Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నటరాజ్ థియేటర్… లవకుశ హిస్టరీ… ఆ పాత జ్ఞాపకం కూలిపోయింది…

February 28, 2025 by M S R

.

Murali Buddha ……. లవకుశులు తప్ప ఏదీ లేదు .. నటరాజ్‌.. తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోయే సినిమాల పేర్లు కొన్ని చెప్పమంటే అందులో లవకుశ ఉండి తీరుతుంది .

1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో ఒక సంచలనం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ సినిమాను చూసేందుకు వచ్చేవారు. సికింద్రాబాద్‌లోని నటరాజ్‌లో ఈ సినిమా విడుదలైంది.

Ads

నటరాజ్‌కు దగ్గరలో ఉన్న క్లాక్‌టవర్ పార్క్ వద్ద ఆ రోజుల్లో జాతరలా ఉండేది. టికెట్ దొరక్కపోతే అక్కడే వండుకొని తిని, తర్వాత షో చూసి వెళ్లేవారు. ఆ టాకీసు చరిత్రలోనే ఇదో సంచలనం. సికింద్రాబాద్‌లోని వీధులన్నీ ఇరుకిరుకుగా ఉంటాయి. నిజాం కాలంలో సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరుగా ఉండేది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రలో సికింద్రాబాద్‌ను పెద్ద బస్తీ అని పేర్కొన్నారు.

నాటి బ్రిటిష్ పాలకులు 1930 ప్రాంతంలో రోడ్ వెడల్పు చేద్దామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నుంచి పుట్టిందే విశాలమైన కింగ్స్ వే.. దీనికి కూడా అనేక మలుపులున్నాయి. ఆ కాలంలోనే కొందరు బ్రిటిష్ అధికారులకు 15 వేల లంచం ఇచ్చి తమ దుకాణాలు పోకుండా ప్రయత్నించారు. 1930 ప్రాంతం నాటి ఈ వ్యవహారాన్ని ఆ కాలం వాళ్లు చెబుతుంటారు.

కింగ్స్ వే నుంచి నేరుగా వెళ్తే.. వందేండ్ల కిందట స్వామి వివేకానందుడు ప్రసంగించిన మహబూబ్ కాలేజీ హైస్కూల్ కనిపిస్తుంది. విశాలమైన ఆ స్కూల్ ఆవరణలో ఒకవైపు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ.. ఆ కాలేజీ ఎదురుగానే నటరాజ్ టాకీస్.

ఆ కాలేజీ విద్యార్థిగా రోజూ నటరాజ్‌ను దర్శనం చేసుకున్న జ్ఞాపకాలు. నటరాజ్ టాకీస్‌కు బయటి నుంచి దారి ఉండే విధంగా ఇరానీ హోటల్. జేబులో డబ్బులుంటే అక్కడ టీ తాగుతూ, సినిమా పోస్టర్ చూస్తూ చర్చలు. ఆమ్మో, మీరు టీ తాగేందుకు హోటల్‌కు వెళ్తారా? మా ఇంట్లో వాళ్లు చూస్తే ఇంకేమన్నా ఉందా? అని ఆశ్చర్యపోయిన మిత్రుడు, చదువు ముగిశాక సకల కళా వల్లభుడు అయ్యాడని తెలిసి, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని పాడుకోవడం తప్ప ఏం చేయగలం..?

మహబూబ్ కాలేజీ అంత కాకపోయినా విశాలంగా ఉండే ఆ జూనియర్ కాలేజీ ఇప్పుడు బక్కచిక్కిపోయి ఓ మూలకు పరిమితమైంది. చైతన్య నారాయణల వ్యాధిన పడి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలవలెనే సికింద్రాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా చిక్కి శల్యమైంది. అప్పటి కాలేజీలో ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీ పుట్టింది. సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు దగ్గరలో ఉంటుంది నటరాజ్ టాకీస్.

ఔను, ఇప్పుడు అక్కడ టాకీస్ మాత్రమే ఉంటుంది. సినిమాల ప్రదర్శన మాత్రం జరుగదు. ఇప్పుడు అక్కడో ఫర్నీచర్ షాప్. సినిమా టాకీస్‌ను యథాతధంగా అలానే ఉంచారు. నటరాజ్ అనే టాకీస్ పేరు కూడా అలానే ఉంది. టాకీస్ లోపల ఉన్న ఫర్నీచర్, కుర్చీలు అన్నీ తొలగించి నటరాజ్‌లో ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేశారు.

80 ప్రాంతం నుంచి నటరాజ్‌లో అన్నీ హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. కానీ అంతకుముందు అద్భుతమైన తెలుగు సినిమాలెన్నో ఇందులో విడుదలయ్యాయి. దాదాపు ఐదేండ్ల కిందట నటరాజ్ సినిమా హాల్‌గా మూతపడి, ఫర్నీచర్ షాప్‌గా కొత్తరూపు సంతరించుకున్నది. తెలంగాణ, ఆంధ్ర, పట్టణాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ అనే తేడా లేకుండా లవకుశ సినిమా విడుదలైన ప్రతిచోట సంచలనమే.

సికింద్రాబాద్ నాలా బజార్ గవర్నమెంట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదివే రోజుల్లో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరికి వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలి. అలా తిరుమలగిరి వెళ్లి ఇంత దూరం నుంచి సికింద్రాబాద్‌కు రోజూ ఎలా వస్తాడో అని మిత్రుడిపై బోలెడు జాలిచూపాను.

