టెనెట్ సినిమా చివర్లో భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో ప్యాటిసన్… గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన హీరో వాషింగ్టన్ తో ఒక మాట అంటాడు… నీ గతానికి గొప్ప భవిష్యత్తు ఉంది.. అంటే నాకు కొన్నేళ్లు క్రితం నీకు కొన్నేళ్ల తర్వాత అన్నమాట అని భవిష్యత్తులోకి వెళ్లిపోతే వాషింగ్టన్ గతంలోకి వెళ్లిపోతాడు.. వర్తమానం అలాగే ఉండిపోతుంది………. నేను రాసిన ఈ నాలుగు లైన్లలో మీకు ఒక్కటైనా అర్థమయితే సినిమా మొత్తం మీకు అర్థమైనట్టే.. ఒక్కొక్కరి పర్సెప్షన్ లో సినిమా ఒక్కోలా అర్థమవుతుంది… మీకు అర్థంకానిది నేను అర్థమయ్యేలా చెప్పలేను కాను నాకు అర్థమైంది మీకు కాస్తైనా అర్థమయ్యేలా చెబుతాను.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో దేన్ని మనం డిసైడ్ చేయలేం.. గతం గతం అంటారు.. జరిగిపోయిన కాలాన్ని మనం తీసుకురాలేము.. భవిష్యత్తు ఏంటో మనకు తెలీదు.. వర్తమానం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.. టెనెట్ సినిమాలో భవిష్యత్తు నుంచి వచ్చినవాళ్లు ఒక ఐదు వందల ఏళ్లు వెనక్కి వచ్చి, అలాగే గతంలో వాళ్లు ఒక ఐదొందల ఏళ్లు ముందుకు వెళ్లి వీరిద్దరూ కలిసి వర్తమానంలో జరిగే ఒక ప్రపంచనాశనాన్ని ఆపుతారన్నమాట…
అంటే ఉదాహరణకు గతేడాది కరోనా చైనాలో వ్యూహాన్ లో పుట్టిందని మనందరికీ తెలుసు కదా.. అక్కడ పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తోంది.. వర్తమానంలో ఉన్న మనం సరిగ్గా ఏడాది క్రితం అంటే 2020లో కివెళ్లి వ్యూహాన్ లో కరోనా వైరస్ లీకైన ల్యాబ్ లో అడుగుబెట్టి లీక్ కాకుండా ఆపితే లేదా అంతకుముందు ఏడాది అంటే 2019లో వాళ్లు ఒక ఏడాది ముందుకు 2020లోకి వచ్చి ల్యాబ్ లో లీక్ అయ్యే అంశాన్ని ముందుగానే ఆపేస్తే ఈ ప్రళయం ఉండేదికాదు కదా.. ఇది నేను సింపుల్ గా చెప్పే అంశం.. ఇదంతా ఊహాతీతమే..జరిగేది కాదు .. ఆ సంగతి నాకు తెలుసు..
Ads
ఇప్పుడు మనం రోడ్డుమీద వెళ్తుప్పుడు ఒక కారు వేగంగా వచ్చి బైక్ మీద వెళ్తున్న వారిని గుద్దేస్తే బైక్ పై ఉన్నవాళ్లు చనిపోయారనుకుందాము.. అప్పుడు మనం ఒక నిమిషం కాలాన్ని వెనక్కు జరిపి వేగంగా వస్తున్న కారును ఆపితే… లేదా … కారు దూసుకొస్తున్న విషయం బైక్ వ్యక్తికి చెప్పి పక్కకు పంపిస్తే ఆ యాక్సిడెంట్ జరగదన్నమాట.. లేదా గతంలోకి అంటే యాక్సిడెంట్ జరగడానికి గంట ముందు ఉన్న మనం … ముందుగానే యాక్సిడెంట్ జరుగబోతుందన్న విషయం తెలుసుకుని కాలాన్ని గంట ముందుకు జరిపి ఆ యాక్సిడెంట్ జరిగే రోడ్డులోకి ఆ కారుని వెళ్లొద్దని , ఆ బైక్ ను కూడా అటుగా వెళ్లకుండా ఆపడం అన్నమాట..
