మనం తరచూ చెప్పుకునేదే… గాంధీ, బుద్ధుడి మీద బయోపిక్ సినిమాలు తీసినా సరే… మన హీరోలు దుడ్డుకర్రలు పట్టాల్సిందే… డాన్సులాడాల్సిందే… అవును మరి, ఎంతటి ఉదాత్తమైన కథైనా సరే, సగటు సినిమా హీరో ఇమేజీకి తగినట్టుగా అది మారాల్సిందే… మారి తీరాల్సిందే..! ఇప్పుడూ అంతే..!! నంబర్ వన్ అమితాబ్ రక్తికట్టించిన కోర్టు డ్రామా… ఆ కథలోని ఎమోషన్, జనానికి కనెక్టయ్యే మెయిన్ ప్లాట్… పింక్ అనే ఆ హిందీ సినిమాకు బలం… కథను నిజాయితీగా ప్రజెంట్ చేశారు… కమర్షియల్ ఫ్లేవర్ అంటూ కథను పక్కదోవ పట్టించలేదు… అది తమిళంలోకి వచ్చేసరికి… అజిత్ హీరో… మరి సౌతిండియన్ హీరో అంటే అలా ప్లెయిన్‌గా కథను చెబితే ఎలా..? అందుకే కాసిన్ని మసాలాలు దట్టించారు… ఉత్త పులిహోర ఎవరికి కావాలి..? బిర్యానీగా కనిపించాల్సిందే… ఇప్పుడు అదే కథను, మరి అంతటి పవన్ కల్యాణ్ తీస్తున్నాడంటే ఇంకెలా ఉండాలి..? ఏం మార్పులు చేస్తారు..? అసలే ఓ పార్టీ అధినేత, విపరీతమైన పాపులారిటీ, సినిమా హీరోగా కొంత గ్యాప్… ఈ స్థితిలో అదే కథకు ఏం మార్పులు చేస్తారో చూడాలని సగటు సమీక్షకుడు కూడా కొంత ఆసక్తిని కనబరిచాడు… పవన్ సినిమాలకున్న లిమిటేషన్స్ తెలిసి కూడా..!!
అనుకున్నట్టుగానే… అనుమానించినట్టుగానే… ఆ పింక్ కాదు ఇది… జస్ట్, ఆ కోర్ పాయింట్ తీసుకున్నారు… పనన్కు తగినట్టుగా మార్పులు, చేర్పులు… సోకాల్డ్ కమర్షియల్ హంగులు, హీరో ఇమేజీ… ఇదే కదా మనకు అలవాటైపోయిన చట్రం… అందుకే కోర్టులో చెప్పేది చెప్పాలి, బయటికి వచ్చి కోటు విప్పేసి, దుడ్డుకర్ర పట్టుకోవాలి… వాయించాలి… దీనికితోడు ఓ ఫ్లాష్ బ్యాక్… అందులో ఒక హీరోయిన్, ఉండీలేనట్టున్న పాత్రలో ఆ శృతిహాసన్… అక్కడక్కడా పొలిటికల్ ఛాయలు, అవే మేనరిజమ్స్… అన్నీ పెట్టారు… పెడతారు… పెట్టకతప్పదు… లేకపోతే మన సౌతిండియన్ పాపులర్ హీరోయిజం, ఫ్యానిజం అంగీకరించదు… అదే నిజం… అది పవన్ కల్యాణ్ అయినా సరే, మరే ఇతర హీరో అయినా సరే… నిజానికి ఈ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ గనుక యాడ్ చేయకపోతే సినిమా మంచి హిట్ టాక్ కొట్టేదేమో… (అంటే, ఇప్పుడు బాగా లేదని కాదు, సినిమా రేంజ్ ఇంకాస్త పైన ఉండేది అని అర్థం…)
Ads
సినిమాలో ముగ్గురు అమ్మాయిలు… అనన్య, అంజలి, నివేదా… సహజంగానే నివేదా నటనపరంగా కాస్త డామినేట్ చేస్తుంది… చేసింది… ఎప్పుడైతే ప్రకాష్ రాజ్‌ను కూడా సినిమాలో ప్రవేశపెట్టారో… హీరోయిజాన్ని విపరీతంగా ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించారో… ఈ ముగ్గురికీ కాస్త స్కోప్ తగ్గిపోయింది… నటన విషయానికి వస్తే పవన్, ప్రకాష్ రాజ్… వంక పెట్టడానికి ఏముంటుంది..? అలవోకగా లాగించారు… పింక్ సినిమా చూసినవాళ్లకు ఏమిటీ అతి అనిపించవచ్చుగాక… కానీ కొత్తగా ఈ సినిమాను చూసేవాళ్లకు బాగున్నట్టే అనిపిస్తుంది సినిమా… సరే, మన హీరోల తాలూకు అతి మనకు ఎలాగూ అలవాటైంది కాబట్టి, దాన్ని ఇగ్నోర్ చేస్తూ, సినిమా చూస్తే… కథలోని అసలు బలం ఆకట్టుకుంటుంది…
నిజానికి పవన్ చాలా విషయాల్లో సాహసి, మొండి… ప్రస్తుతం విపరీతమైన పాపులారిటీ… ఏదైనా డిఫరెంట్, ప్రొ-సొసైటీ సబ్జెక్టు గనుక తీసుకుంటే అది జనంలోకి బలంగా వెళ్లే స్కోప్ ఉంది… వకీల్ సాబ్ సహా ఇలాంటి కథలే తనకు ఇప్పుడు కావల్సింది… ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా ఏదిపడితే అది తీయలేడు… సగటు హీరోలా నాలుగు గెంతులు, నాలుగు ఫైట్లు పవన్‌కు సరిపోవు… దాన్ని మించి ఏదో కావాలి… కాకపోతే ఆ ‘అతి’ గనుక లేకపోతే మరింత ఫాయిదా… కానీ దాన్ని వదిలించుకోలేడు… పార్టీ అయినా, సినిమా అయినా… తను అందులోనే బందీ…!! అభిమాని కూడా ప్రేక్షకుడే, కానీ ప్రతి ప్రేక్షకుడూ అభిమాని కాడు… ఈ చిన్నసూత్రాన్ని పవన్ కొత్తగా అర్థం చేసుకుంటే చాలు… కానీ తను వినడు… తనే కాదు, ఏ పాపులర్ హీరో వినడు… అంతే… కాలం మార్చాల్సిందే…
Share this Article