.
……. (రమణ కొంటికర్ల)….. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. కానీ, అలాంటి ప్రతిభను గుర్తించి.. ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలంటే.. అలాంటి ప్రతిభావంతుల నుంచే అవుతుంది. అదే పని చేశాడు మన చంద్రశేఖర్ వెంకట్రామన్. అలా ఓపెన్ హైమర్ బాప్ నే మన ఇండియాకు సైంటిస్ట్ గా పట్టుకొచ్చాడు. ఎలా..? ఓ ఇంట్రస్టింగ్ కథ!
అది 60 లక్షల మంది యూదులను విషవాయు గదుల్లో బంధించి చంపిన హిట్లర్ నియంతృత్వానికి ప్రతీకగా నిల్చిన కాలం. ఆ సమయంలో హిట్లర్ కొందరు యూదు సైంటిస్టులను కూడా తన్ని తరిమేశాడు. అదిగో అప్పుడు మన సీవీ రామన్ కొందరు ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు గాలం వేశాడు. వారి సేవలను వినియోగించుకుంటే మన భారతావనికి మరింత ప్రయోజనమని గుర్తించాడు.
Ads
అప్పుడు సీవీ రామన్ బెంగళూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయం… ఆ సమయంలో 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలుగా పేరుగాంచిన ఓపెన్ హైమర్, ఎన్రికో ఫెర్మీ, వెర్నెర్ హైసెన్ బర్గ్ తో పాటు… మరెందరో శాస్త్రవేత్తలకు ఓ మార్గదర్శిగా నిల్చిన మ్యాక్స్ బోర్న్ నే ఏకంగా మన బెంగళూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు పట్టుకొచ్చాడు సీవీ రామన్. మ్యాక్స్ బోర్న్ గొట్టెంగెన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా.. ది గ్రేట్ సైంటిస్ట్ గా అప్పటికే ఒక దిగ్గజం.
ఈ ఘటన 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీకి ఛాన్స్ లర్ అయినప్పుడు జరిగింది. అప్పటికే యూదులంటేనే మండిపడుతున్న నాటి హిట్లర్ పాలనలో.. బోర్న్ ఏకంగా తన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయబడ్డాడు.
అప్పటికే సీవీ రామన్ తన రామన్ ఎఫెక్ట్ కు గాను నోబెల్ బహుమతినందుకుని ప్రపంచవ్యాప్త చర్చగా మారిన రోజులు. అలా బోర్న్ ఉద్యోగం కోల్పోయిన వెంటనే సీవీ రామన్ నుంచి బోర్న్ కు ఓ లేఖ అందింది. ఆ లేఖ సారాంశమేంటంటే… ఎవరైనా ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను బెంగళూర్ ఐఐఎస్సీలో పనిచేయడానికి బోర్న్ ఏమైనా సిఫార్స్ చేస్తారా అని. అయితే, బెంగళూర్ ఐఐఎస్సీ గురించి పూర్తి వివరాలు తెలియకుండా.. తాను ఆ పని చేయలేనని బోర్న్ ఆ లేఖకు సమాధానమిచ్చారు.
దాంతో రామన్ మరింత వివరిస్తూ.. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో తమరే రావచ్చుగా అంటూ ఆహ్వానం పంపాడు. ఐఐఎస్సీలో థియరిటికల్ ఫిజిక్స్ లో రీడర్ గా ఆరు నెలల పాటు పదవిని ఆఫర్ చేశాడు. రామన్ ఆహ్వానాన్ని మన్నించిన బోర్న్ అందుకు ఒప్పుకున్నాడు. అప్పటికే బోర్న్ కేంబ్రిడ్డ్ అపాయింట్ మెంట్ కూడా ముగుస్తున్న సమయంలో.. తన భార్య హెడీతో చర్చించి.. భారత్ బాట పట్టాడు.
