.
ముందుగా ఓ కథ చదవండి… స్పాయిలర్ ఏమీ కాదు… పలుసార్లు మీడియాలో వచ్చిన కథే… తెలిసిన కథే…
ఉజ్మా అహ్మద్… ఈమె కథే… తనకు మలేషియాలో పాకిస్థానీ వ్యక్తి తాహిర్ అలీ పరిచయం అయ్యాడు… ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది, అతనితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఉజ్మా భావించింది…
Ads
అయితే, తాహిర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఉజ్మా పాకిస్థాన్ వెళ్ళిన తర్వాత, అతను అప్పటికే వివాహితుడని, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది… అంతేకాకుండా, అతని కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా తాహిర్‌ను వివాహం చేసుకుని, పాకిస్థాన్‌లో ఉండాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు…
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత, ఉజ్మా ఇస్లామాబాద్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి చేరి, తాను భారతీయురాలినని, తనకు బలవంతంగా పెళ్లి చేశారని, మోసపోయానని, తనకు ప్రమాదం ఉందని తెలుపుతుంది… అక్కడ భారతీయ రాయబారి జె.పి. సింగ్ ఆమెను రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు…
అయితే, ఆమె రాయబార కార్యాలయంలోకి ప్రవేశించడం అంత సులభమైన విషయం కాదు. ఉజ్మాను రక్షించడానికి, భారతీయ రాయబార కార్యాలయంలోని దంపతులిద్దరు ఆమె బంధువులుగా నటించి, తాహిర్ అలీ కళ్లుగప్పి ఆమెను రాయబార కార్యాలయానికి తీసుకువచ్చారు…
భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది…, అసలే అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్… ఆమె జె.పి. సింగ్‌కు కఠినమైన ఆదేశాలను ఇచ్చింది… ఉజ్మాను రక్షించేందుకు, రాయబార కార్యాలయంలో ఆశ్రయం ఇచ్చారు… ఎన్నేళ్లయినా సరే అక్కడ ఉంచాలని, క్షేమంగా ఇండియాకు చేర్చాలని చెప్పింది…
అసలే ఓ శతృదేశం… అక్కడ రాయబారిగా పనిచేయడమే పెద్ద సవాల్… అదీ పాకిస్థాన్ వంటి ధూర్తదేశంలో… జేసీ సింగ్ హామీ ఇచ్చాడు… ఆమె అక్కడ సురక్షితంగా ఉన్నప్పటికీ, తాహిర్ అలీ మరియు అతని అనుచరులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ పరిస్థితుల మధ్య, భారతీయ అధికారులకు వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఇస్లామాబాద్ హైకోర్టులో కేసు దాఖలు చేసి, న్యాయపరంగా ఉజ్మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. చివరికి కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది… అసలే అప్పుడు కులభూషణ్ జాదవ్ కేసు అంతర్జాతీయ కోర్టులో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా నడుస్తోంది…
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జె.పి. సింగ్ ఆమెను వ్యక్తిగతంగా భారతదేశానికి తీసుకువచ్చి, కుటుంబంతో తిరిగి కలిపారు… ఇదండీ కథ… పైకి చెప్పడానికి సింపుల్‌గా ఉన్నా… ఇదొక అంతర్జాతీయ వివాదం… అంత వీజీ కాదు… అసలు ఆమె చెబుతున్నది కరెక్టే అని ఖరారు చేసుకోవడమే అసలు ఫస్ట్ టాస్క్…
ఇది ఈరోజు వచ్చిన ది డిప్లొమాట్ అనే సినిమా కథ… రియల్ స్టోరీ ఇది… కొంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు, కానీ ఆద్యంతం ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు శివమ్ నాయర్… ఇందులో రాయబారి జేపీ సింగ్ పాత్ర పోషించిన జాన్ అబ్రహాం గురించి చెప్పడానికి ఏముంది..? మంచి మెరిట్, అనుభవం, పరిణతి ఉన్న నటుడు…
చెప్పుకోవల్సింది లీడ్ రోల్ ప్లే చేసిన, అంటే ఉజ్మా పాత్ర పోషించిన సాదియా ఖతీబ్ గురించి… బాగా చేసింది… జమ్మూ అమ్మాయి… చేసినవే మూణ్నాలుగు సినిమాలు… ఉజ్మా పాత్రలో జీవించింది… సుష్మా స్వరాజ్ పాత్రలో రేవతి చేసింది…
(జాన్ అబ్రహాం, సాదియా, ఉజ్మా, జేపీ సింగ్)
ఇండియా- పాకిస్థాన్ బాపతు సినిమా అయితే… ప్రేక్షకులు ఇట్టే కనెక్టవుతారు… కానీ యాక్షన్, థ్రిల్, వార్ హీరోస్ వంటి కథలయితే అదొక ఆకర్షణ… కానీ ఇలాంటి కథల్ని ఆసక్తికరంగా చెప్పడం అంత ఈజీ కాదు… అంతర్జాతీయ వ్యవహారాలు, దౌత్య చిక్కులు ఎట్సెట్రా తెలిసినవాళ్లకు చెప్పడం ఈజీ, కానీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడం కష్టం… అందులో ఈ దర్శకుడు సక్సెసయ్యాడు..!!
మనవాళ్లు ఎంతసేపూ కథలు లేవు మొర్రో అంటుంటారు… ఎందుకు లేవు..? నిజజీవిత గాథలు మన చుట్టే ఎన్నో… ఎన్నెన్నో… ఎటొచ్చీ వాటిని ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా తీయగలిగే తెలివిలేక, రొటీన్ పిచ్చి ఫార్ములా కథల చుట్టే చక్కర్లు కొడుతుంటారు మనవాళ్లు… అదీ మనోళ్ల టేస్టు..!! అవునూ, ఇండియాకు వచ్చాక ఉజ్మా జీవితం ఎలా ఉంది..? ఈ సినిమా దర్శకుడు ఆ కథ జోలికి పోలేదు..!!
Share this Article