.
అత్యంత సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికలు, సుదీర్ఘ లెక్కింపులు… నిన్నటి ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వోట్ల లెక్కింపు సేమ్ సేమ్ అనిపించింది… విజేతను తేల్చడానికి పాటించే పద్ధతి చూస్తే మన ఎన్నికల సంఘం తీరు మీద మనకే జాలేస్తుంది…
అసలు మండలి అనేదే వృథా అనే చర్చ చాన్నాళ్లుగా దేశంలో సాగుతూనే ఉంది… అనేక రాష్ట్రాల్లో శానస మండళ్లు లేవు… సరే, ఏదో రాజకీయ పునరావాసం కోసం వైఎస్ మళ్లీ తీసుకొచ్చిన మండలిని తరువాత ప్రభుత్వాలూ కొనసాగిస్తున్నాయి, వాళ్ల పొలిటికల్ అడ్జస్ట్‌మెంట్ల కోసం అనుకుందాం… కానీ అదేమైనా ఏకతీరు ఎన్నికా..? కాదు…
Ads
గవర్నర్ కోటా, స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటా, పట్టభద్రుల కోటా, టీచర్ల కోటా… అందరూ వెళ్లేది ఒకే సభకు… మరి ఇన్ని మార్గాల ఎన్నిక దేనికి..? ఒకప్పుడు పట్టభద్రులు, టీచర్లు సమాజాన్ని ప్రభావితం చేయగల వృత్తి, చదువు కేటగిరీలు కావచ్చు, కానీ ఇప్పుడు..? ఈ డిబేట్ ఇక ఒడవదు గానీ… ఈ ఎన్నిక తీరు చూద్దాం…
2.52 లక్షల వోట్లు పోలయ్యాయి… (మామూలు ఎన్నికలాగే ప్రలోభాలు గట్రా కామన్)… 28,686 వోట్లు… మీరు చదివింది నిజమే… పది శాతానికి పైగా వోట్లు చెల్లలేదు… వీళ్లంతా పట్టభద్రులు… సిగ్గుపడదాం కాసేపు… చెల్లిన వోట్లు 2.23 లక్షలు… ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ వోట్లు వస్తే వాళ్లదే గెలుపు… సపోజ్, పది వోట్లు పోలై ఇద్దరికి మూడేసి, ఒకరికి నాలుగు వోట్లు గనుక వస్తే… నాలుగు వచ్చినోడే విజేత…
కనీసం ఇంత పోలింగ్ శాతం ఉండాలి, పోలైన వోట్లలో కనీసం ఇన్ని రావాలి అనే లెక్కలేమీ ఉండవు… కానీ ఎమ్మెల్యే ఎన్నిక వేరు… చెల్లిన వోట్లలో 50 శాతం, ఆపైన ఎవరికి వస్తే వారు విజేత… కోటా వోటు అంటారు, ఆ సగం మార్క్‌ను… మళ్లీ ఇందులో ప్రయారిటీ వోట్ల తకరారు వేరు… ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇలా… (నా వోటు ఫలానా వ్యక్తికి, తనకు కాకపోతే ఇదుగో ఈయన అని ప్రయారిటీలు చెప్పడం)…
నిన్నటి ఎన్నికల్లో ముగ్గురి నడుమ మంచి ఫైట్ జరిగింది… ఫస్ట్ ప్రయారిటీ వోట్ల లెక్కింపులో ఎవరికీ కోటా వోటు రాలేదు, అంటే సగం మార్క్ చేరలేదు… దాంతో దిగువ నుంచీ (తక్కువ వోట్లు సాధించిన వ్యక్తుల) ఎలిమినేషన్ ప్రక్రియ… ఒక్కొక్కరినీ తొలగిస్తూ పోతే, చివరకు ఎవరు ఎక్కువ వోట్లతో ఉంటే వాళ్లదే గెలుపు…
ఇలా 53 మందిని ఎలిమినేట్ చేసినా రిజల్ట్ రాలేదు… ఆ 53 మందికి వచ్చిన వోట్లు 16 వేల చిల్లర… చివరకు ప్రసన్న ఎలిమినేట్ అయ్యాక చూస్తే… సెకండ్ ప్రయారిటీ వోట్లతో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఫాయిదా ఏమీ రాలేదు… కానీ కోటా వోటు రాలేదు, అంటే సగం మార్క్ ఎవరికీ లేదు… దాంతో ఎక్కువ వోట్లు వచ్చిన బీజేపీ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు…
ఎలాగూ కోటా వోటు రాని సందర్భంలో ఎక్కువ వోట్లు వచ్చినవాడే విజేత అయినప్పుడు… మరిక ఈ సెకండ్ ప్రయారిటీలు, ఎలిమినేషన్ ప్రక్రియలు అవసరమా..? సాధారణ ఎన్నికల్లోలాగే ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేతలు అని ప్రకటిస్తే పోలా..? ఇంత సంక్లిష్ట, సుదీర్ఘ విధానం అవసరమా..? అసలు శానస మండళ్ల ఉనికి అవసరమా అనే చర్చ జరుగుతూ ఉంటే… దానికి ఇంత లావుపొడవు ఎన్నిక లెక్కింపు పద్ధతి దేనికి..?!
Share this Article