Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే ఇప్పుడు జరిగి ఉంటే… ఈ సీఎం ఉండి ఉంటే… కథ వేరే ఉండేది…

March 7, 2025 by M S R

.

దర్శకుడు దేవిప్రసాద్ తన జ్ఞాపకాల్ని ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు కొన్నాళ్లుగా… ఆసక్తికరంగానే ఉంటున్నాయి గానీ… ఇప్పటివరకూ అవి కోడి రామకృష్ణ జ్ఞాపకాల్లాగే ఉంటున్నాయి… సరే, రీసెంట్ పోస్టు ఒకటి చదివాక… ఆహా, ఆ సమయంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఎలా ఉండేదో కదా అనిపించింది…

ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే..? ఆయన మాటల్లోనే చదవండి ముందుగా…

Ads



Devi Prasad C ….. సినిమా పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాబ్ తరలిరావటానికి ప్రయత్నాలు జరుగుతున్న తొలిదశలో “భారత్‌బంద్” సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని “బూర్గుల రామకృష్ణారావు భవనం” పరిసరాలలో జరుగుతుంది.

అప్పటికి ఇప్పటిలా రద్దీ ఉండేదికాదు. సినిమాలో బంద్ కి వ్యతిరేకంగా హీరో రెహమాన్ (రఘు), సూర్య, జీడిగుంట శ్రీధర్ మరికొందరు జనాలను చైతన్యపరిచే సన్నివేశాలవి. ఓ 150 మంది జూనియర్ ఆర్టిస్టులను కూడా ప్లకార్డ్‌లతో సిద్ధం చేశాము.

అంతలో లోకల్‌ మేనేజర్ వచ్చి డైరెక్టర్ గారితో “ఇంకాసేపట్లో ప్రో-రిజర్వేషన్స్, యాంటీ-రిజర్వేషన్స్ ఉద్యమాలు చేస్తున్న స్టూడెంట్స్ చెరొక వైపునుండి ఊరేగింపుగా ఇటు వైపే వస్తున్నారట సర్” అని చెప్పటంతో షూట్ ఆపేసి అందరూ ఓ చోట (ప్రస్తుత లుంబినీ పార్క్ ఎదురుగ్గా) నిలుచున్నాం…

ఓ 5 నిమిషాల్లో దూరం నుండి విద్యార్ధుల నినాదాలు వినిపించటం మొదలైంది. సినిమాని ప్రేమించే దర్శకుడికెప్పుడూ చిత్రీకరణ సమయంలో సర్వేంద్రియాలూ “సినిమా” కోసమే పనిచేస్తాయి. కోడి రామకృష్ణ గారికి ఓ ఆలోచన వచ్చింది.

నిజమైన భావోద్వేగాలతో వొస్తున్న విద్యార్ధులలో వీళ్ళు కూడా కలిసివొస్తూ నినాదాలిస్తే … అది మన సన్నివేశానికి సరిగ్గా సరిపోతుంది. సహజంగానూ వొస్తుంది అన్నారు. అంతే. కెమేరామెన్ కోడి లక్ష్మన్‌ గారు తన కెమేరా జూం లెన్స్ వేసి సిద్ధం చేశారు…

ఉద్యమకారులు మలుపు తిరిగి వొస్తుండగానే దర్శకుడి సూచనతో హీరో బ్యాచ్ అందరూ సర్రున దూసుకుపోయి విద్యార్ధుల ముందు వరుసలో కలిసిపోయారు. అప్పటికి పాపులర్ నటులు కాకపోవటంతో విద్యార్ధులెవ్వరూ గుర్తుపట్టలేదు. కెమేరా హీరో బ్యాచ్ కి జూం చేసింది.

