా తనేమీ వైభోగ విష్ణువు కాదు కదా… మెడలో పాము, జటాజూటం, నెత్తిన గంగ… రుద్రాక్షలు, తోలు దుస్తులు… స్మశానాల వెంబడి పర్యటనలు… నల్లటి మెడ… నొసటన ఎర్రని మూడో కన్ను…
ప్రసాదాలు, ఆడంబరాలు, అట్టహాసాలు ఏమీ కోరుకోడు కదా… జిల్లేడు, ఉమ్మెత్త పూలు… నెత్తిన నీటిధార… గుళ్లుగోపురాలు కూడా అక్కర్లేదు… అడవుల్లో, ఎడారుల్లో, పర్వతాల్లో కూడా ఎక్కడైనా సరే… ఓ త్రిశూలం, ఓ లింగరూపం సమకూరితే సరి… అదే గుడి… అసలు నివాసం కైలాస పర్వతం…
Ads
నంది, ప్రమథగణాలు, అదే హడావుడి… ఓసారి పార్వతికి చిరాకెత్తిందట… ఎంతసేపూ వాళ్లే… పర్వతరాజు ఇంట్లో అనేక పరిచారికల పరిచర్యలు, సేవల నడుమ బతికిన తను ఒంటరితనాన్ని భరించలేకపోతోంది… కార్తికేయుడు, గణేషుడు, నంది, ప్రమథగణాలు… అంతా వాళ్లే… మాట్లాడుకోవడానికి మరో ఆడమనిషి లేకపోతే ఎలా అనుకుంది…
శివుడికి మొరపెట్టుకోవాలని అనుకుంటుంది… కానీ అడగదు… శివుడు నవ్వుతాడేమోనని… సఖి మనసులో ఏముందో గ్రహించలేడా శివుడు..? లీలగా చెవుల్లో వినిపిస్తూనే ఉంది… ‘‘మహానుభావా, మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి, మాటాముచ్చట చెప్పుకోవడానికి ఎవరినైనా తీసుకురావా… నాకు ఓ మరదలు కావాలి…’’
‘నువ్వు భరించగలవా..? తీసుకొస్తాను, నాకు ఓ సోదరి ఉంది, నీకు తెలియదు’ అన్నాడు… పార్వతి విభ్రమతో ‘ఎప్పుడూ చెప్పనేలేదు, త్వరగా తీసుకురా’ అని ఉత్సాహపడింది…. కానీ ఇలాంటి కోరికలు కొత్త చిక్కులు తెచ్చిపెడతాయని ఆమెకు అర్థం కావాలి ఎలా..?
తన దైవికశక్తితో ఓ మహిళను సృష్టించాడు… మాయా సృష్టి… తనకు ఓ పేరు కూడా పెట్టాడు… అసావరి… (ఆ పేరుతో ఓ రాగం కూడా ఉంది)… లోకోత్తరమైన అందంతోకాదు… భారీ కాయంతో… ఆమెను చూసి పార్వతి సంతోషపడింది…
ఆమె స్నానం చేసి వచ్చి, ఆకలిగా ఉంది వదినా, ఆహారం కావాలి అనడిగింది… పార్వతి వడ్డించింది… ఆమె తింటూనే ఉంది… అందరికోసం ఉద్దేశించిన ఆహారం మొత్తం స్వాహా… పార్వతి విస్తుపోతూ చూస్తోంది… ఇదే కాదు, మాట తీరు, కూర్చునే తీరు సహా అన్నింటా ఆమెది ‘ఓ తరహా పోకడ’… పార్వతికి జీర్ణం కావడం లేదు, కొత్త చిరాకు మొదలైంది… వదినా ఆడుకుందామా అనడిగింది అసావరి…
పార్వతి తలూపేలోపు ఆమెను తన కాలి పగుళ్లలో బంధించింది అసావరి… శివుడు వచ్చి పార్వతీ పార్వతీ అని పిలుస్తున్నాడు… కానీ కనిపించదే… చివరకు నవ్వుతూ అసావరి పార్వతిని వదిలేసింది… ఆమె తలపట్టుకుంది… ఈమెను భరించలేను, శివా… పెళ్లి చేసి పంపించెయ్ లేదా కైలాస పర్వతం నుంచి దింపెయ్ అని చేతులు జోడించింది…
‘నేను చెప్పాను ముందే… నువ్వు భరించలేవని… నీ వాహనం మీద లోకాలన్నీ తిరుగుతూ నిన్ను పూజించే భక్తురాళ్ల కోరికలు తీరుస్తూ ఉండు… ఇంకెక్కడి ఒంటరితనం..?’’ అని నవ్వుతూ ఓసారి ఆమెను కళ్లుమూసుకొమ్మన్నాడు… ఆమె కళ్లు తెరిచేసరికి అసావరి మాయం… అవును, మాయ కదా, మాయమైంది..!!
(శివపురాణంలో ఉందో లేదో తెలియదు… సరదాగా కల్పించిన ఓ కథ కావచ్చు బహుశా… నెట్‌లోనే ఇంగ్లిషులో కనిపించిన ఈ కథకు తెలుగు అనువాదం ఇది… సరదాగానే చదువుకొండి…)
Share this Article