టెనెట్ ను మొదట చూసినప్పుడు ఏమీ అర్థం కాలేదు.. రెండోసారి చూసినప్పుడు కొద్దిగా అర్థమైంది.. మూడోసారి చూసినప్పుడు ఇంకాస్త అర్థమైంది.. అందులోనూ తెలుగు మీడియంలో.. డిస్టెన్స్ లో డిగ్రీలు, పీజీలు చదివిన నాలాంటోడి బుర్రకు నిజానికి అర్థం చేసుకోవడం చాలా కష్టం.. డైరెక్టర్ Christopher Nolan లా … మనం ఆలోచించడం తర్వాత సంగతి కానీ అతని ఆలోచనతో రూపుదిద్దుకున్న సినిమాను అర్థం చేసుకుంటే నిజంగా అద్భుతమన్నట్టే..
ఫిజిక్స్ మీదా పట్టున్నోళ్లకి ఈ సినిమా బాగా అర్ధమవుతుంది.. నా మాదిరి బీకాంలో ఫిజిక్స్ చదివిన మెదడుకి పెద్దగా అర్ధం కాదు.. మామూలుగా అయితే ఎపుడో పదో తరగతిలో ఐదు మార్కుల ప్రశ్నల కోసం సైన్స్ మాస్టారు చెప్పిన పాఠాలు మాత్రమే మనకి గుర్తుంటాయి.. భౌతిక శాస్త్రము లేదా రసాయన శాస్త్రము అని పుస్తకాల అట్టలమీద ఉండేవి కదా .. అందులో గురుత్వాకర్షణ శక్తి గుర్తుందా .. న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నపుడు పైనుంచి పండు పడినపుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆయన కనిపెట్టాడు.. ఆయన ఆరోజు ఆ చెట్టు కింద కూర్చోకుండా ఉండి ఉంటే పరిస్తితి వేరుగా ఉండేది. అలాగే అయస్కాంత సిద్దాంతం గుర్తుందా ?? సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి . విజాతి ధ్రువాలు ఆకర్షింటుకుంటాయి అని సైన్స్ పాఠాల్లో ఉండేది కదా. అంటే రెండు మాగ్నెట్లని ఒక కోణంలోంచి దగ్గరకు తెస్తే అవి ఆకర్షిస్తాయి. అదే రెండు మాగ్నెట్లని ఆపోజిట్ డైరెక్షన్ లో తెస్తే అతుక్కోవు .. పైకి దూరం నెట్టేస్తూ ఉంటాయి.. మనం నివశించే భూమి ఒక పెద్ద అయస్కాంతం లాంటిది కదా . అందుకే ఎంత పెద్ద వస్తువైనా పైనుంచి పడేస్తే కింద తేలికగా పడిపోతుంది.. కానీ అదే వస్తువుని గాల్లోకి పంపగలామా .. అలా చేయలేము .. ఆఖరికి బంతిని కూడా గాల్లోకి బలవంతంగా విసిరితే అది మన విసిరిన బలం స్థాయిలో గాలిని బలవంతంగా చీల్చుకుని పైకి వెళ్లి వెంటనే మళ్లీ కిందికి వస్తుంది.. మరి అంతరిక్షంలో అలా కాదు కదా .. అక్కడ వస్తువులు కింద పడవ్ .. అలా తేలుతూ ఉంటాయి .. అందుకే రాకెట్ ని భూమీద నుంచి అంతరిక్షంలోకి పంపడానికి ఎంత పెద్ద పీడనాన్ని ఉపయోగిస్తారో తెలుసు కదా..
