.
Prabhakar Jaini ……. గద్దర్ అవార్డులకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బృహత్కార్యం తెలంగాణా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పట్టుబట్టి, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి సరైన స్పందన రాకున్నా, దిల్ రాజు సహకారంతో చేపట్టారు…
గత ప్రభుత్వం మా దగ్గర వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకుని, దరఖాస్తులను మూలకు పడేసింది. పైకి మాత్రం సినిమా ఫంక్షన్లలో హీరోలను భుజాల మీదకు ఎక్కించుకుని ప్రగల్భాలు పలికారు. కానీ, ఏనాడూ తెలంగాణా సినిమాకు వీసమెత్తు సహాయం కూడా చేయలేదు.
Ads
నాయకులను కలిసి మా బాధ, మా నొప్పి వినిపించుకుందామన్నా అవకాశం రాలేదు. అదే బడా హీరోలు పెద్ద పెద్ద కార్లలో బహుమతులు, పూల బొకేలు పట్టుకుని వెళ్ళగానే, రాచ మర్యాదలతో, స్వాగత సన్మానాలు, శాలువాలు, కౌగిలింతలతో పాటు టిక్కెట్ రేట్ల పెంపు, వినోదపు పన్ను రాయితీలు లభించేవి. తెలంగాణా సినిమా ఆనాడు దుఃఖించింది…
ఇప్పుడు రేవంత్ రెడ్డి, దిల్ రాజు కలిసి ఒక అద్భుతమైన స్కీమ్ ప్రకటించారు. ఏ ప్రభుత్వ నిర్ణయం అయినా 100% ప్రజలకు నచ్చదు. కారణాలు అనేకం. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీల, సిద్ధాంత అభిప్రాయ బేధాల వల్ల అందరికీ అన్నీ నచ్చాలని లేదు.
కానీ, నచ్చకపోవడం వేరు. అభిప్రాయ భేదాలు ఆహ్వానించదగ్గవే. కానీ, దాని కారణంగా విద్వేషం పెంచుకుని, ‘గద్దర్ అవార్డు’లను బహిష్కరించాలని కోవడం మూర్ఖత్వం. బడా బడ్జెట్ సినిమాల వారికి, ఒక కులం వాళ్ళకి, కొన్ని ప్రాంతాల వాళ్ళకి ‘గద్దర్ అవార్డులు’ నచ్చకపోవచ్చు.
అసలు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు రేవంత్ రెడ్డి అంటేనే నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో ఉంటూ, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను, రాయితీలను అప్పనంగా అనుభవిస్తూ…, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు లేనంత అహంభావపు పొరలు కమ్ముకున్న సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాబట్టి సహించారు.
చిన్న ఝలక్ ఇచ్చి వదిలి పెట్టారు. అదే, ఆంధ్రప్రదేశ్ లో గనుక, చంద్రబాబు పేరును గానీ, పవన్ కళ్యాణ్ పేరును గానీ, లోకేశ్ పేరును గానీ మరిచిపోతే.., చంద్రబాబు , లోకేశ్ చూపించే సినిమా వేరే విధంగా ఉండేది. ఈ మనస్తత్వం కలవాళ్ళే ‘గద్దర్’ అవార్డులను వ్యతిరేకిస్తున్నారు. ఒక విధంగా బాయ్ కాట్ చేస్తున్నారు.
మీకు ‘గద్దర్’ అంటే ఇష్టం లేకపోవచ్చు. ఆయన బొమ్మ, మీ ఇంటి డ్రాయింగ్ రూముల్లో పెట్టుకోవడానికి మీకు నామోషీ కావచ్చు… కానీ, ఇప్పటి వరకు వ్యక్తుల పేర్ల మీద ఇస్తున్న అవార్డులు తీసుకోవడంలో వారికే అభ్యంతరం లేదు కదా…. ఆ వ్యక్తులు కూడా వంద శాతం అందరికీ నచ్చాలనేం లేదు కదా? అప్పుడు ఎందుకు బహిష్కరించ లేదు? ఇది వలసవాదపు అహంభావం!
కాబట్టి, ఇలా బాయ్ కాట్ చేసిన వారెవరికైనా సరే, వెంటనే తెలంగాణా ప్రభుత్వం అన్ని రాయితీలను, అన్ని అనుమతులను, అన్ని సదుపాయాలను తొలగించాలి. అక్రమ నిర్మాణాలను సమూలంగా నేలమట్టం చేయాలి. ఇంత వరకూ చూస్తూ ఊర్కున్న అక్రమ నిర్మాణాలను, స్టూడియోలు కడతామని భూములు తీసుకుని, మల్టీప్లెక్స్ లు కట్టుకుని, అప్పనంగా అనుభవిస్తున్న భూములను, తక్షణమే స్వాధీనం చేసుకుని, ‘గద్దర్ అవార్డుల’ను బహిష్కరించిన వారిని, బ్లాక్ లిస్టులో పెట్టాలి.
గోడ మీద పిల్లుల్లా అటూ ఇటూ మాట్లాడేవారిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ వారిపైన సరైన చర్యలు తీసుకోవాలి.
నేను ‘గద్దర్ అవార్డు’కు అప్లై చేస్తాను. నా సినిమాలో బలముంది. దమ్ముంది. అవార్డు కొట్టే సత్తా ఉంది. నా సినిమాకు ఆల్రెడీ 7 అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి… కాబట్టి, నేను ఇది ఎవరికో మస్కా కొట్టడానికి పెట్టిన పోస్ట్ కాదు.
ఇది నా రాష్ట్రం, నేను గౌరవిస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నా రాష్ట్రమే. నా తెలుగు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ను కూడా గౌరవిస్తాను… రాష్ట్రాలు విడిపోయి తర్వాతనే, చంద్రబాబే నాకు 2014 సంవత్సరానికి ‘నంది’ అవార్డు ఇచ్చారు.
కాబట్టి, దయచేసి, అందరూ ‘గద్దర్ అవార్డు’ పోటీల్లో పాల్గొనాలని నా విన్నపం. బలమైన పోటీ ఉన్నప్పుడు గెలవడంలోనే మజా!………
Share this Article