.
ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త…
తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం…
Ads
మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది…
పదవీ విరమణ చేసి ఏడు నెలలు గడుస్తున్నా గానీ తనకు రావల్సిన కమ్యూటేశన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఎర్నెడ్ లీవ్ ఎంక్యాష్మెంట్, సరెండర్ లీవ్ ఎంక్యాష్మెంట్ డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విశ్రాంత హెడ్ మాస్టర్ చోల్లేటి రాజ సుకన్య హైకోర్టును ఆశ్రయించారు…
మండల విద్యాధికారి లేఖ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సదరు విశ్రాంత హెడ్ మాస్టరుకు రావల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను ఖరారు చేసి ఏడు నెలలు కావస్తున్నా బకాయిలు ఇంతవరకూ చెల్లించలేదని ఆమె తరపున న్యాయవాది సీఆర్ సుకుమార్ హైకోర్టుకు నివేదించారు…
ఇందుకు స్పందిస్తూ న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్ రావు గురువారం నాటి విచారణలో విశ్రాంత హెడ్ మాస్టరుకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఎనిమిది వారాల్లోగా చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు…
ఇలాగే హైకోర్టును గురువారం ఆశ్రయించిన మరో ముప్పైమంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బకాయిలను చెల్లించాలంటూ న్యాయమూర్తి రాజేశ్వర్ రావు ప్రభుత్వాన్ని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన పదకొండు నెలలలో సుమారు ఓ పది వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయగా అందులో దాదాపు సగం మంది ఉపాధ్యాయులే ఉంటారని అంచనా. పదవీ విరమణ చేసి ఓ యేడాది కావస్తున్నా ఒక్కరికి కూడా రావల్సిన లక్షలాది రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు…
వందల సంఖ్యలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి బకాయిల చెల్లిపులకై ఉత్తర్వులు పొందారనీ, ప్రతీరోజూ డజన్ల కొద్దీ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలపై చెల్లింపు ఉత్తర్వుల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారని హైకోర్టు న్యాయవాది సీఆర్ సుకుమార్ తెలిపారు…
సో, ఇదండీ వార్త… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దురవస్థకు అద్దం పడుతున్నది… కోట్ల రూపాయల్ని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల్ని చెల్లించలేక… ఒక దశలో ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచాలని యోచిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి…
గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది కూడా… ఇది నిరుద్యోగులను మోసం చేయడమే… మానిటరీ బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితిలోకి ఏ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినా అవి స్టేట్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టే లెక్క…
ప్చ్, ఒక ధనిక రాష్ట్రాన్ని, ఒక రెవిన్యూ మిగులు రాష్ట్రాన్ని చివరకు ఏ స్థితికి తీసుకొచ్చాయో కదా అసమర్థ రాజకీయాలు..!? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి…!! కొంపదీసి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏ 65 ఏళ్లకో రిటైర్మెంట్ వయస్సును పెంచేయదు కదా..!!
Share this Article