టెనెట్ లో…. గన్ లోంచి బుల్లెట్ రివర్స్ లో వెళ్తుంది .. మామూలుగా అయితే ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్ ప్రెషర్ తో ముందుకు దూసుకెళ్తుంది కదా .. కానీ ఇక్కడ అలా కాదు ఆల్రేడీ దూసుకెళ్లిన బుల్లెట్ వెనక్కి అంటే గన్ లోకి వస్తుంది .. అంటే అన్నీ రివర్స్ లో జరుగుతుంటాయి .. దీనే
EnTropy అంటారట .. వాషింగ్టన్ గన్ పెల్చినప్పుడే బుల్లెట్ మళ్ళీ గన్ లోకి వస్తుంది. అంతే గానీ గన్ ఖాళీగా పెట్టినప్పుడు రాదు. ఈ సీన్లు సినిమాలో మనకి చాలా కొత్తగా అద్భుతంగా ఉంటాయి .. కొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో ఒక సీన్ ని మళ్లీ చూపించడానికి ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా చూపిస్తారు .. ఉదాహరణకి కారు పార్కింగ్ లోంచి గేటు బయటికి తెచ్చి రోడ్డు చివరికి వెళ్లాక అదే కారుని మళ్లీ పార్కింగ్ దగ్గర నుంచి చూపాలంటే సందు చివరి నించి కారు వెనక్కి వస్తూ గేటులోంచి వెనక్కి వెళ్లి మళ్లీ పార్కింగ్ లో ఉన్నట్టు చూపడం .. టెనెట్ లో Time inverse చూపిస్తారు .. టైమ్ ఇన్వర్స్ జరిగే సమయంలో అందరూ వెనక్కు నడుస్తూ ఉంటారు. భవిష్యత్ నుంచి వర్తమానంలోకి వచ్చినవాళ్లు రోడ్డు మీద నడుచుకుటూ వెళ్తుంటే అక్కడ అన్నీ రివర్స్ లో జరుగుతుంటాయి .. ఈ సీన్లు చాఅ అద్భుతంగా ఉంటాయి .. కొన్న్ని సీన్లు ఎలా తీశాడో కూడా అర్ధం కాదు .
Turnstile అనే టైమ్ ఛాంబర్ టెనెట్ కి ముఖ్యమైన ఆధారం .. ఛాంబర్ లోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేసరికి “గతం లేదా భవిష్యత్తు” లోకి వెళ్ళిపోతారు తప్ప ప్రస్తుతం లో ఉండరు. ఆదిత్య 369 సినిమాలో సైంటిస్ట్ కనిపెట్టిన మిషన్ ఎక్కి బటన్ నొక్కగానే ఫ్యూచర్ లోకి లేదా గతంలోకి వెళ్లిపోతారు కదా అలాంటిది .. ఈ భూప్రపంచం మొత్తాన్ని నాశనం చేసిన ఒక పెద్ద పేలుడిని ఆపడానికి అటు ఐదు వందల ఏళ్ల తర్వాతివాళ్లు , ఐదు వందల ఏళ్ల క్రితం వాళు వర్తమానంలోకి వచ్చి ఆపడమే టెనెట్ .. భవిష్యత్ వాళ్లకి భూమ్మీద అప్పట్లో ఏమి జరిగిందో తెలుసు .. కానీ గతం నుంచి వచ్చినోళ్లకి తెలీదు .. రెండు బ్యాచ్ లు కలిసి విస్ఫోటనానికి కారణమైన ప్లూటోనియం బాల్స్ ని కంట్రోల్ చేస్తారు .. ఇక్కడే పిన్సర్ మూమెంట్ ని చూపిస్తాడు డైరెక్టర్ .. అంటే రెండు కాలాలవాళ్లు ఎటాక్ చేయడం .. ఒక మొమెంట్ ఫార్వార్డ్ లో ఇంకో మూమెంట్ రివర్స్ లోలా జరుగుతూనే ఉంటాయి
ఈ జానర్ లో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు.. కానీ ఇలా మాత్రం ఉండి ఉండదు.. ప్రేక్షకులను కదలనివ్వకుండా వెన్నుపూస వంగకుండా, కనురెప్పలు వాల్చకుండా, మెదడు నరాలన్నింటినీ పని చేయించే సినిమా ఇది.. అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత అన్నమాట.. ఎవరి పర్ స్పెప్షన్ వారిది. ఒకరికి ఒకలా అర్థమైతే ఇంకొకరికి ఇంకోలా అర్థమవుతుంది.. ఈ సినిమా విషయంలో ఏ ఇద్దరి ఆలోచనలు ఒకలా కచ్చితంగా ఉండవు.. సినిమా ఇంటర్వెల్ నాటికి సినిమా ఎండ్ అయిపోయిట్టే ఉంటుంది.. కానీ అక్కడి నుంచి మళ్లీ సినిమా రివర్స్ అయినట్టు ఉంటుంది. ఒక్కో సీన్ సినిమాలో నాలుగుసార్లు రిపీట్ అవుతుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టదు.. అలా రిపీట్ అయిన ప్రతిసారి ఆ సీన్ కు అర్థముంటుంది.. సినిమా మొదట్లో చూసే సీన్ కు సినిమా చివర్లో సీన్ కు లింక్ ఉంటుంది..