షాట్ అద్భుతంగా సహజంగా వొస్తుందని సంబరపడుతున్నంతలో… ఓ వైపు నుండి ఓ పోలీస్‌ జీప్, ఓ పెద్ద వ్యాన్ సర్రున దూసుకొచ్చి ఆగాయి అచ్చు సినిమాలలోలాగానే. లాఠీలతో దిగిన పోలీసులు రెహమాన్‌నీ మిగతా నటులనీ జుట్టుపట్టుకుని కొందరినీ, చొక్కాలు పట్టుకుని కొందరినీ తిడుతూ, మేం యాక్టర్స్ అండి అని చెబుతున్నా లాక్కెళ్ళి వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా అందరం అటువైపు పరిగెట్టాము.

కోడి రామకృష్ణ గారిని గుర్తుపట్టిన పోలీసులు మీరెందుకొచ్చారిక్కడికి వెళ్ళిపోండి అంటూ తోసేశారు. వాళ్ళు మావాళ్ళు అంటున్నా వినిపించుకోకుండా వ్యాన్లోకి తోసేసి తీసుకెళ్ళిపోయారు. అయితే మమ్మల్నందరినీ కూడా అరెస్ట్ చెయ్యండి అంటూ డైరెక్టర్ గారు మరో వ్యాన్ ఎక్కటంతో అందరమూ ఎక్కి పోలీసు జులుంకి వ్యతిరేకంగా నినాదాలిచ్చాము…

మరో పది నిమిషాల్లో సినిమా యూనిట్ మొత్తం పోలీస్‌స్టేషన్‌లో వుంది. ఆ రోడ్ల మీద షూటింగ్‌కి మాకు పర్మిషన్ ఉంది. నటుల మీద ఎలా చెయ్యిచేసుకుంటారు అంటూ డైరెక్టర్‌ గారు, కె.ఆదిత్య (రచయిత, దర్శకుడు) గారు ఓ పక్క, శాంతిభద్రతల సమస్య అని పోలీసులు ఓపక్క …. వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది…

మా జూనియర్ ఆర్టిస్ట్‌లందరూ పోలీస్‌స్టేషన్ బయట బైఠాయించి నినాదాలివ్వటంతో నివ్వెరపోయారు పోలీసులు. వార్త ఎన్.టి.రామారావు (అప్పుడు ప్రతిపక్ష నాయకులు) గారి వరకూ చేరిపోయి వారి సెక్రెటరీ స్పందించటం, డి.రామానాయుడు గారు, ప్రతాప్ అర్ట్స్ కె.రాఘవ గారు, భానుచందర్, వినోద్‌కుమార్, అశోక్‌కుమార్ ఇంకా ఎందరో వచ్చారు.

పెద్దలు అందరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆవేశానికి స్పీడెక్కువ – ఆలోచనకి పవరెక్కువ. మాటలే మనసులను కలుపుతాయి – మాటలే మనుషుల్ని విడదీస్తాయి. నటుల మీద చేయిచేసుకోవటం ముమ్మాటికీ మా తప్పే అన్నారు పోలీసులు. ఉద్యమకారులతో మావాళ్ళను కలపడం మాదికూడా తప్పేలెండి అన్నారు దర్శకులు…… ఇదీ పోస్టు…

ఆ సందర్భంలో ఎవరిది తప్పు..? నా ఉద్దేశం సినిమా యూనిట్‌దే… కొన్నిసార్లు ఉద్యమాలు హింసారూపం ధరిస్తే పోలీసులు చాలా సీరియస్ యాక్షన్‌లోకి దిగిపోతారు… వాళ్ల డ్యూటీ అది… ఆ ఊరేగింపుల్లోకి దూరడం సినిమా యూనిట్ తప్పే… వాళ్లను అనుమతినిచ్చింది రోడ్ల మీద షూటింగుకే తప్ప, లా అండ్ ఆర్డర్ సీన్లలోకి దూరడానికి కాదు…

అందుకే అనిపించింది… జగన్, రేవంత్ రెడ్డి వంటి సీఎంలు ఉండి ఉంటే ఆరోజు కథ వేరుగా ఉండేది… ఎక్కడ చిన్న తేడా కొట్టినా వ్యవహారం అనూహ్యంగా మారి ఉండేది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions