.
Murali Buddha ….. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీ మే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం .
*** *** *****
2017 లో ఆర్టీఐ కార్యాలయం.. మధ్యాహ్న సమయం… ఏదో పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు అందించాడు . ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు . షఫీకుజ్జమాతోపాటు మరో అధికారి . ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక న్యాయవాదులుగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు .
Ads
ఆర్టిఐ కేసు విషయంలో ఆర్టిఐ కమిషనర్ గా ఉన్న నన్ను కలవడానికి వచ్చారు . తెలంగాణ యూనివర్సిటీలో తమ క్లయింట్ కేసు ఉందని , కేసు త్వరగా వస్తే న్యాయం జరుగుతుంది అని చెబుతుంటే .. వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డును అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయి .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను .
**** *****
డిగ్రీ పూర్తి కాగానే 1987 సెప్టెంబర్ లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డికి వెళ్ళాను . ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాను . అప్పుడు అక్కడి కలెక్టర్ షఫీకుజ్జమా… ఆంధ్రభూమికి కొత్తగా వచ్చాను అని లెటర్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను .
అంతకు ముందు జిల్లా మంత్రి కరణం రామచంద్ర రావుకు డిపిఆర్ఓ భూమికి కొత్త అని పరిచయం చేస్తే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో భూమికి కొత్తా ? భూమికే కొత్తనా ? అని జోక్ వేశారు .
1987 నుంచి బాబు సీఎం అయ్యాక అసెంబ్లీలోనే కరణం మాట్లాడుతూ మాట్లాడుతూనే అస్వస్థతకు గురై, మరణించేవరకు అనేక సార్లు కరణం ఉపన్యాసాలు విన్నాను, ఒక్క సారి కూడా జోక్ వేయగా వినలేదు . కలెక్టర్ మాత్రం ఎలాంటి జోక్ వేయకుండా కాసేపు మాట్లాడి పంపించేశారు .
**** *****
తరువాత హైదరాబాద్ వచ్చాక ఓ రోజు అనుకోకుండా 1996 ప్రాంతంలో షఫీకుజ్జమా డ్రామా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చింది . జూబ్లీ హల్ లో సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియా మొత్తం వచ్చింది . మద్యనిషేధాన్ని ఎత్తి వేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయం అది .
ఇంకా మీటింగ్ పూర్తి కానందువల్ల బాబు కోసం మీడియా ఎదురు చూస్తుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా వద్దకు షఫీకుజ్జమా కొన్ని కాగితాలు చదువుతూ రాష్ట్రంలో మద్యనిషేధం ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతున్నారు .
కల్తీ మద్యంతో ఎంత మంది మరణించారు . ఎన్ని అక్రమ మద్యం కేసులు , మద్యనిషేధం ఎత్తివేయకపోతే ఎంత ప్రమాదకరమో వివరించే విధంగా ఆ గణాంకాలు ఉన్నాయి . చెప్పాల్సింది అంతా ఆయన చెప్పి వెళ్లి పోయాక . కొద్ది సేపటికి సీఎం చంద్రబాబు వచ్చారు .
హష్మీ అని ఉర్దూ రిపోర్టర్ బాబు రాగానే మద్యనిషేధం ఘోరంగా విఫలమైంది ? అంటూ ఆ అధికారి చెప్పిన అంకెలు చెప్పుకొచ్చాడు . నిజమా ? అని చంద్రబాబు బోలెడు ఆశ్చర్య పోయాడు. . మా అల్లుడు నాకన్నా గొప్ప నటుడు అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఉరికే అనలేదు .
****
కేసు త్వరగా వస్తే మా క్లయింట్ విద్యా సంవత్సరం కాపాడినవారు అవుతారు . కమిషన్ నుంచి నోటిస్ వస్తే చాలు పని అయిపోతుంది అని షఫీకుజ్జమా అడగగానే ప్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి, పీఎస్ ను పిలిచి వీరి కేసు వెంటనే రావాలి అని చెప్పాను .
షఫీకుజ్జమా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంటే 1987 నాటి నా పరిచయం గుర్తు చేసి .. 96లో మద్యనిషేధం విఫలం అంటూ మీరు చదివి వినిపించిన ఆ అంకెలు అన్నీ బాబు ఆదేశంతోనే కదా ? అని అడగాలి అని నోటి వరకు వచ్చినా అడగకుండా ఉండిపోయాను . ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకే పరిమితం కావడమే మంచి సంప్రదాయం అనిపించి మౌనంగానే ఉండి పోయాను .
ఐఏఎస్ అధికారులు ఎంత పరిచయం ఉన్నా కొన్ని విషయాలు ముఖాముఖిలో కూడా పంచుకోరు . అలాంటిది బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అని మీడియా వస్తే బాబుకు సంబంధం లేకుండా ఎక్సయిజ్ కమిషనర్ వచ్చి మద్యనిషేధం ఎలా విఫలం అయిందో చెబుతారా ? తెలిసిన విషయం అడగడం ఎందుకు అని అడగలేదు.