గతంలో అప్పుడెప్పుడో బెర్ముడా ట్రయాంగిల్ సినిమా చూశాను.. అందులో గతం వర్తమానం, భవిష్యత్తు మూడు ఒకేసారి రిపీట్ అవుతుంటాయి.. కానీ ఆ సినిమా అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం తీసుకోలేదు.. కానీ టెనెట్ అలా కాదు.. బెర్ముడా ట్రయాంగిల్ లో సింపుల్ గా కొన్ని ఫ్యామిలీలు కలిసి బోటులో అలా సముద్రంలో షికారుకు వెళ్లి బోటు మునిగిపోయి అందులో ఉన్నోళ్లంతా కొట్టుకుపోతుంటే పెద్ద షిప్ వస్తే అందులోకి ఎక్కడం ఆ తర్వాత కిందకు చూస్తే నీళ్లలో తామే కొట్టుకుపోతూ కనిపించడం, షిప్ లో ఉన్న తమలాంటి వారే తమను హత్య చేస్తుండడం, అంటే బోటు మునగడం, నీళ్లల్లో కొట్టుకుపోవడం, షిప్ లోకి మారడం, అందులో హత్యలు జరగడం ఇలా సినిమా అంతా నాలుగుసార్లు రిపీట్ అవుతుంది…
అలాగే మన తెలుగులో వచ్చిన ఆదిత్య 369లో బాలకృష్ణ భవిష్యత్తులోకి, గతంలోకి వెళ్తాడు.. గతంలోకి వెళ్లి శ్రీకృష్ణదేవరాయలుతో మాట్లాడడం లాంటి అంశాలు విచిత్రంగా విడ్డూరంగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాగే 24 అనే సినిమాలో టైమ్ మిషన్ సాయంతో కాలాన్ని ఆపడం, కాలాన్ని ముందుకు వెనక్కు జరపడం లాంటి అంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. వీటన్నింటికంటే అడ్వాన్స్డ్ గా టెనెట్ ఉంటుంది.. ఇంత చెప్పాక కూడా మీకు ఏమీ అర్థం కాలేదన్న సంగతి నాకు అర్థమైంది.. అందుకే వీలుంటే మీ ఆవిడతో బాగా గొడవైనప్పుడు, ఆఫీస్ లో బాస్ తిట్టినపుడు, మీరు ప్రేమించిన అమ్మాయి ఇంకెవర్నో పెళ్లి చేసుకుని వెళ్లిపోయినపుడు, మీరు ఎంతగానే ఇష్టపడే ఐఫోన్ కింద పడి పగిలిపోయినప్పుడు … ఆ మూడ్ లో ఓపికగా ఈ సినిమాచూడండి.. అలాగే రివ్యూ చదివి నన్ను బూతులు తిట్టుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్న నేను వర్తమానంలోకి వెళ్లి రివ్యూను నేను రాయకుండా నాకు నేను ఆపేయగలను.. లేదా గతంలో ఉన్ననేను మీరు తిడతారని తెలిసి ముందుకు వచ్చి రివ్యూను రాయకుండా వర్తమానంలో ఆపగలను… … By………. అశోక్ వేములపల్లి
Share this Article