బొచ్చు… ఆ పదమే నెగెటివ్‌గా ధ్వనిస్తుంది కదా… కానీ అదిప్పుడు వందల కోట్ల దందాకు… కాదు, వందల కోట్ల స్మగ్లింగ్ దందాకు ఆధారం… ఎహె, తెలివిలేనివాడు బంగారం గట్రా స్మగుల్ చేస్తాడు, తెలివైనవాడే ఇలా బొచ్చును దువ్వుతూ కోట్లు కొల్లగొడతాడు… ఈమధ్య అక్కడెక్కడో మయన్మార్ సరిహద్దుల్లో ఓ ట్రక్కు పట్టుకున్నారు… అందులో మొత్తం బొచ్చే ఉంది… ఇంకేముంది..? ప్రపంచంలో ఎక్కడ ఏం దొరికినా, ఏం జరిగినా సరే తెలుగు రాజకీయాలకు ముడిపెట్టాల్సిందే కదా… అదంతా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకున్న కేశసంపద, ఇదుగో ఇలా స్మగుల్ అయిపోతోందని రచ్చ స్టార్ట్ చేశారు… చంద్రబాబు సహా తెలుగుదేశం క్యాంపంతా ఒకటే పోకడ కదా, ఏదో ఒకటి వాగేయడం… సేమ్, జగన్ చివరకు వెంట్రుకల్ని కూడా వదలడం లేదంటూ ఆరోపణలు మొదలెట్టేశారు… తిరుమల, భక్తులు, శ్రీవారు అనగానే బీజేపీ క్యాంపుకు కూడా ఏదిపడితే అది విమర్శ చేయడం అలవాటైంది… వాళ్లూ స్టార్ట్ చేశారు… ఇప్పుడు తెలుగు బీజేపీ, కాషాయ తెలుగుదేశం అన్నట్టుగా కలగలిసిపోయారు కదా…
ఒరే బాబూ, అది ప్రాసెస్డ్ బొచ్చు కాదు, తిరుమల నుంచి ప్రాసెస్ చేయకుండా ఆ సరుకును అసలు అమ్మబోము… ఆ జుట్టు, ఆ వెంట్రుకలు, ఆ బొచ్చు మన భక్తులది కాదు, అదెక్కడిదో మాకు తెలియదు, ఒకటికి పదిసార్లు చెక్ చేసి మరీ చెబుతున్నాం అని టీటీడీ లబోదిబోమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… అవునూ, దేశ సరిహద్దుల ద్వారా బొచ్చు స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి..? అంత రిస్క్ దేనికి..? మరీ ఆ స్థాయి లాభదాయకత ఉందా..? ఇంతకీ మన మణిపూర్ సరిహద్దుల నుంచి బొచ్చు ఎక్కడికి వెళ్తోంది..? ఆ వివరాల్లోకి వెళ్దాం… ఆ దందాకు హైదరాబాదే కేంద్రంగా మారిందట మరి…!!
Ads
కాస్త పొడవు పెరిగిన కేశాలకు అంతర్జాతీయ మార్కెట్లో మస్తు కమర్షియల్ విలువ ఉంది… అన్ని ఆలయాల్లోనూ భక్తులు గుండ్లు గొరగడం మనకు సహజమే కదా, అక్కడ సమకూరిన కేశాలను వేలం వేస్తారు… సెలూన్ల నుంచి వచ్చేది కొంత… ఈ సరుకును ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తుంటారు… అయితే భక్తిగా గుండు గొరిగించుకోవడం అనే పద్ధతి మన దక్షిణాదిలోనే ఎక్కువ… అందుకే హైదరాబాద్ ఈ వ్యాపారానికి కేంద్రంగా మారిందట… ఎవరోకాదు, ఈ వెంట్రుక వ్యాపారులకు ఓ సంఘం ఉంది… Human Hair and Hair Products Manufacturers and Exporters Association of India… వాళ్లు రెవిన్యూ ఇంటలిజెన్స్ విభాగానికి ఓ లేఖ రాశారు… ‘‘అయ్యా.., చైనా, కొరియాలకు ఈ ముడి కేశాలను బర్మా ద్వారా స్మగుల్ చేస్తున్నారు… చైనా దేశస్తులే ఎక్కువగా ఈ పనికి పాల్పడుతున్నారు… చైనా వాడు 28 శాతం దిగుమతి పన్ను వేస్తున్నాడు కదా, అందుకని అనధికారికంగా ఇలా భూమార్గాల్లో మణిపూర్, బర్మా సరిహద్దుల గుండా తరలిస్తున్నారు… దీన్ని అరికట్టండి మహాప్రభో’’ అనేది వారి విన్నపం…
నిజానికి కలకత్తా కస్టమ్స్ వాళ్లు కూడా హైదరాబాద్, సౌత్ జోన్ అధికారులను ఈ విషయంపైనే అలర్ట్ చేశారు… స్మగ్లింగే కాదు, జుత్తు విలువను కూడా (Raw Hair- గోలీ, తుత్తు, చోటి అని కూడా పిలుస్తారుట) విపరీతంగా తగ్గించి బిల్లుల్లో రాస్తున్నారు… టాక్స్ ఎగవేత కోసం… గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నడుమ 33 కోట్ల జుత్తు ఎగుమతి అయినట్టు రికార్డుల్లోకి ఎక్కిందట… కానీ కనీసం 25 రెట్లు అధికంగా ఉంటుంది ఈ విలువ, స్మగుల్ అయ్యే జుత్తు విలువ అదనం అంటున్నాయిట అధికారవర్గాలు… సో, బొచ్చే కదా అని చీదరగా చూడకండి… ‘ఎవడేం పీకుతాడు’ వంటి డైలాగులు కొట్టకండి… కోట్లు బాబూ, కోట్లు…!!
Share this Article