అలా బెంగుళూరుకు వచ్చిన బోర్న్, హెడీలకు.. రామన్, ఆయన భార్య లోకసుందరి అమ్మాళ్ సాదర స్వాగతం పలికారు. యూదు శాస్త్రవేత్తైన బోర్న్ దంపతులు ఐఐఎస్సీ క్యాంపస్‌లోని బంగ్లాలో స్థిరపడ్డారు. అయితే, సాధారణంగా తలపాగాతో కాస్త మిగిలిన సైంటిస్టులకు భిన్నంగా సంప్రదాయ పద్ధతిలో కనిపించిన సీవీ రామన్ వస్త్రధోరణి చూసి ముచ్చటపడింది బోర్న్ జంట. ఆ క్రమంలో అరేబియన్ నైట్స్ లో రాకుమారుడిలా ఉన్నారంటూ బోర్న్ సతీమణి హెడీ రామన్ కు సరదాగా కితాబిచ్చారట.
బోర్న్, హెడీ దంపతులు భారతీయ సంస్కృతికి ఆకర్షితులయ్యారు. టెన్నిస్ ఆడటం, భారత్ లోని వివిధ ప్రదేశాలు పర్యటించడం, స్థానికులతో మంచి సామాజిక సంబంధాలు నెరపడం, ఆయా ప్రాంతాల సంస్కృతిని అర్థం చేసుకోవడం వంటివి చేసేవారు.
బెంగళూర్ ఐఐఎస్సీలో రామన్ స్థాపించిన ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ కు బోర్న్ తో ఎలాంటి సేవలు తీసుకోవచ్చో.. రామన్ ముందే ఊహించాడు. అనుకున్నట్టే… ఐఐఎస్సీ లో బోర్న్ లెక్చర్స్.. అక్కడి భౌతికశాస్త్ర విభాగానికి ఒక వన్నె తెచ్చాయి.
బోర్న్ రాకతో… ఐఐఎస్సీ రీసెర్చ్ విభాగం పటిష్ఠంగా తయారైంది. సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు కేరాఫ్ లా మారింది. 1935-36 ఐఐఎస్సీ వార్షిక నివేదికలో… బోర్న్ కు సంబంధించిన ఉపన్యాసాలను ప్రశంసిస్తూ ప్రచురించిన జర్నల్స్ ఆయన సేవలకు గుర్తింపుగా నిల్చాయి. సైద్ధాంతిక భౌతికశాస్త్ర విభాగంలో తాను పరిశోధనలకు మార్గనిర్దేశం చేస్తూనే… తానూ కొత్త కొత్త ప్రయోగాలతో పరిశోధనలను ఎలా కొనసాగించాడో ఆ జర్నల్స్ లో పేర్కొన్నారు బోర్న్.
అయితే, బోర్న్ ఇండియాకు పర్యటనలో కేవలం ఆయన అద్భుతమైన సేవలనందించడం, పరిశోధనల్లో మేటిగా ఐఐఎస్సీని నిలబెట్టడమే కాకుండా.. ఇక్కడి సవాళ్లూ ఆయన్ను ఆలోచింపజేశాయి. పేదరికం, బ్రిటీష్ పాలనలో భారతీయులు, బ్రిటీషర్స్ మధ్య విభజన, వైరుధ్య భావజాలం, మరోవైపు సంస్థానాధీశుల ఐశ్వర్యం, కుల వ్యవస్థ వంటివెన్నో ఆయన్ను ఇక్కడున్నంత కాలం ఒకింత మానసిక సంఘర్షణకూ గురిచేశాయి.
ఐరోపాలో అప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో… మ్యాక్స్ బోర్న్ ను భారతదేశానికి తీసుకురావడంలో సీవీ రామన్ చూపిన చొరవ, ఆయన ముందుచూపు మాత్రం.. భారతదేశ శాస్త్ర, విజ్ఞానంపై అమితమైన ప్రభావం చూపెట్టింది.
ఓ రెఫ్యూజీగా.. ఐరోపాలో ఉండలేని బోర్న్ కు ఇండియాలో ఆశ్రయం కల్పించడమనే సహకారంతో పాటు… మరోవైపు భారతదేశంలో సైద్ధాంతిక భౌతికశాస్త్ర అభివృద్ధికి పునాది వేశాడు. ఆ తర్వాత తరాతరాల శాస్త్రవేత్తలకూ బోర్న్ స్పూర్తిని పంచి ఓ ప్రేరణయ్యాడు దూరదృష్టి గల మన సీవీ రామన్…
Share this Article