.
( రమణ కొంటికర్ల ) ……. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందనే పాప్యులర్ కోట్ ను మనం ఈమధ్య తరచూ వింటూనే ఉన్నాం. కానీ, ఒక్క అవమానం జీవితాన్ని మార్చేసిందనేది ఈమధ్య విన్నామా..? అలాంటి కథే హేమంత్ ది. ఓ కూలీ కొడుకు ఐఏఎస్ ఎలా అయ్యాడు.. ఎందుకు తనకు కలెక్టర్ కావాలనిపించిందో చెబుతుందీ కథ.
ప్రముఖ పారిశ్రామికవేత్త.. తెలంగాణా రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ పర్యవేక్షకుడు ఆనంద్ మహీంద్రా తన X ఖాతాలో చేసిన పోస్టుతో.. అవమానం నుంచి రగిలి ఆకాశానికెదిగిన ఓ యువకుడి కథ వెలుగులోకొచ్చింది.
Ads
ఆ యువకుడి తల్లికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే సమయంలో తనకు జరిగిన అవమానం బాధించేది. అదే సమయంలో తన పట్టుదల స్ఫూర్తిదాయకమైనది. కాబట్టి, మీరు అవమానాలకు గురైనప్పుడు మనస్థాపం చెందడం మాని.. సమయాన్ని వృధా చేయకుండా మీ విమర్శకులే వావ్ అనుకునేలా సవాల్ విసిరండి. ఎదిగి నిరూపించండంటూ ఆనంద్ మహీంద్రా తన X ఖాతాలో పేర్కొన్నాడు.
హేమంత్ ఎవరు.. ఆయన కథేంటసలు..?
హర్యానాకు చెందిన హేమంత్ పరీఖ్ ఇప్పుడో ఐఏఎస్ అధికారి. అంతకుమునుపు ఓ దినసరి కూలీ కొడుకు. తన తల్లి కూలీ పనులు చేసుకుంటూ బతికేది. కుటుంబాన్ని పోషించేది. హేమంత్ తల్లి చేసిన పనికి ఒక రోజు వేతనం 200 రూపాయులు పొందాల్సి ఉంటే.. సదరు కాంట్రాక్టర్ మాత్రం తరచూ కట్ చేసి డబ్బులిచ్చేవాడు.
దాన్నే హేమంత్ ఓరోజు తన తల్లి తరపున వెళ్లి ప్రశ్నించాడు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఓ వెక్కిరింపు స్వరంతో.. నువ్వేమన్నా కలెక్టర్ వా బాగా మాట్లాడుతున్నావ్ అంటూ తోటి కూలీలందరి ముందూ తనను అవమానపర్చాడు. అదిగో ఆ అవమానభారం హేమంత్ ను రగిలించింది. ఏకంగా ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ను చేసింది.
అంతకుముందు, అందరిలాగే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బతకుతూ అమ్మను, కుటుంబాన్నీ బాగా చూసుకోవాలనుకున్న హేమంత్ దృష్టి కాంట్రాక్టర్ చేసిన అవమానంతో యూపీఎస్సీపై పడింది. జేబులో కేవలం 14 వందల రూపాయలతో ఢిల్లీ బయల్దేరాడు. అవి ఖర్చైపోతే పరిస్థితేంటో తెలీదు. మార్గదర్శకులెవ్వరూ లేరు. కానీ, హేమంత్ దగ్గర ఉన్నవి కేవలం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం మాత్రమే.
హేమంత్ దైన్యస్థితి విన్న చాలామంది చదువుకుంటానంటున్నాడనే ఉద్ధేశంతో ఎంతో కొంత సాయం చేశారు. మరికొందరు చెప్పొచ్చావులే నీలా ఎందరిని చూడలేదు.. ఏం ఐఏఎస్ అంటే మాటలనుకున్నావా అంటూ ఎగతాళి చేశారు. కానీ, హేమంత్ నిరుత్సాహపడలేదు. అవిశ్రాంతంగా చదివాడు. 2023, ఏప్రిల్ 16 యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. హేమంత్ 884 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు.
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొంది ఐఏఎస్ సాధించిన హేమంత్ స్టోరీ విన్నవారు వావ్ అంటుంటే.. గతంలో తనను, తన తల్లినీ ఎగతాళి చేసినవారు నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారే ఇప్పుడు తనను అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హేమంత్ స్టోరీపై నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. ఏదైనా మనసుకు బాధ కల్గించే ఘటన జరిగినప్పుడు దాన్నే మనసులో పెట్టుకుని కుమిలిపోకుండా.. దాన్నుంచే తిరిగి గోడకు కొట్టిన రబ్బర్ బాల్ లా బిర్రుతో ఎలా తిరిగి పైకి లేస్తామో హేమంత్ స్టోరీ చెబుతోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చర్యకు, ప్రతిచర్య అంటే హేమంత్ కథలా ఉండాలంటున్నారు మరికొందరు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటే.. విజయాల ద్వారా హేమంత్ లా విమర్శకులకు చెప్పే సమాధానంలా ఉండాలంటున్నారు. హేమంత్ సక్సెస్ స్టోరీ ఆత్మన్యూనతతో బాధపడేవారికీ.. ఏదో జరిగిందని కుమిలిపోయేవారికి ఇప్పుడో బూస్టప్ లాంటింది!
Share this Article