సంప్రదాయ ముస్లిం జీవనం గడిపే అతనికి ఎక్సయిజ్ శాఖ అస్సలు ఇష్టం లేదు అని విన్నాను . 1987 లో రిపోర్టర్ గా అతనికి నన్ను నేను పరిచయం చేసుకుంటే … సరిగ్గా మూడు దశాబ్దాలు గడిచిన తరువాత ఆర్టీఐ కమిషనర్ గా ఉన్న నన్ను న్యాయవాదిగా అతను పరిచయం చేసుకోవడం ఏదో సినిమా కథలా అనిపించింది .
****
హిందూ చీఫ్ రిపోర్టర్ వర్లు ఒకసారి సిసిఎల్ఏ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు . కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళగానే కమిషనర్ వర్లును చూసి సార్ మీరు వచ్చారా ? అని లేచి నిలబడి స్వాగతం పలికారు ..
ఆ రోజుల్లో మీడియాకు ఇంత గౌరవం ఉండేది అని ముందుగానే నిరయానికి వచ్చేయకండి . కమిషనర్ లేచి నిలబడి స్వాగతమ్ పలికింది నిజమే . కానీ కారణం వేరు . హిందూలో వర్లు చీఫ్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు అతని బ్యూరోలో ఒక రిపోర్టర్ గా సిసిఎల్ఏ కమిషనర్ ఉన్నారు . ఎప్పుడు ఉద్యోగం వదిలి , ఎప్పుడు సివిల్స్ కు ఎంపిక అయ్యారో పెద్దగా దృష్టి పెట్టలేదు . తన బ్యూరోలో రిపోర్టర్ వద్దకు తానే ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడం ఒక అరుదైన అనుభవం .
డక్కన్ క్రానికల్ లో అయేషా అని అమ్మాయి క్రైం రిపోర్టర్ . క్రైం రిపోర్టర్లు ఎక్కువగా పోలీసులు ఇచ్చిన సమాచారంపై ఆధారపడాలి . ఈ అమ్మాయి మాత్రం రోజూ మార్చురీకి వెళ్లి సమాచారం సేకరించేది . అయినా ఎడిటర్ జయంతి వేధిస్తోంది అని బాధపడేది .
ఆ వేధింపులు తట్టుకోలేక డక్కన్ క్రానికల్ కు రాజీనామా చేసి ఉర్దూ పేపర్ లో చేరింది . ఆర్టీఐ కమిషనర్ గా ఓ రోజు కేసులు చూస్తుంటే ఓ అధికారి ‘మా కలెక్టర్ స్ట్రిక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం’ అని కలెక్టర్ పేరు చెప్పగానే సంతోషం వేసింది .
ఆయెషా గ్రూప్ వన్ కు సెలక్ట్ అయింది అని తెలుసు, చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆయెషా ను జిల్లా కలెక్టర్ గా నియమించారు . ఓపికతో ఉండి తమ నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి అని చాలామంది నిరూపించారు .
****
ఐతే జర్నలిజంలోకి రమ్మంటావా ? అని ప్రశ్నిస్తే వద్దే వద్దు అంటాను . ఆర్థిక సంస్కరణల తరువాత అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి . అదే సమయంలో అంతే స్పీడ్ గా మీడియా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి . తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అవకాశాలు చాలా వేగంగా పడిపోయాయి .
పైగా ఇప్పుడు అంతా రాజకీయ పార్టీల మీడియానే . స్వతంత్ర మీడియా అని చెప్పుకొనేది కూడా అటు రైట్ వైపో ఇటు లెఫ్ట్ వైపో స్వతంత్రంగా పని చేస్తున్నావే . 1999 లో టీడీపీ స్వతంత్రులకు టికెట్లు , మంత్రి వర్గంలో స్థానం కల్పించింది . ఒక పార్టీ తరపున పోటీ చేశాక తటస్తులు ఏమిటో ? ఇప్పుడు మీడియా కూడా అలాంటి తటస్తమే .
ఎడిటర్లను , పత్రికలో వార్తలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మొదలుకొని , వెయ్యి లోపు సబ్ స్కైబర్స్ ఉన్న యూ ట్యూబ్ వరకు ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తోంది . పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మధ్యలో మీడియాలోకి వస్తే వేరు, కానీ దీనిని ఉపాధిగా భావించి వస్తే దినదిన గండం ఆరు నెలల ఆయుష్యు అన్నట్టు ఉంటుంది .
వేజ్ బోర్డు సిఫారసులు ఉంటాయి .అమలు చేస్తే దాదాపుగా గ్రూప్ వన్ అధికారులకు లభించే స్థాయిలో వేతనాలు ఉంటాయి . ఒక్క ఆంధ్రభూమి తప్ప మరే మీడియా సంస్థ వీటిని అమలు చేయలేదు …
Share this Article