ఇప్పుడు తిరుమలగిరి దాటి 4 కిలోమీటర్లు వెళ్తే మా ఇల్లు. తిరుమలగిరి, అల్వాల్, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి, కాప్రా, నెరేడ్‌మెట్ ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే, అమీర్‌పేట కూడా ఆ రోజుల్లో ఓ పల్లె, ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే. కొన్ని ప్రాంతాలు తొలుత గ్రామ పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీలు. 11 శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేశారు. అంతకుముందు అవన్నీ గ్రామాలు.

ఇలాంటి గ్రామాల నుంచి ఎడ్లబండ్లపై లవకుశ సినిమా చూసేందుకు నటరాజ్‌కు వచ్చేవారు. ఈ రోజుల్లో మాదిరిగా అప్పుడు ఒకే సినిమాను వందల టాకీసుల్లో విడుదల చేసేవారు కాదు. ఇంత పెద్ద మహానగరంలో లవకుశ విడుదలైంది నటరాజ్, బసంత్ రెండు టాకీసుల్లో మాత్రమే.

కొన్నిరోజుల తర్వాత సినిమా మరో టాకీస్‌లోకి మారేది. లవకుశ మాత్రం ఎన్నిరోజులు అయినా నటరాజ్ దాటకపోవడంతో ఇతర ప్రాంతాలవారు బండ్లు కట్టుకొని నటరాజ్‌కు వచ్చేవారు. ఇప్పటి క్లాక్‌టవర్ పార్క్ లో ఎడ్లబండ్లను నిలిపి అక్కడే వంటలు వండుకొని సినిమా చూసి వెళ్లారని ఆ కాలంవారు చెబుతుంటారు.

ప్రధానమైన టాకీసుల్లో సినిమా ఓ వారం నడిచాక ఖైరతాబాద్‌లోని రీగల్ టాకీస్, అమీర్‌పేటలోని విజయలక్ష్మి టాకీస్‌కు ఆ సినిమాలు వచ్చేవి. ఆ రోజుల్లో బేగంపేట రైల్వే స్టేషన్ ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో ముని ఆశ్రమంలా ఎంత ప్రశాంతంగా ఉందో చూడాలంటే పూల రంగడు సినిమా చూడొచ్చు. అందులో జమున కూరగాయలు అమ్ముకొంటున్నట్టు చిత్రీకరించింది అక్కడే. నాగేశ్వర్‌రావు గుర్రపు బండితో నిలుచునేది అక్కడే.

లవకుశ సినిమా విడుదలైన అన్ని టాకీసుల్లోనూ సంచలనమే. బసంత్, నటరాజ్, ఖమ్మంలో సుందర్, వరంగల్‌లో రాజేశ్వర్, నిజామాబాద్‌లో మోహన్ టాకీస్‌లలో ఈ సినిమా విడుదలైంది. లవకుశలో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, అంజలి, నాగయ్య, కాంతారావు, శోభన్‌బాబు, రేలంగి, రమణారెడ్డి, కన్నాంబ, గిరిజ, సూర్యకాంతం, యస్.వరలక్ష్మి… ఇప్పుడు వీళ్ళెవరూ లేరు.

దర్శకులు సి.పుల్లయ్య, సి.యస్.రావు, నిర్మాత శంకర్‌రెడ్డి, సంగీతం అందించిన ఘంటసాల… వీరెవరూ ఇప్పుడు లేరు. ఆ సినిమా ప్రదర్శించిన టాకీసులు లేవు… లవకుశ సినిమా ప్రకటన నాటి ప్రముఖ పత్రికలు గోల్కొండ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జనతాలో ప్రధానంగా ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ఆ పత్రికలూ లేవు… లవకుశులుగా నటించిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, నాగరాజులు అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో కనిపించేవారు.

భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ఎన్నో సినిమాలను నటరాజ్‌లో ప్రదర్శించారు. షోలే సినిమా చాలారోజులు నడిచింది. అమర్ అక్బర్ అంథోని, ఖూన్ పసీనా, కభీ కభీ, మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలు ప్రదర్శించారు. నిన్నేపెళ్లాడతా నటరాజ్‌లో చెప్పుకోదగిన చివరి సినిమా వందరోజుల ప్రదర్శన.

ఫిరోజ్‌ఖాన్ నటించిన చార్ ధర్ వేశ్, దేవానంద్, మధుబాల నటించిన షరాబీ, అశోక్ కుమార్ నటించిన విక్టోరియా నెంబర్ 203, దాదిమా, యాదోంకి బారాత్ వంటి సూపర్‌హిట్ సినిమాలు ప్రదర్శించారు.

అక్కడి వారిని పలుకరిస్తే ఇక్కడ టాకీసు ఉండగా మేం చూడలేదన్నారు. ఇప్పుడు అక్కడ పేరు నటరాజ్ అని ఉంది. కానీ అక్కడ సినిమా జ్ఞాపకాలేమి లేవు. పలకరిస్తే నటరాజ్‌లో అమ్ముతున్న ఫర్నీచర్ గురించి చెప్పేవారే కానీ, నటరాజ్ లో ప్రదర్శించిన సినిమాలు, టాకీసు జ్ఞాపకాలను చెప్పేవారు అక్కడ కనిపించలేదు…

(జ్ఞాపకాలు… నమస్తే తెలంగాణ… 4. 2. 2018)… సికింద్రాబాద్‌లోని నటరాజ్ టాకీస్ భవనాన్ని ఈ రోజు కూల్చారని వార్త చూసి …. నటరాజ్ గురించి గతంలో రాసిన వ్యాసం ఇది…..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions