.
సందీప్ కిషన్ సినిమాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి… ఏదీ బాగా క్లిక్కయినట్టు కనిపించదు… ఈసారి మరో సినిమా… అంతే, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు… సినిమా పేరు మజాకా…
బేసిక్ స్టోరీ లైన్ బాగున్నా సరే… ఫుల్లు కామెడీనే నమ్ముకుని కథ చెప్పాలనుకోవడం వరకూ సరే… కానీ ఆ కామెడీ మరీ జబర్దస్త్ బాపతు కామెడీగా మారొద్దు… అది టీవీకి మాత్రమే పరిమితం… పెద్ద తెరకు, ఓ ఫీచర్ ఫిలిమ్ నిడివికి పనికిరాదు…
Ads
అసలు అలాంటి కామెడీని ఈటీవీలోనే ఎవడూ చూడటం లేదు… ఇక జేబు గుల్ల చేసుకుని థియేటర్ దాకా వెళ్లి పెద్ద తెర మీద చూస్తారా..? పైగా కామెడీ అనేది చాలా కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్టు… ఎక్కడ శృతితప్పినా బండి పట్టాలు తప్పుతుంది… మజాకా సినిమాలో జరిగింది అదే… కీలకపాత్రధారుల ఓవరాక్షన్, లాజిక్కులు తప్పిన కథనాలతో మజాకా పేలవంగా తయారైంది…
నిజానికి కథ లైన్ బాగుంది… ఒక తండ్రి… కొడుకు పుట్టగానే భార్య చనిపోతే, మళ్లీ పెళ్లి చేసుకోకుండా పెంచుతాడు… తీరా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటే ఆడదిక్కు లేని ఇల్లు అంటూ ఎవడూ పిల్లనివ్వడు… ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటో కావాలి… సో, తండ్రికీ పెళ్లి మీద మనసు మళ్లుతుంది…
తండ్రీకొడుకులు ఇద్దరికీ సపరేట్ లవ్ ట్రాకులు… కానీ కేవలం కామెడీ స్కిట్లను పేర్చినట్టు సీన్లు రాసుకుంటే కథలో ఎమోషన్ ఎలా పండుతుంది..? కేవలం కామెడీ ట్రాకులు చూడాలనుకుంటే ఈటీవీ విన్‌లో పాత జబర్దస్త్ స్కిట్లు చూస్తే పోలా..?
మోతాదు మించితే కామెడీ వికటిస్తుంది… తండ్రి పాత్ర చేసిన రావురమేష్ స్వతహాగా మంచి నటుడు… కానీ ఇందులో తనతో ఓవరాక్షన్ చేయించాడు దర్శకుడు ఎవరో గానీ… కొడుకుగా చేసిన సందీప్ కిషన్ ఫీల్డులో ఉండి పదిహేనేళ్లు అవుతున్నా ఇంకా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా పలకవు అదేమిటో…
దీనికితోడు హైపర్ ఆది మార్కు కామెడీ… కేవలం పంచులతో స్కిట్లు అనేది టీవీ కామెడీ షోల వరకూ వోకే, కానీ ఇక్కడ సరిపోదు, సరికాదు… పాటలూ సరిగ్గా లేక… కామెడీ సీన్లూ పండక… ఎమోషనల్ సీన్లూ పెద్దగా లేక… ప్రేక్షకుడు ఏ దశలోనూ సినిమాకు కనెక్ట్ కాడు…
ఫిమేల్ లీడ్స్ చేసిన అన్షు అంబానీ (పాత మన్మథుడు సినిమా ఫేమ్), రీతూ వర్మలు వోకే… వంక లేదు, కానీ కేరక్టరైజేషన్‌లోనే బలం లేదు… సో, వాళ్లూ చేయగలిగేది ఏమీ లేదు ఫాఫం… సో, సందీప్ కిషన్ సినిమాల సంఖ్యకు ప్లస్ వన్… అంతే…!
అవునూ, ఈ దర్శకుడే కదా, పేరు త్రినాథరావు నక్కిన… టీజర్ లాంచింగులో ‘‘అన్షు సైజుల’’ గురించి పిచ్చి కూతలు కూసింది… అదుగో, ఆ పిచ్చి కూతలే తప్ప కాస్త సినిమా నాణ్యత మీద దృష్టి పెట్టాలనే సోయి లేదు… పైగా ఈ సినిమాతో గేట్లు పగులుతాయి, సీట్లు చిరిగిపోతాయి అనీ ఏదేదో మాట్లాడినట్టు గుర్తు… నీ సినిమాకు అంత సీన్ లేదు ఫోఫోవోయ్..!!
Share this Article