Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వభాషాభిమానం… డీఎంకేకు మళ్లీ అందివచ్చిన హిందీ వివాదం…

February 27, 2025 by M S R

.

తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఉండవచ్చు. ప్రతిపాదిత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆ ఉద్యమానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు కలిపి ఉండవచ్చు.

హిందీ విషయం ఎలా ఉన్నా… పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగి… దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గి… ఉత్తరాదిలో గణనీయంగా పెరిగితే దక్షిణాదికి జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు. దీని మీద విస్తృత చర్చ జరగకపోతే, మేల్కొనకపోతే, సంఘటితంగా పోరాడకపోతే జరగబోయే నష్టం ఊహక్కూడా అందదు. ఈ రెండు విషయాలు ఇదివరకు చెప్పుకున్నవే అయినా మళ్ళీ దృష్టి పెట్టాల్సిన సందర్భంలో ఉన్నాం.

Ads

జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడుతూ మొదట లేఖల యుద్ధం మొదలుపెట్టారు. తరువాత నేరుగా రోడ్ల మీదికి వచ్చి పోస్టాఫీసులు, రేల్వే స్టేషన్లలో హిందీ అక్షరాలకు నల్లరంగు పూస్తున్నారు. హిందీ బోర్డులను తొలగిస్తున్నారు.

రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. త్రిభాషా సూత్రంలో హిందీ ఐచ్ఛికమే (అప్షన్) కానీ బలవంతం కాదు కదా! అన్నది కేంద్రప్రభుత్వ సమర్థన. మొదట ఐచ్ఛికమంటారు… తరువాత తప్పనిసరి చేస్తారు… మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తమిళనాడు తెగేసి చెబుతోంది.

మీకంత త్రిభాషా సూత్రం మీద గౌరవమే ఉంటే… ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా మొత్తం ఉత్తర భారతంలో ఎక్కడైనా తమిళమో, మలయాళమో కూడా ఐచ్ఛికంగా పెట్టండి అని సవాలు విసురుతున్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలన్నది జాతీయ విద్యావిధానంలో మరో కీలకమైన అంశం. ఆ చర్చ ఇక్కడ అనవసరం.

ఆరు దశాబ్దాల క్రితం తమిళనాడులో డిఎంకె ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. రాజకీయంగా మళ్ళీ అలాంటి ఆయుధమే దొరికినట్లు డిఎంకె అనుకుంటోంది. ఈ గొడవ ఎటెటో వెళుతోందని గ్రహించిన ప్రధాని మోడీ భాషల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని పరోక్షంగా తమిళనాడుకు సూచించారు.

అన్ని భాషలూ పరస్పర ఆదానప్రదానాలతో సుసంపన్నమైనవేనని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. హిందీ అప్షన్- కంపల్షన్ సన్నని గీత మధ్య ఇప్పుడు భాషా యుద్ధాలు జరుగుతున్నాయి. కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో నా భూమి- నా భూమి అంటూ ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం యజమాన్య హక్కుల ఆరని చిచ్చు కూడా భాషా యుద్ధంగా మారుతోంది.

దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న చర్చ, వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం.

హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి- అంతే. కాకపోతే దేశ జనాభాలో 43 శాతం మంది హిందీ మాట్లాడేవారున్నారు కాబట్టి… హిందీ జాతీయ భాష అని చాలా మంది పొరబడుతూ ఉంటారు. హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలు వరుసగా బెంగాలీ, మరాఠీ, తెలుగు.

ఒక దేశం – ఒకే చట్టం; ఒక దేశం- ఒకే ఎన్నిక అంటే ఏంటో అనుకున్నారు కానీ అందులో ఒక దేశం – ఒకే భాష కూడా అంతర్భాగంలా ఉంది.

హిందీమీద అమిత ప్రేమ ఉండక్కర్లేదు – అలాగని హిందీ మీద అమితద్వేషమూ అక్కర్లేదు . ఈరోజుల్లో మాతృభాష ఏదయినా ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవాలి . హిందీ తోడయితే మంచిది . భాషను బలవంతంగా రుద్దితే వాంతి అవుతుంది . ఇష్టపడి ఎవరికివారు నేర్చుకుంటే వాగ్భూషణమవుతుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions